రచన- దర్శకత్వం : రాహుల్ రవీంద్రన్
తారాగణం : రశ్మికా మందన్న, దీక్షిత్ శెట్టి, అనూ ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రోహిణి తదితరులు
సంగీతం : హేషం అబ్దుల్ వహాబ్, ఛాయాగ్రహణం : కృష్ణన్ వసంత్, కూర్పు: చోటా కే ప్రసాద్
బ్యానర్స్ : గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ప్రొడక్షన్స్
నిర్మాతలు : విద్యా కొప్పినీడు, ధీరజ్ మొగిలినేని
విడుదల : నవంబర్ 7, 20 25
పాపులర్ హీరోయిన్ రశ్మిక మందన్నకి యూత్ లో విపరీతమైన క్రేజ్ వుంది. ఆమె సినిమాల కోసం ఎగబడతారు. రాబోయే సినిమా కోసం ఎదురు చూస్తారు. ‘ది గర్ల్ ఫ్రెండ్’ టైటిల్ తోనే యూత్ అప్పీల్ కి గాలం వేసింది. అయితే దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ గర్ల్ ఫ్రెండ్ తో చెప్పిన ప్రేమ కథ ఎలాటిది? యూత్ కి చేస్తున్న హెచ్చరిక ఏమిటి? ఇది మెప్పిస్తుందా, లేదా?

ఈ విషయాలు ఈ క్రింద రివ్యూలో చూద్దాం…
కథేమిటి?
భూమాదేవి (రశ్మిక) పుట్టుకతోనే తల్లిని పోగొట్టుకుంటుంది. తండ్రి (రావు రమేష్) గారాబంగా పెంచుతాడు. చదువు పట్ల శ్రద వున్న భూమా హైదరాబాద్ వెళ్లి పిజీ కోర్సులో చేరుతుంది.హాస్టల్లో బస చేస్తుంది. అదే కాలేజీలో విక్రం (దీక్షిత్ శెట్టి) వేరే కోర్సులో చేరతాడు. ఇద్దరూ పరిచయం పెరిగి ప్రేమలో పడతారు. అయితే విక్రం ని దుర్గ (అనూ ఇమ్మాన్యుయేల్) కూడా ఇష్ట పడుతుంది. కానీ విక్రం భూమానే ప్రేమిస్తాడు. దీంతో భూమా పూర్తిగా అతడికి దాసోహమైపోతుంది. ఈ ప్రేమ హద్దులు దాటేసరికి విక్రం అసలు రూపం బయటపడుతుంది. భూమాని తన గుప్పెట్లో పెట్టుకుని శాసించే అతడి మనస్తత్వాన్ని వ్యతిరేకిస్తుంది భూమా. అతడి అనుమానించే వైఖరి, హింసాత్మక ప్రవర్తనా తట్టుకోలేక అతడి చేతిలోంచి బయటపడాలని ఆమె చేసిన ప్రయత్నంలో -ఈ ప్రేమ ఏ మలుపులు తిరిగిందన్నది మిగతా కథ.
ఎలా వుంది కథ?
ఇది టాక్సిక్ రిలేషన్ షిప్ లేదా విషపూరిత సంబంధం కథ. ఈ కథ కొత్తేం కాదు. పాత రోజుల్లో కూడా సైకో ప్రేమికుడితో ఇలాటి సినిమాలు వచ్చాయి. కాకపోతే ఈ రోజుల్లో ఇలాటి సైకో ప్రేమ సంబంధాన్నే టాక్సిక్ రిలేషన్ షిప్ అంటున్నారు. పూర్వం హాలీవుడ్ నుంచి ‘స్లీపింగ్ విత్ ఎనిమీ’,’ఇనఫ్’ లాంటి సినిమాలు ఈ సమస్య మీద వచ్చాయి. తెలుగులో కూడా చిరంజీవి -జయప్రదలతో కె. బాలచందర్ తీసిన ‘47 రోజులు’, చిరంజీవి -జయసుధ- కమల్ హాసన్ ల తో బాలచందరే తీసిన ‘ఇది కథకాదు’ సినిమాలు వచ్చాయి.

