సాధారణ షెడ్యూల్ కన్నా మూడు నెలలు ముందే జరిగిన గ్రేటర్ ఎన్నికలు అధికార తెరాస పార్టీకి అతి పెద్ద షాక్ ను ఇచ్చాయి. గత ఎన్నికల్లో తొంభై తొమ్మిది డివిజన్లు గెలుచుకున్న తెరాస నిన్నటి ఎన్నికల్లో దాదాపు సగానికి దిగిపోయి యాభై అయిదు స్థానాలకు పరిమితమై ఆ పార్టీ శ్రేణులను నిర్వేదంలో పడేసింది. దుబ్బాక కొట్టిన దెబ్బతో కంగు తిన్న తెరాసకు రాజధాని కేంద్రమైన హైదరాబాద్ లో జరిగిన కార్పొరేషన్ ఎన్నిక తీవ్ర నిరాశలో ముంచిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇదే సమయంలో గత ఎన్నికల్లో కేవలం నాలుగు డివిజన్లు మాత్రమే గెలిచిన బీజేపీ నేడు అంతకు పన్నెండు రెట్లు ఎక్కువగా నలభై ఎనిమిది డివిజన్లను గెలిచి ఆశ్చర్యంలో ముంచెత్తింది.
తెరాస ఇంత ఘోరంగా విఫలం కావడానికి కారణాలు ఏమిటి? కార్పొరేటర్లలో పెరిగిన అవినీతి తో పాటు మొన్ననే వచ్చిన బీభత్సమైన వరదల సందర్భంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా దాదాపు నలభై మంది మరణించడమే కాక, రెండు మూడు వారల పాటు అనేక కాలనీలు మొలలోతు నీటిలో మునిగిపోవాల్సి వచ్చింది అనే ప్రజాగ్రహం ఎన్నికల మీద ప్రభావం చూపించింది. ఇక తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని నిర్మూలించాలని తెరాస చేసిన ప్రయత్నాలు కూడా వికటించాయని ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి., కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తున్నామని తెరాస సంతోషించింది తప్ప బీజేపీ మొక్కకు నీళ్లు, ఎరువు వేసి పెంచుతున్నామని గ్రహించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన పదమూడు మంది శాసనసభ్యులు తెరాసలో చేరటం, కొందరికి మంత్రి పదవులు దక్కడం కూడా ప్రజలకు సహించరాని అంశంగా మారింది. రెండేళ్లక్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్, మహేశ్వరం నుంచి గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు తెరాసలో చేరటం సహించలేని ప్రజలు ఆ నియోజకవర్గాల పరిధిలోని కార్పొరేట్ డివిజన్లు అన్నింటిలో బీజేపీని గెలిపించారు. నగరంలో ఒకటి రెండు స్థానాలకే పరిమితమైన బీజేపీని బలమైన ప్రత్యర్థిగా తయారు చేసిన పాపం తెరాసదే.
బీజేపీ రగిలించిన హిందుత్వ నినాదం చాలావరకు బాగానే పనిచేసింది. ముఖ్యంగా మజ్లీస్ పార్టీ ఆగడాలను అడ్డుకోవాలంటే బీజేపీకే సాధ్యం అన్న అభిప్రాయాన్ని ప్రజలకు కలిగించడంలో బీజేపీ సఫలం అయింది. తెరాస, మజ్లీస్ పార్టీలు స్నేహంగా ఉండటం హిందుత్వవాదులకు ఏమాత్రం నచ్చడం లేదు. ఇన్నాళ్లూ తమ మనోభావాలకు మద్దతు ఇచ్చే పార్టీలు కొరవడటంతో గతి లేక తెరాస, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలను అభిమానించినవారికి ముస్లిం మతతత్వవాదులను ధైర్యంగా ఎదిరించగల బీజేపీ కాంతిరేఖగా కనిపించింది. దానికితోడు ఆరేళ్ళ తెరాస పరిపాలన పట్ల వ్యతిరేకత మొదలైంది. ఉద్యోగుల్లో అసంతృప్తి ఎక్కువైంది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగ కల్పన లేకపోవడం యువతకు నిరాశ కలిగించింది. అంతేకాక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు కూడా కేసీఆర్ దర్శనం దొరకదు అనే అపనింద ఆ పార్టీని ప్రజలకు దూరం చేస్తున్నది. ప్రచారపు చివరి రోజు కేసీఆర్ ఒక బహిరంగ సభ పెట్టడం వలన తెరాస కు ఆ మాత్రం సీట్లు వచ్చాయి కానీ లేకపోతె నలభై కంటే దక్కేవి కావు అని ఒక తెరాస అభిమాని బాధను వ్యక్తం చేశారు.
ఏమైనప్పటికి మెజారిటీ సీట్లు గెలిచింది తెరాస. కానీ విజయోత్సవ సంబురాలు చేసుకుంటున్నది బీజేపీ. ఇకనైనా తెరాస జాగ్రత్త వహించకపోతే 2023 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.