తెలంగాణ రాజకీయాల్లో కోతి, రెండు పిల్లుల కథ!

అనగనగా రెండు పిల్లులు ఉండేవి, వాటికి ఒక రొట్టె దొరికింది. నాది అంటే నాది అని, నాకు ముందు దొరికిందని రెండు పిల్లులు పోట్లాడుతున్నాయి. పిల్లుల కొట్లాటను గమనించిన కోతి.. పిల్లుల వద్దకు వచ్చింది. ఎందుకు కొట్లాడుతున్నారు అని అడిగింది. అప్పుడు పిల్లులు రొట్టె గురించి చెప్పాయి. మీ సమస్యకు నేను పరిష్కారము చెబుతాను అన్న కోతి.. వెంటనే రొట్టెను రెండు ముక్కలుగా చేసింది.

అయ్యో ఒక ముక్క పెద్దగా ఉన్నది, మీరు మళ్లీ పోట్లాడుకుంటారు.. అంటూ రొట్టె ముక్కను కొరికింది కోతి. ఇప్పుడు మరో ముక్క పెద్దగా ఉంది అంటూ వేరొక ముక్కను కొరికింది. ఈ ముక్క ఆ ముక్క పెద్దగా ఉన్నదంటూ రొట్టె మొత్తం తినేసి వెంటనే చెట్టు పైకెక్కి కూర్చుంది! పిల్లులు బిక్క మొహం వేసుకుని ఒకరి ముఖం ఒకరు చూసుకొని బాధ పడ్డాయి. దొరికిన ఆహారం చేతులారా పోగొట్టుకున్నాము అనుకున్నాయి.

ఈ కథలోని నీతి సంగతి కాసేపు పక్కనపెడితే… కాస్త అటు ఇటుగా తెలంగాణ రాజకీయాల్లో ఇలాంటి సందడే నెలకొంది. అందుకు తాజాగా ఒక ఉదాహరణ తెరపైకి వచ్చింది. రాజకీయ కక్షతో కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతున్నదని రాష్ట్ర అధికార బీఆరెస్స్ ఆరోపిస్తుంది. దీనికి కౌంటర్ గా… నిధులు విడుదల చేస్తున్నా వాటిని రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోతుందని కేంద్రం వాదిస్తుంది.

ఇందులో భాగంగా తాజాగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకానికి నిధులు విడుదల ఆపేసింది కేంద్రం. దీంతో… ఇదిగో కక్ష సాధింపుకు ఇంతకంటే ఉదాహరణ ఏమి కావాలని బీఆరెస్స్ నేతలు చెబుతున్నారు. అయితే… ఈ స్కీమ్ కింద 2014-15 నుంచి 2019-20 వరకు మొత్తం రూ. 895.68 కోట్లు విడుదలచేస్తే.. అందులో 638.85 కోట్లను మాత్రమే కేసీఆర్ సర్కార్ ఖర్చు పెట్టింది. దీంతో… ఇంకా రూ.256.83 కోట్లు రాష్ట్రం దగ్గర మిగిలే ఉన్నాయని కేంద్రం లెక్కలు చెబుతుంది.

దీంతో ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు క్యాష్ చేసుకుంటున్నారు. తెలంగాణపై బీజేపీ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తుంది… తెలంగాణ ప్రజలంటే కేంద్రంలోని బీజేపీ పెద్దలకు చులకన భావం అంటూ టి. కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో తమ వాదనకు ఈ వాదన కూడా తోడవుతుందని… కాంగ్రెస్ నేతల విమర్శలను బీఆరెస్స్ సోషల్ మీడియా జనాలు వైరల్ చేస్తున్నారు. ఫలితంగా తమ వాదనకు మోరల్ సపోర్టని భావిస్తున్నారు.

ఇక రాష్ట్రం విషయానికొచ్చేసరికి… కేంద్రం ఇస్తున్న నిధులను ఖర్చుపెట్టలేనంత బిజీగా కేసీఆర్ ఉన్నారా? రైతుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంటే… ఖర్చు పెట్టడానికి కేసీఆర్ కి నొప్పా? అని టి.కాంగ్రెస్ నేతలు ఫైరవుతున్నారు. దీంతో… రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇస్తుందనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు కూడా ఒప్పుకుంటున్నారంటూ.. ఈ నేతల కామెంట్లను టి.బీజేపీ నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. దీంతో… అటు బీఆరెస్స్ ని ఇటు బీజేపీని ఇరకాటంలో పెడుతూ… మధ్యలో క్యాష్ చేసుకుంటుంది టి. కాంగ్రెస్! దీంతో… పైన చెప్పుకున్న కథను గుర్తుచేస్తున్నారు విశ్లేషకులు!