ప్రేమలో పడే వరకూ ప్రేమికుడు బాగానే ఉంటాడు. పడ్డాక విశ్వరూపం చూపిస్తాడు. అతడి ధాటికి ఆమె మానసికారోగ్యం రిస్కులో పడుతుంది. అతడి నుంచి నిరంతరం అవమానం, కోపం, ఆమెని నియంత్రించాలనే ప్రయత్నం, ఆమెని ఒంటరిని చేయడం లాంటి క్రూరత్వం పెరిగిపోతాయి. సాధారణ విభేదాల లాగా కాకుండా, విషపూరిత సంబంధంలో ఆమె దిక్కులేనిదిగా అభద్రతా భావాన్ని, భావోద్వేగాల క్షీణతనీ అనుభవిస్తుంది. ఇక తప్పక బయటపడే ప్రయత్నాలు చేస్తుంది.
బాయ్ ఫ్రెండ్స్ -గర్ల్ ఫ్రెండ్స్ మద్య ఇలాటి సంబంధాలు ఈ రోజుల్లో సాధారణ మయ్యాయి. అయితే బాయ్ ఫ్రెండే టాక్సిక్ అవ్వాలనేం లేదు, గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు. ‘ఫాటల్ ఎట్రాక్షన్’ ఆధారంగా హిందీలో ఊర్మిళా మతోండ్కర్ తో తీసిన ‘ప్యార్ తూనే క్యా కియా’ ఈ కోవకే చెందుతుంది.
ఇప్పుడు తెలుగులో వచ్చిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ చేతిలో బాధితురాలైన గర్ల్ ఫ్రెండ్ ఏ నిర్ణయం తీసుకుందన్న కథతో వుంది. హీరోయిన్ ఓరియెంటెడ్ కథ. రశ్మిక కథా నాయకత్వంలో ఈ పాత్ర ప్రేక్షకుల్ని కదిలిస్తుంది, అలోచింప జేస్తుంది, సానుభూతి పొందుతుంది. షరతులు లేని ప్రేమే జీవితాన్ని, అందులోని అందాన్నీ సజీవంగా నిలుపుతుందని చెప్పడం ఈ కథ ఉద్దేశం.

కథనంలో చాలా బలహీనతలున్నాయి. ముఖ్యంగా ప్రేమలో పడే వరకూ ఫస్టాఫ్ లో బలం లేదు. రొటీన్ కాలేజీ రోమాన్స్ సీన్స్ తో, ర్యాగింగ్ సీన్స్ తో అతి మామూలుగా సాగుతుంది. హాస్టల్ సీన్స్ అయితే మరీ లాజిక్ లేకుండా వున్నాయి. అమ్మాయిల హాస్టల్ రూమ్స్ లోకి అబ్బాయిలు, అబ్బాయిల హస్టల్ రూమ్స్ లోకి అమ్మాయిల రాకపోకలు మింగుడు పడవు. ఇంకో సీనులో హీరో చేసే పనికి కాలేజీ అధికారులు చర్య తీసుకోకపోవడం ఉంది. హీరో అసలు రూపం వెల్లడి అయ్యాకే – ఇంటర్వెల్ వరకూ కథ ఊపందుకుంటుంది. రశ్మిక మీద ఇంటర్వెల్ సీను బలీయంగా వుంది.
కానీ సెకండాఫ్ రావురమేష్ కథతో విషయం దారి తప్పింది. కూతురితో అతడి ప్రవర్తన కూడా హీరో ప్రవర్తన లాగే ఉండడంతో కథమీద ఫోకస్, చెప్పాలనుకున్న ప్రేమలో టాక్సిక్ రిలేషన్ పాయింటూ బలహీన పడిపోయాయి. ముగింపులోనే రశ్మిక చేసే పవర్ఫుల్ ప్రసంగంతో బలం పుంజుకుంటుంది సినిమా.
