గులాబీ పార్టీకి తెలంగాణలో ఈసారి అంత వీజీ కాదు.!

తెలంగాణలో మరోమారు.. కేసీయార్ సర్కారు.! ఇదీ భారత్ రాష్ట్ర సమితిగా మారిన ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి నేతల నినాదం.! తెలంగాణ రాష్ట్ర సమితిలోని ‘తెలంగాణ’ని తీసేసి, ‘భారత్’ని ఆ స్థానంలో వుంచిన గులాబీ పార్టీ, ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్ని మరింత ఛాలెంజింగ్‌గానే తీసుకోవాల్సి వస్తోంది.

ఔను, చాలా సవాళ్ళున్నాయి గులాబీ పార్టీ ముందర.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో. తెలంగాణలో బీజేపీ బలపడింది. కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. గులాబీ పార్టీ గెలిచినా, మెజార్టీ చాలా తక్కువగా రావొచ్చన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన.

టిక్కెట్ల కేటాయింపు పరంగా, కాంగ్రెస్ కావొచ్చు, బీజేపీ కావొచ్చు.. ఈ రెండు పార్టీలూ చేసే స్వీయ తప్పిదాలే, గులాబీ పార్టీకి వరంగా మారతాయ్.! లేదంటే, గులాబీ పార్టీకి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అంత తేలిక కాదు.

టిక్కెట్లు దక్కించుకున్న నేతల్లోనూ కొందరు, గులాబీ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడం చూశాం. ఇంకోపక్క, కొందరు బీఆర్ఎస్ అభ్యర్థుల మీద, ‘కోవర్టులు’ అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘గెలిచాక, కాంగ్రెస్‌లోకి దూకేస్తారు..’ అనే ప్రచారాన్ని ఎదుర్కొంటున్న నేతల సంఖ్య డజనుకు పైగానే వుంది గులాబీ పార్టీలో.

బీజేపీలోకి దూకేస్తారన్న ప్రచారం ఎదుర్కొంటున్న నేతల సంఖ్య కూడా పెరుగుతుండడంతో, గులాబీ పార్టీలో ఒకింత ఆందోళన నెలకొంది. అయితే, ఎలాగోలా మళ్ళీ అధికారం నిలబెట్టుకుంటే, పార్టీ ఫిరాయింపులతో విపక్షాల్ని వీక్ చేసెయ్యొచ్చన్న ధీమా గులాబీ పార్టీలో వుండడంలో వింతేమీ లేదు.

ప్రధానంగా ‘తెలంగాణ’ సెంటిమెంట్, ఈసారి గులాబీ పార్టీతో లేదు. అసలు ఆ పేరే, ఇప్పుడు పార్టీ పేరులో కనిపించకపోవడంతో, ‘తెలంగాణ పార్టీ’ అన్న ఇమేజ్‌కి దూరమయ్యింది.