జనసేనకి వాళ్ళే బలం, వాళ్ళే బలహీనత.!

They are the strength of the Janasena,

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌కి వున్న సినీ గ్లామర్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. లక్షలాదిమంది ‘కరడుగట్టిన’ అభిమానులున్నారు పవన్‌ కళ్యాణ్‌కి. ఆ విషయంలో అన్నయ్య మెగాస్టార్‌ చిరంజీవి కంటే, తమ్ముడు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ని అదృష్టవంతుడిగా చెప్పుకోవాలి. అయితే, చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీ పెట్టి, చెప్పుకోదగ్గ స్థాయిలోనే సీట్లు సంపాదించుకున్నారుగానీ, తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ పరిస్థితి అందుకు పూర్తి భిన్నం. కానీ, పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ ప్రసహనం, చిరంజీవి కంటే ఎక్కువకాలం కొనసాగుతోంది. చిరంజీవి, ప్రజల ఓట్లతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత రాజ్యసభకు ఎంపికయ్యారు, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆ రకంగా రాజకీయ జీవితాన్ని కూడా ఓ మోస్తరుగా పరిపూర్ణం చేసేసుకున్నారు. కానీ, పవన్‌ కళ్యాణ్‌ అలా కాదు. ఇప్పటికీ రాజకీయంగా తన ఉనికిని చాటుకోవాల్సిన పరిస్థితుల్లోనే ఆగిపోయారాయన.

They are the strength of the Janasena
They are the strength of the Janasena

అభిమానులే బలం.. అభిమానులే బలహీనత..

పవన్‌ కళ్యాణ్‌తో పోల్చితే, రాజకీయాల్లో చిరంజీవి ఇంతలా ఆవేశపడలేదు. అదే ఆయన్ని పవన్‌ కళ్యాణ్‌ కంటే, ఓ మెట్టు పైన నిల్చునేలా చేసింది రాజకీయాల్లో. పవన్‌ కళ్యాణ్‌ అలా కాదు. ఆవేశపడిపోతుంటారు.. అన్నయ్యతో పోల్చితే కాస్త ఎక్కువ ఆలోచనా పరుడే అయినా, ఇంకా ఎక్కువ ఆవేశపరుడు కావడంతోనే అసలు సమస్య. ఆ ఆవేశానికి అభిమానులు ఫిదా అయిపోతారు.. కానీ, ఓటర్లు మాత్రం ఆ మాటల మాయలో పడిపోరు. అభిమానులు, జనసేన పార్టీని ‘లైవ్‌లో’ వుంచేందుకు నానా పాట్లూ పడుతున్నారు. అదే జనసేన బలం. అదే అభిమానులు, పవన్‌ కళ్యాణ్‌ని రాజకీయంగా కంటే, సినిమాటిక్‌గానే ఎక్కువ ప్రమోట్‌ చేస్తున్నారు. అదే జనసేన బలహీనత కూడా.

కరోనా బలాదూర్‌.. పోటెత్తేసిన అభిమానం

కరోనా గిరోనా లేదక్కడ. పవన్‌ కళ్యాణ్‌ని చూసేందుకు జనం ఎగబడ్డారు.. పవన్‌ కళ్యాణ్‌ వెంట జనసైన్యం కదిలింది. నివర్‌ తుపాను కారణంగా నష్టపోయిన రైతుల్ని ఓదార్చేందుకు, వారి సమస్యల్ని తెలుసుకునేందుకు జనసేనాని ప్రయత్నిస్తే, విజయవాడలో ఆయన ల్యాండ్‌ అయ్యింది మొదలు.. ఆయన వెంట సునామీలా అభిమానులు కనిపించారు. ఈ క్రమంలో కొందరు అభిమానులు అత్యుత్సాహం కూడా ప్రదర్శించారు. అయితే, పొలాల్లోకి దిగి, రైతుల కష్టాల్ని తెలుసుకుని, పాడైపోయిన పంట పరిస్థితిని అర్థం చేసుకున్న పవన్‌ కళ్యాణ్‌.. వారికి అండగా వుంటామని భరోసా ఇవ్వడం గమనించదగ్గ విషయం.

జనసేనానిపై విమర్శల దాడి మొదలైంది.!

సినిమా నటుడు కదా, వీలున్నప్పుడు ‘షో’ చేస్తుంటాడంటూ అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి అప్పుడే విమర్శలు మొదలయ్యాయి జనసేనాని మీద. వారి విమర్శల్లోనూ అర్థం వుంది. కరోనా పేరు చెప్పి, హైద్రాబాద్‌కే పరిమితమైపోయిన పవన్‌ కళ్యాణ్‌, రాష్ట్ర ప్రజల సమస్యల్ని అర్థం చేసుకునేందుకు ఇన్ని నెలలపాటు ఎందుకు రాష్ట్రానికి రాలేదంటూ అధికార పక్షం విమర్శిస్తున్న వేళ, జనసేన పార్టీ దగ్గర సరైన సమాధానం లేదు. ‘ఇదిగో వస్తే, ఇలాగే వుంటుంది..’ అని పవన్‌ అభిమానులు చెబితే చెప్పొచ్చుగాక.. రాజకీయాల్లో ఈ కుంటి సాకులు సరిపోవు.
ఏది ఏమైనా, పవన్‌ జనంలోకి రావడంతో జనసైనికుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అయితే, ఇలా వచ్చి.. అలా మాయమైపోయేలా కాకుండా అటు ప్రజలకీ, ఇటు పార్టీ కార్యకర్తలకీ జనసేనాని అందుబాటులో వుండడం పార్టీకి చాలా చాలా ముఖ్యం.