రాజకీయాల్లో విమర్శలు సహజం. అసలంటూ రాజకీయ విమర్శలు చేయకపోతే, రాజకీయాలే అనవసరం అన్నట్టుంది పరిస్థితి. రాజకీయాల్లోకి వచ్చాక.. ఎవరు ఏమన్నాసరే పడాల్సిందేనంటాడో పెద్దాయన. అందులో కొంత వాస్తవం లేకపోలేదు కూడా. ‘మీరు పేకాట క్లబ్బులు నడపొచ్చు.. నేను సినిమాలు చేయకూడదా.?’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించేశారు కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా పలువురు వైసీపీ నేతల్ని పరోక్షంగా.
నిజమే, వైసీపీ నేతలు కొందరి మీద ‘పేకాట క్లబ్బుల నిర్వహిస్తున్నారు’ అనే ఆరోపణలున్నాయి. ‘తూచ్, మేమలాంటి వాళ్ళం కాదు..’ అని కొందరు ఎమ్మెల్యేలు బుకాయించినా, సదరు ఎమ్మెల్యేల అనుచరులే పేకాట క్లబ్బులు నిర్వహిస్తూ అడ్డంగా పోలీసులకు దొరికేశారు.. ఈ క్రమంలో ఆయా వ్యక్తులు, ఎమ్మెల్యేల పైత్యానికి సంబంధించిన ఆడియో టేపులూ రిలీజ్ చేశారు. అది వేరే సంగతి. ‘నేను సినిమాలు చేయకూడదా.?’ అని పవన్ ప్రశ్నించడం ఎంతవరకు సబబు.? ‘సినిమాల్ని పూర్తిగా వదిలేస్తున్నా, ప్రజల కోసమే జీవితం అంకితం..’ అంటూ జనసేన అధినేత స్టేట్‌మెంట్లు ఇచ్చారు గనకనే, ‘మళ్ళీ సినిమాల్లోకి ఎందుకు వెళుతున్నావ్.?’ అనే ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్న వేసి, జనసేన పార్టీకి ఉగుడ్ బై చెప్పారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ. సరే, సంపాదన కోసం సినిమాలే పవన్ కళ్యాణ్‌కి శరణ్యం గనుక, దాన్ని తప్పు పట్టలేమనుకోండి. అది వేరే సంగతి. రైతు సమస్యలపై కలెక్టర్లకు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది జనసేన పార్టీ. ఈ క్రమంలో కృష్ణా జిల్లా కలెక్టర్‌కి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నారు జనసేన అధినేత.
దారి పొడుగునా జనసేన శ్రేణులు, తమ అధినేతకు బ్రహ్మరథం పట్టాయి. జనం పెద్దయెత్తున పవన్ వెంట కనిపించారు. ఈ ఉత్సాహంలో పలువురు వైసీపీ నేతలకు తన ప్రసంగాల్లో వార్నింగ్ ఇచ్చేశారు జనసేనాని. ‘నన్ను తిడితేనే, నీ మంత్రి పదవి వుంటుందంటే.. నన్ను తిట్టుకో ఫర్లేదు..’ అంటూ ఓ వైసీపీ మంత్రిని ఉద్దేశించి జనసేనాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ‘రోడ్లు బాగు చెయ్యడం చేతకాదుగానీ, పేకాట క్లబ్బులు బాగా నిర్వహిస్తున్నారు..’ అంటూ జనసేనాని పేల్చిన సినిమాటిక్ డైలాగ్ గట్టిగానే పేలిందిప్పుడు. ఇది రాష్ట్రంలో అతి పెద్ద సమస్యగా మారిపోయింది. అసలు రాష్ట్రంలో రోడ్లున్నాయా.? అన్న అనుమానం కలుగుతోంది కొన్ని రోడ్లు చూస్తే. రోజులు, నెలలు గడుస్తున్నా, రోడ్ల తీరు మారట్లేదు. ఆ సమస్య విషయమై జనసేనాని చేసిన వ్యాఖ్యల్ని సమర్థించాల్సిందే ఎవరైనా.