తమిళనాడులో సినీ హీరో విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) తన తొలి జనరల్ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఫెడరలిజానికి విరుద్ధంగా ఉన్న అంశాలపై సూటిగా వైఖరి ప్రకటిస్తూ 17 కీలక తీర్మానాలను ఆమోదించింది. ముఖ్యంగా జాతీయ విద్యా విధానంలోని త్రిభాషా సూత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది కేంద్రం తలపెట్టిన విధానం, కానీ తాము దానిని ఏ రూపంలోనూ అంగీకరించబోమని స్పష్టం చేసింది.
చెన్నైలోని తిరువన్మయూర్‌లో జరిగిన ఈ సమావేశానికి పార్టీ అధినేత విజయ్ స్వయంగా హాజరై పార్టీకి శక్తిని చేకూర్చారు. సమావేశంలో డీలిమిటేషన్‌పై కూడ పార్టీ గట్టిగా స్పందించింది. 2026 తర్వాత దేశంలో ఎన్నికల నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ప్రయత్నాలు చేస్తుండగా, దక్షిణాదికి న్యాయం జరగదని టీవీకే అభిప్రాయపడింది. ఈ మార్పులతో దక్షిణ రాష్ట్రాల స్థానాలు తగ్గిపోతాయని, ప్రజాస్వామ్య విలువలకు భంగం కలుగుతుందని స్పష్టం చేసింది.
కేవలం జాతీయ అంశాలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై కూడ విజయ్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. పాత పెన్షన్ పథకంపై ప్రభుత్వం ఇచ్చిన హామీలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని ఎద్దేవా చేసింది. అలాగే, తమిళనాడులో డ్రగ్స్ వినియోగం పెరిగిపోతున్నదన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, దీనిపై ప్రభుత్వానికి పట్టిన అలసత్వాన్ని టీవీకే లక్ష్యంగా చేసుకుంది. యువతను బతికించాలంటే తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించింది.
శ్రీలంక అరెస్ట్ చేసిన తమిళ మత్స్యకారుల అంశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. సముద్రంలో జీవనోపాధికి పోరాడుతున్న భారతీయ మత్స్యకారులను టీవీకే అండగా నిలబడతుందని ప్రకటించింది. రాష్ట్రం, కేంద్రం మధ్య సమన్వయం లేక మత్స్యకారుల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. టీవీకే తీర్మానాలతో తమిళ రాజకీయాల్లో చర్చలకు తావు ఏర్పడినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.