‘మెగా’ రాజకీయం.. తెరవెనుక కథ ఇదీ.!

The BJP is in talks with Chiranjeevi

మెగాస్టార్‌ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరది. సినిమాల్లో ఆయన తిరుగులేని ఇమేజ్‌ సొంతం చేసుకున్నారు. కానీ, రాజకీయాల్లోనే అనుకున్నది సాధించలేకపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి అవుదామనుకున్న ఆయన కల నెరవేరలేదు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, రెండు చోట్ల అసెంబ్లీకి పోటీ చేసి, ఓ చోట ఓడిపోయిన చిరంజీవి, ‘అధ్యక్షా’ అంటూ అసెంబ్లీలో ప్రసంగం చేయగలిగారు. రాజ్యసభకు ఎంపికై, కేంద్ర మంత్రి హోదాలో లోక్‌సభ, రాజ్యసభ మెట్లు ఎక్కారు. అయితే, రాజ్యసభ సభ్యుడిగా పదవీ కాలం పూర్తవకముందే, రాజకీయాలతో దాదాపుగా సంబంధాలు తెంచేసుకున్నారు చిరంజీవి. ఎలాగైనా, చిరంజీవిని మళ్ళీ రాజకీయాల్లోకి లాగానే ప్రయత్నాలు కొన్ని పార్టీలు చేసినా, అది వీలు పడలేదు. కాంగ్రెస్‌ నుంచే చాలా ప్రయత్నాలు జరిగాయి. సోదరుడు పవన్‌ కళ్యాణ్‌ స్థాపించిన జనసేన కోసం కూడా చిరంజీవి పనిచేయలేకపోయారు. ఇక, బీజేపీ మాత్రం ఇప్పటికీ చిరంజీవితో సంప్రదింపులు జరుపుతూనే వుంది.

The BJP is in talks with Chiranjeevi
The BJP is in talks with Chiranjeevi

అయితే, తాను రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చే అవకాశమే లేదని చిరంజీవి తేల్చేశారు. ఇంకో జన్మంటూ వుంటే, అప్పుడు కూడా నటుడిగానే పుట్టాలని వుందంటూ చిరంజీవి వ్యాఖ్యానించడం గమనార్హం. చిరంజీవి పైకి ఏం చెబుతున్నా, మళ్ళీ ఆయన రాజకీయాల్లోకి రావడం ఖాయమన్న భావన మాత్రం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అందుక్కారణం భారతీయ జనతా పార్టీనే. 2024 ఎన్నికల నాటికి చిరంజీవిని ఎలాగైనా బీజేపీలోకి లాగాలని కమలనాథులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎటూ, జనసేన కూడా బీజేపీకి మిత్రపక్షమే గనుక.. చిరంజీవి పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తే రెండు పార్టీలకూ మేలు జరుగుతుందన్నది బీజేపీ అధిష్టానం ఆలోచనగా కనిపిస్తోంది. రాజకీయాల్లో ఈక్వేషన్స్‌ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఏమో, చిరంజీవి ఇప్పుడు ‘కాదు’ అంటున్నారు, భవిష్యత్తులో ‘ఔను’ అనాల్సి వస్తుందేమో.

మరోపక్క, రాజకీయ రంగంలో చవిచూసిన చేదు అనుభవాల నేపథ్యంలో చిరంజీవి అస్సలేమాత్రం అటువైపు చూసే ప్రసక్తి వుండకపోవచ్చని చిరంజీవి మనస్తత్వం బాగా తెలిసిన కొందరు సినీ, రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. నిజమే, సినీ రంగంలో చిరంజీవి సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు అసామాన్యం. కానీ, రాజకీయాల్లో ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.. అడ్డగోలు విమర్శల్ని చవిచూశారు. ఓ రకంగా చెప్పాలంటే, వేధింపుల్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే, బహుశా రాజకీయాలంటే చిరంజీవికి అస్సలేమాత్రం ఇష్టం లేదని అనుకోవాలేమో.