ముఖ్యాంశాలివే… ఇజ్రాయెల్‌, పాలస్తీనాల్లో మరణ మృదంగం!

హమాస్ మిలిటెంట్లు – ఇజ్రాయేల్ సైన్యానికి మద్య మొదలైన యుద్ధం వల్ల జరుగుతున్న ప్రాణ నష్టం గంటగంటకూ పెరిగిపోతుంది. ఈ యుద్ధం వల్ల ఇరు ప్రాంతాల్లోని వీదుల్లో శవాల గుట్టలు, రక్తపు మడుగులు దర్శనమిస్తుండగా… మరోవైపు బందీల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి.

ఇజ్రాయేల్ – హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇరు ప్రాంతాల్లోనూ మృతుల సంఖ్య భారీగా పెరుగుతుంది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం… హమాస్ ఉగ్రవాద దాడులతో ఇజ్రాయేల్ లో సుమారు 900 మందికి పైగా మరణించి ఉంటారని ఆ దేశ ఆర్మీ రేడియో ప్రకటించింది. ఇదే సమయంలో 2,616 మంది గాయపడ్డారని తెలిపింది.

వీరిలో ఒకే గ్రామానికి చెందిన వారు 100 మంది ఉన్నారనే వార్త మరింత కలిచి వేస్తుంది. అవును… కేవలం 1000 మంది నివాసముండే చిన్న వ్యవసాయాధారిత గ్రామమైన బీరిలోని పొలాల్లో 100 మృతదేహాలు లభించడం తీవ్ర కలకలం రేపింది. తాజాగా ఇజ్రాయెల్‌ సహాయక బృందం ఈ మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. అయితే.. ఈ మరణాలు మొత్తం 900 లోనివేనని అధికారులు ప్రకటించారు.

మరోపక్క హమాస్ ఉగ్రవాదుల దాడికి ప్రతిగా ఇజ్రాయెల్‌ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో పాలస్తీనాలో మరణించిన వారి సంఖ్య 704 కు చేరుకోగా.. గాయపడిన వారి సంఖ్య 3,800 కి చేరిందని తెలుస్తుంది. మొత్తంగా మృతుల సంఖ్య 1,604 గా ఉంది.

మరోపక్క హమాస్‌ పై యుద్ధం ప్రకటించిన అనంతరం ఇజ్రాయెల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. గాజాను పూర్తిగా దిగ్బంధించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా విద్యుత్తు, ఆహారం, నీరు, ఇంధనం అందకుండా కట్టుదిట్టం చేసింది. తాము మానవ మృగాలతో పోరాడుతున్నామని, అందువల్ల దానికి తగ్గట్లుగానే తాము తీసుకునే నిర్ణయాలూ ఉంటాయని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి యోవ్‌ గ్యాలంట్‌ స్పందించారు.

ఇదే సమయంలో… తాజా దాడుల్లో సుమారు 130 మందిని బందీలుగా చేసుకున్నట్లు హమాస్ ప్రకటించింది. వీరిలో ఇజ్రాయేల్ ప్రజలతోపాటు, విదేశీయులు, ఇజ్రాయేల్ సైనికులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే వెనకా ముందూ చూడకుండా దాడులకు పాల్పడిన హమాస్ ముష్కరుల చర్య ఫలితంగా ఇజ్రాయేల్ తో పోలిస్తే పాలస్తీనాకే అధిక నష్టం అని అంటున్నారు. వాటికి బలం చేకూరుస్తూ… ఇప్పటికే గాజాకు మంచినీరు కూడా ఇజ్రాయేల్ ఆపేయగా… ఇప్పటివరకూ 1,23,000 మంది గాజా వాసులు నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.

ఇదే సమయంలో… ఇజ్రాయెల్‌ పై హమాస్‌ ముష్కరులు జరిపిన దాడిలో ఆ దేశపౌరులతో సహా విదేశీయులు అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని తెలుస్తుంది. ఇప్పటికే అక్కడున్న భారతీయ విద్యార్థులు బంకర్లలో దాక్కుని బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారని వీడియోలు వస్తున్నాయి. ఇదే సమయంలో నేపాల్‌, థాయిలాండ్‌ కు చెందిన వారు మృతుల్లో ఉన్నారని చెబుతున్నారు.

ఈ క్రమంలో… నేపాల్, థాయిలాండ్ కు చెందిన సుమారు 22 మందిని హమాస్ ముష్కరులు హత్య చేశారని తెలుస్తుంది. ఇందులో తమ దేశానికి చెందిన 12 మంది పౌరులు ఇజ్రాయెల్‌ లో ప్రాణాలు కోల్పోయారని థాయిలాండ్‌ ప్రభుత్వం ప్రకటించగా.. 10 మంది నేపాలీ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు. ఇదే సమయంలో హమాస్‌ జరిపిన దాడిలో 9 మంది అమెరికన్లు మరణించారు. వీరితోపాటు ఒక కెనడా వాసి, ఫ్రెంచ్ మహిళా చనిపోయినట్లు చెబుతున్నారు.