తెలుగునాట టీవీ చర్చలు ఎలా సాగుతున్నాయి? పరస్పరం చెప్పులతో కొట్టుకునే స్థాయికి ఎదిగాయి. కోట్లాదిమంది చూస్తున్నారనే కనీస స్పృహ కూడా లేకుండా స్టూడియోలో కెమెరా ముందరనే భౌతిక దాడులు చేసుకునే స్థాయికి మన టీవీ చర్చలు దూసుకుని పోతున్నాయి. ఇక్కడ తప్పొప్పులు ఎంచడం శుద్ధ దండుగ.
టీవీ చర్చలో పాల్గొనడానికి ఒక విశ్లేషకుడికో, కొందరు రాజకీయపార్టీల ప్రతినిధులకో ఛానెల్ వారు ఆహ్వానం పంపుతారు. ఆ చర్చల్లో పాల్గొనేవారు చర్చాగోష్టి కార్యక్రమంలో సాధారణంగా వారి వారి పార్టీల విధానాలను తెలియజేస్తారు. కొంతమేర వాగ్వివాదాలు కూడా చోటు చేసుకుంటాయి. ఒకరినొకరు విమర్శించుకుంటారు. ఖండించుకుంటారు. ఆ ఖండనమండనల్లో వీలైనంతవరకు భాషాప్రయోగంలో సంయమనం పాటిస్తారు. ఆ తరువాత ఎవరిదారిని వారు వెళ్ళిపోతారు. అది సభ్యత. చర్చల్లో పాల్గొనేవారికి ఎంతో సహనం, సంయమనం ఉండాలి.
కానీ నిన్న రాత్రి ఏబీఎన్ ఛానెల్లో ప్రయోక్త వెంకటకృష్ణ నిర్వహించిన కార్యక్రమంలో అవాంఛిత దుర్ఘటన చోటు చేసుకుంది. పరస్పరం వాదించుకున్న అమరావతి జేఏసీ నేత శ్రీనివాసరావు, బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డిల మధ్య వివాదం ముదిరిపోయి అమరావతి నేత చెప్పు తీసుకుని విష్ణువర్ధన్ రెడ్డిని కొట్టడం వీక్షకులకు దిగ్భ్రాంతిని కలిగించింది. ఇక్కడ ఎవరి అభిమానులు వారికి మద్దతు ఇస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి మాట తూలడని తెలుగుదేశం వారు, శ్రీనివాసరావు దౌర్జన్యం చేశాడని బీజేపీ వారు పరస్పరం ఆరోపించుకుంటున్నారు. చర్చాకార్యక్రమంలో ఆవేశాలు హద్దులు దాటినపుడు షో నిర్వాహకుడు రెండు పక్షాలను నియంత్రించగలగాలి. ఇద్దరికీ సర్ది చెప్పాలి. ముష్టియుద్ధాలకు తావివ్వకూడదు. కానీ నిన్న జరిగిన సంఘటనలో మాత్రం వెంకటకృష్ణ అలాంటి ప్రయత్నం చేసినట్లు లేదు. పైగా అతనే శ్రీనివాసరావును రెచ్చగొట్టాడని చాలామంది తప్పు పడుతున్నారు. తప్పు ఎవరిదైనా కావచ్చు…కానీ, భౌతిక దాడులు చెయ్యడం అనేది గర్హనీయమైన చర్య. ఆయన చెప్పుతో కొట్టాడు కాబట్టి సరిపోయింది. అదే ఏ కత్తితోనో ఒక పోటు పొడిస్తే? ఎవరు బాధ్యత వహిస్తారు? తమ ఛానెల్ కు అతిధులుగా వచ్చినవారికి ఛానెల్స్ పారితోషికాలు ఇవ్వవు. కనీసం వారి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత లేదా? వారి రక్షణ బాధ్యత తీసుకోవాల్సిన పనిలేదా? ఈ విషయంలో ఏబీఎన్ ఛానెల్ పూర్తి బాధ్యత వహించాలి.
