ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తున్నారు.. తిండి, నిద్ర మానేసి మరీ ఆందోళనలు చేస్తున్న ఢిల్లీ రైతుల విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా స్పందిస్తూ, ‘రైతుల కోసమే కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చింది.. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి.. అనుమానాలు నివృత్తి చేసుకోవాలి..’ అంటూ వ్యాఖ్యానించారు. అదే పవన్ కళ్యాణ్, రాష్ట్రంలో తుపాన్లు, వరదల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నిరాహార దీక్ష చేశారు.. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతలు ఎక్కడికక్కడ ఈ నిరాహార దీక్షలు చేశారు. అక్కడ ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతుల విషయంలో ఒకలా, ఇక్కడ రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్న రైతుల విషయంలో ఇంకొకలా.. జనసేన అధినేత రెండు నాల్కల ధోరణి ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమయ్యింది.
మిత్రపక్షానికి వత్తాసు పలకాల్సిందేనా.!
కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీకి జనసేన పార్టీ మిత్రపక్షం. దాంతో, కేంద్రం తీసుకునే నిర్ణయాల్ని జనసేనాని స్వాగతించక తప్పడంలేదు. అయితే, అన్ని విషయాల్లోనూ కేంద్రాన్ని సమర్థించుకుంటూ పోతే, జనసేన పార్టీ విశ్వసనీయత మరింత దెబ్బతింటుందన్న వాస్తవాన్ని పవన్ కళ్యాణ్ విస్మరిస్తే ఎలా.? ప్రత్యేక హోదా విషయంలోనూ జనసేనాని ఆలోచనలు మారిపోయాయి. ఒకప్పుడు పాచిపోయిన లడ్డూలన్నారు, ఇప్పుడేమో ఆ ప్రత్యేక హోదా ఊసే ఎత్తడంలేదు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కావొచ్చు, మరో విషయంలో కావొచ్చు.. జనసేనాని ‘మారిన ఆలోచనలు’ జనసైనికులకు కూడా అర్థం కాని పరిస్థితి.
సమర్థించలేక సతమతమవుతున్న జనసైనికులు
అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలకు తగ్గట్టుగా ఆయా అంశాలపై జనసైనికులు స్పందిస్తున్నారు. రైతులకు మద్దతుగా.. అంటూ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన చేపట్టిన దీక్షల్లో జనసైనికులు ఓ స్థాయిలో హంగామా చేశారు. అయితే, వారెవరూ ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనల విషయమై సూటిగా స్పందించలేకపోతున్నారు.. సమాధానం కూడా చెప్పలేకపోతున్నారు. రైతుల విషయమై జనసేన ఆలోచనల్ని ఎలా జనం ముందుకు తీసుకెళ్ళాలో అర్థం కాక సతమతమైపోతున్నారు జనసైనికులు.
బీజేపీకి నష్టం లేదు, నష్టం జనసేనకే..
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి కొత్తగా వచ్చే నష్టమేమీ లేదు. కానీ, జనసేన పరిస్థితి అది కాదు. జాతీయ పార్టీ గనుక, తిమ్మిని బమ్మిని చేసేందుకు బోల్డన్ని వెసులుబాట్లు బీజేపీకి వుంటాయి. కానీ, ప్రాంతీయ పార్టీకి అలా కుదరదు. తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ, రేపు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది.. ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి అందుకు పూర్తి భిన్నం. అది కొంతమేర జనసేనానికి కలిసొస్తుందా.? అంటే, అది వేరే చర్చ.
ఏపీ రాజకీయాల్లో ఇదొక చిత్రమైన పరిస్థితి
టీడీపీ, వైసీపీ, జనసేన.. ఈ మూడూ భిన్నమైన ఆలోచనలు, సిద్ధాంతాలున్న పార్టీలు. ఒకదానితో ఒకదానికి పొసగడంలేదు. కానీ, ఆ మూడు పార్టీలూ, బీజేపీ విషయం వచ్చేసరికి ఒక్కటవుతున్నాయి.. అదీ విడివిడిగా. వ్యవసాయ చట్టాలకు సంబంధించి రైతుల సమస్యనే తీసుకుంటే, టీడీపీ, వైసీపీ, జనసేన.. ఒకే వైఖరితో వున్నాయి. అది బీజేపీని సమర్థించే వైఖరి కావడమే గమనార్హం. అంటే, రాష్ట్రంలో రాజకీయ పార్టీల్ని పూర్తిగా కన్‌ఫ్యూజన్‌లో పడేసిందన్నమాట బీజేపీ. ఒక్కమాటలో చెప్పాలంటే బీజేపీ ట్రాప్‌లో పడ్డాయి పార్టీలన్నీ.