ఎవరెలా చేశారు?
నిస్సందేహంగా ఇది రశ్మికా మందన్న సినిమా. ఈ స్టేటస్ కి తగ్గకుండా టాలెంట్ ని ప్రదర్శించింది. మిర్రర్ సీను లో నటన ఆమె ప్రతిభకి అడ్డం పడుతుంది. లోలోన నలిగిపోయే జీవితంతో కావాల్సిన సానుభూతినంతా రాబట్టుకుంటుంది. ప్రేమికుడికీ, తండ్రికీ మధ్య నలిగిపోయే యువతిగా రశ్మిక ప్రదర్శించిన హావభావాలు గుర్తుండి పోతాయి,
టాక్సిక్ ప్రేమికుడిగా దీక్షిత్ శెట్టి ఫర్వాలేదు. షేడ్స్ మారిపోయే విలక్షణ పాత్ర పోషించాడు. ఇలాటి యూత్ కి వార్నింగ్ లా వుంది ఈ పాత్ర. రావు రమేష్ తండ్రి పాత్రలో అతిగానే కనిపిస్తాడు. టాక్సిక్ లవర్ గా దీక్షిత్, టాక్సిక్ తండ్రిగా రావురమేష్ పోటీ పడి నటించినట్టున్నారు. కాకపోతే రావురమేష్ తండ్రి పాత్ర కథకి అడ్డు.

దుర్గగా అనూ ఇమ్మానుయేల్ హీరోయిన్ కి తోడ్పడే పాత్రలో ముద్రవేస్తుంది. మరో ఇంపార్టెంట్ రోల్ చేసింది. స్టైలిష్ అండ్ బోల్డ్ పాత్రలో మెప్పించడంతో పాటు. హీరో తల్లి పాత్రలో రోహిణి ఒక్క డైలాగు లేకుండా ఒకే సీను నటించింది. ఈ సీను కథని మలుపు తిప్పేసే సీను. ఇక దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కూడా ఒక పాత్ర పోషించాడు ప్రొఫెసర్ గా.
సాంకేతికాల సంగతి ?
మూడుగా చెప్పుకోవాలంటే, హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరచిన పాటలు హైలైట్ అనే చెప్పాలి. కథని ముందుకు నడిపించే పాటలు కూడా ఇందులో వున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్‌ని ప్రశాంత్ విహారి కూర్చాడు. టాక్సిక్ లవ్ స్టోరీకి వీళ్ళిద్దరి సంగీతం తోడయ్యింది బలం చేకూర్చడానికి. కృష్ణన్ వసంత్ ఛాయాగ్రహణం నీటుగా ఉంది. కథ చాలా వరకూ కాలేజ్‌లోనే జరిగినా లోకేషన్స్ రిపీట్ చేయకుండా చిత్రీకరణ పరంగా జాగ్రత్త తీసుకున్నారు. చోటా కే ప్రసాద్ కూర్పు బోరు సన్నివేశాల్లో ఏమీ చేయలేని పరిస్థితి.
మొత్తానికి మొన్నటి ‘తెలుసుకదా’ కంటే చాలా బెటర్ ఈ ‘గర్ల్ ఫ్రెండ్’. రోమాంటిక్స్ కోరుకునే యువ ప్రేక్షకులకి వినోదంతో బాటు ఓ హెచ్చరిక. అగ్ర నిర్మాత అల్లుఅరవింద్ అప్పుడప్పుడు ఇలాటి అర్ధవంతమైన సినిమాలు తీయడం ప్రేక్షక లోకానికి ఊరటే. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ‘చిలసౌ’ కంటే ముందుకెళ్ళి పవర్ఫుల్ ప్రేమ కథ అందించాడు.
రేటింగ్ : 2.5 /5