ఇక విష్ణువర్ధన్ రెడ్డి మీద జరిగిన దాడి తీరు చూస్తుంటే అది ఒక పధకం ప్రకారం జరిగిందే అనిపిస్తుంది. ఎంత ఆవేశానికి గురైనా అవతలి వ్యక్తి మీద దాడి చేయడం అనేది సాధారణంగా జరగదు. కానీ ఇక్కడ చెప్పుతో కొట్టాడంటే కచ్చితంగా అది ఉద్దేశ్యపూర్వకంగా జరిగినట్లే భావించాలి. ఇక విష్ణు కూడా బహిరంగ చర్చ జరుగుతున్నప్పుడు అవతలి ప్రతినిధిని “పెయిడ్ ఆర్టిస్ట్” అనడం తప్పు. వారికి అలాంటి అభిప్రాయం ఉంటే ఉండవచ్చు గాక. కెమెరాల ముందు ఆ రకంగా నిందించడం సబబేనా? విష్ణు అలా అన్నంతమాత్రాన అవతలి వ్యక్తి నిరసన తెలిపి క్షమాపణ కోరాలి తప్ప చెప్పులతో దాడి చేస్తే ఎలా? చర్చల్లో పాల్గొనేవారెవరైనా అవతలి ప్రతినిధుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేసినపుడు వెంటనే సరిదిద్దుకుని క్షమాపణ చెప్పుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక విష్ణువర్ధన్ రెడ్డి తెలుగుదేశం కోవర్టు అని వైసిపి వారు, ఆయన వైసిపి కోవర్టు అని తెలుగుదేశం వారు అప్పుడప్పుడు ఆరోపణలు చేస్తుంటారు. ఆయనకు మంచి విషయపరిజ్ఞానం ఉన్నది. కానీ, ఒక్కోసారి ఆయన వ్యాఖ్యలు సందేహాస్పదంగా ఉంటాయి.
నాకు తెలిసి విష్ణువర్ధన్ రెడ్డికి కేంద్ర సహాయమంత్రి హోదా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఆయన ప్రముఖ నేత. అలాంటివాడిమీద దాడి జరిగితే ఇక మామూలు వ్యక్తులకు దిక్కెవరు? పైగా తమను ఆహ్వానించినవారే అవమానించి పంపిస్తే అంతకుమించి దారుణం ఏమున్నది? ఇక్కడ మరీ షాక్ ఇచ్చే విషయం ఏమిటంటే విష్ణు అంతటి వాడిమీద చెప్పుతో దాడి జరిగినపుడు బీజేపీ శ్రేణుల స్పందన అత్యంత పేలవంగా ఉన్నది. బీజేపీ నాయకులు రగిలిపోలేదు. ఏవో మొక్కుబడి ఖండనలు మినహా విష్ణు స్థాయికి తగిన నిరసనలు జరగలేదు. దీన్నిబట్టి చూస్తే వారి పార్టీలో కూడా ఒకరంటే ఒకరికి గిట్టదేమో అనిపిస్తున్నది. చీటికిమాటికి ఎక్కడో ఏదో ఆలయంలో ఒకడు రాయి విసిరాడని, ఒక విగ్రహం చెయ్యి విరగ్గొట్టాడని రోడ్లమీదకొచ్చి బీభత్సాలు సృష్టించి జగన్మోహన్ రెడ్డిని అందుకు బాధ్యుడిని చేస్తూ ఆందోళనలు చేసే బీజేపీ కార్యకర్తలు, నాయకులు తమ నాయకుడిమీద దాడి జరిగితే తమకు పట్టనట్లు కూర్చోవడం విచిత్రమే. కనీస ఏబీఎన్ ఛానెల్ ను బహిష్కరిద్దాం అనే నిర్ణయం కూడా రాలేదు. చంద్రబాబును ఒక్కరూ విమర్శించే సాహసం చెయ్యలేదు. బీజేపీ నాయకుల్లో అనేకమంది తెలుగుదేశం కోవర్టులు ఉన్నారని చాలామంది చేసే ఆరోపణలు నిజమేనేమో అనిపించేవిధంగా ఉన్నది బీజేపీ ప్రతిస్పందన.
ఏమైనప్పటికీ ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకూడదని ఆశిద్దాం.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు.