ఇప్పుడు జీవనశైలీ మార్పులు.. పని ఒత్తిడులు ఇలా ఏం ఉన్నా.. చాలా మంది సమయానికి భోజనం చేస్తారు. కానీ కొంత మంది మాత్రం తిన్న తర్వాత ఏం చేయాలో, ఏం చేయకూడదో సరైన అవగాహన లేకుండా అనేక పనులు చేస్తూ ఉంటారు. వీటివల్ల సరిగ్గా జీర్ణం కాక, పలు సమస్యలు ఎదురవుతున్నాయి. తిన్న వెంటనే ఏం చేయకూడదో, ఎందుకు చేయకూడదో ఈ కథనంలో మనం తెలుసుకుందాం.
మొదటగా చాలా మంది భోజనం పూర్తయిన వెంటనే అలసటతో లేదా సోమరితనంతో పడుకోవాలనుకుంటారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే తిన్న వెంటనే పడుకుంటే జీర్ణక్రియ సరిగా జరగదు. కడుపులోని ఆమ్లం అన్న వాహికలోకి చేరి గుండెల్లో మంట, అజీర్తి, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు కలిగిస్తాయి. అందుకే తిన్న తర్వాత కనీసం 30 నిమిషాల వరకూ పడుకోకపోవడం మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు.
మరికొందరు తిన్న వెంటనే సిగరెట్ తాగడం అలవాటుగా చేసుకుంటారు. భోజనం తర్వాత సిగరెట్ తాగితే ఆహారం త్వరగా జీర్ణమవుతుందనేది పూర్తిగా తప్పుడు భావన. అసలే తినటంతో జీర్ణక్రియపై లోడ్ ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు ధూమపానం జీర్ణక్రియను మరింత దెబ్బతీయడం, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతాయి.
తిన్న వెంటనే వేగంగా నడవడం కూడా చాలా మందికి అలవాటు. ఇది ‘డైజెస్టివ్ వాక్’ అని చెప్పుకుంటారు. కానీ నిజానికి వేగంగా నడక వల్ల జీర్ణ వ్యవస్థకు ఆటంకం కలుగుతుంది. కడుపు నొప్పి, అసౌకర్యం కలిగిస్తుంది. కాబట్టి భోజనం చేసిన 20-30 నిమిషాల తర్వాతే నిదానంగా నడక వంటివి చేయడం మంచిది. తిన్న వెంటనే టీ లేదా కాఫీ తాగడం కూడా చాలా మందికి సాధారణం. కానీ దీని వల్ల శరీరంలో ఐరన్‌ను గ్రహించే శక్తి తగ్గుతుంది. ముఖ్యంగా టీ తాగడం వల్ల ఐరన్ అబ్సార్షన్ దెబ్బతిని రక్తహీనతకు దారితీస్తుంది. కాబట్టి తినటానికి కనీసం ఒక గంట తర్వాతే టీ తాగాలి అని డాక్టర్లు చెబుతున్నారు.
ఇంకా తిన్న వెంటనే స్నానం చేయడం కూడా చాలా మంది చేయవలసిన పొరపాటు. శరీర ఉష్ణోగ్రత మారి రక్తప్రవాహం చర్మానికి ఎక్కువగా వెళ్లి జీర్ణక్రియ మెల్లగా జరిగే పరిస్థితి కలుస్తుంది. ఫలితంగా అజీర్తి సమస్యలు వస్తాయి. కాబట్టి భోజనం చేసిన కనీసం 30-45 నిమిషాల తర్వాత స్నానం చేయడం ఉత్తమం. మొత్తానికి రోజువారీ జీవితంలో ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే జీర్ణక్రియ చక్కగా సాగి అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. కాబట్టి ఇకపై తిన్న వెంటనే ఇవి చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది.. దీనిని తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు.)
