రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన ఆదేశాల్ని హైకోర్టు తప్పు పట్టింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎన్నికల వ్యవహారాలకు సంబంధించి మీడియాతో మాట్లాడకూడదని హైకోర్టు ఆదేశించింది. దాంతో, ‘ఇద్దరికీ గట్టిగానే పడ్డాయ్’ అనే చర్చ అంతటా జరుగుతోంది. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల వ్యవహారం మంత్రి పెద్దిరెడ్డికీ, ఎస్ఈసీ నిమ్మగడ్డకూ మధ్య వ్యక్తిగత వైరంలా మారిన సంగతి తెలిసిందే. ప్రధానంగా నిమ్మగడ్డపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత కొద్ది రోజులుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ‘అధికారుల్ని బ్లాక్ లిస్టులో పెడతాం’ అని కూడా మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. దాంతో, ఎస్ఈసీ నిమ్మగడ్డ, పెద్దిరెడ్డిపై కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. ఈ నెల 21 వరకు పెద్దిరెడ్డిని ఇంట్లోనే వుండాలని ఆదేశించడమే కాక, మీడియాతో కూడా మాట్లాడకూడదని ఆదేశించారు. అయితే, ఈ ఆదేశాల్ని హైకోర్టు తప్పు పట్టింది. మీడియాతో మాట్లాడేటప్పుడు పంచాయితీ ఎన్నికల వ్యవహారాల ప్రస్తావన వుండకూదని పెద్దిరెడ్డికి తేల్చి చెప్పింది హైకోర్టు. ఇక్కడ, అధికార పార్టీ నేతలు.. నిమ్మగడ్డకు షాక్ తగిలింది హైకోర్టులో.. అంటున్నారు.
మరోపక్క, పెద్దిరెడ్డి నోటికి తాళం పడిందని నిమ్మగడ్డ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. నిమ్మగడ్డకీ పెద్దిరెడ్డికీ మధ్య వైరానికి సంబంధించి ప్రివిలేజ్ కమిటీ విచారణ చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రివిలేజ్ కమిటీ, నిమ్మగడ్డపై చర్యల కోసం అసెంబ్లీ స్పీకర్‌కి సిఫార్సు చేయవచ్చునన్న ప్రచారం జరుగుతోంది. గతంలో మహారాష్ట్రలో ఇలాగే అతిగా వ్యవహరించిన ఎస్ఈసీకి జైలు శిక్ష పడిన వ్యవహారాన్నీ అధికార పార్టీ నేతలు ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రంలో అలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా.? అనేది ఇప్పటికైతే చెప్పలేం. ఒక్కటైతే నిజం, నిమ్మగడ్డ కారణంగానే రాష్ట్రంలో అధికారపక్షం అనుకున్న స్థాయిలో ఏకగ్రీవాలు చేసుకోలేకపోయింది. పెద్దిరెడ్డి సొంత జిల్లా చిత్తూరుపైనా, గుంటూరు జిల్లాపైనా ఏకగ్రీవాలకు సంబంధించి ఎస్ఈసి ఒకింత అనుమానం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.