ఇంట్లో పూజ మందిరం అనేది ఆధ్యాత్మిక శక్తులకు కేంద్రం. అక్కడ ఉండే ప్రతీ విగ్రహం, ప్రతీ చిత్రం మనసుకు శాంతి నింపేలా ఉండాలి. కానీ చాలా మంది తెలియకపోవడం వల్ల కొన్ని విగ్రహాలు, చిత్రాలు పూజ గదిలో ఉంచడం వలన ఇంట్లో అశాంతి, అనారోగ్యం, విభేదాలు పెరుగుతాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ధార్మిక గ్రంథాలు, వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో ఎలాంటి చిత్రాలు పెట్టకూడదో ఈ కథనంలో చూద్దాం.
పూజా మందిరంలో దేవుళ్ళ శాంత స్వరూపాలకే స్థానం ఇవ్వాలి. దుర్గామాత మహిషాసురుడిని వధించే రూపం, నరసింహ స్వామి ఉగ్ర రూపం, శివుడు తాండవం చేసే చిత్రం వంటి కోపం, వినాశనం ప్రతిబింబించే చిత్రాలు పూజ గదిలో ఉంటే ఇంట్లో ఉద్రిక్తత, కలహాలు పెరుగుతాయని పండితులు చెబుతున్నారు. పూజ స్థలం ప్రశాంతతకు ప్రతీక కావాలి కాబట్టి శాంత స్వరూపాలే ఉంచడం మంచిదని సూచిస్తున్నారు.
అలాగే పగిలిపోయిన విగ్రహాలు, చిరిగిన చిత్రాలు పూజ గదిలో ఉండకూడదు. ఇవి అశుభానికి సంకేతాలుగా పరిగణించబడి ఇంటి శుభవాతావరణం దెబ్బతింటుందని నమ్మకం. ఇలాంటి విగ్రహాలు ఫోటోలు ఉంటే వెంటనే వాటిని పవిత్రంగా నదిలో నిమజ్జనం చేయడం మంచిదని చెబుతుంటారు. ఇక యుద్ధ సన్నివేశాలు, మహాభారతం వంటి చిత్రాలు కూడా పూజ గదిలో ఉంచకూడదంట. ఇవి కుటుంబంలో కలహాలు తెస్తాయని భావిస్తారు. ఇంటిలో అనురాగం, స్నేహం, శాంతి పెరగాలంటే ప్రేమ, కరుణను ప్రతిబింబించే రూపాలకే ప్రాధాన్యం ఇవ్వాలి.
ఇంకో ముఖ్యమైన అంశం పూర్వీకుల చిత్రాల గురించి. చనిపోయిన పెద్దల ఫోటోలు పూజ గదిలో దేవతల పక్కన పెట్టడం శాస్త్రాలకు విరుద్ధం. వాటిని వేరే గదిలో నైరుతి దిశలో ఉంచితేనే అది అనుకూలంగా ఉంటుంది. పూర్వీకులను గౌరవించడం మంచిదే కానీ.. వారిని దేవుళ్లతో సమానంగా పూజించడం సరికాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అదే దేవుని విగ్రహాలు లేదా చిత్రాలు ఎక్కువగా పెట్టకూడదు. ఉదాహరణకు గణపతి విగ్రహాలు మూడు కన్నా ఎక్కువ ఉంటే, వాటి శక్తి విభజితమై శుభఫలితాలు తగ్గుతాయని నమ్మకం ఉంది. అందుకే ఒకటి లేదా రెండు మాత్రమే ఉంచడం ఉత్తమం.
ఇక పూజ గది ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. దుమ్ము పట్టిన చిత్రాలు, రంగు వెలిసిన ఫోటోలు ఉండకూడదు. కొత్తదనాన్ని ప్రతిబింబించేలా, పవిత్రతను కాపాడేలా ఆరాధన స్థలం ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ఈ నియమాలు పాటిస్తే పూజ గది ద్వారా ఇంట్లో సానుకూల శక్తులు పెరిగి కుటుంబానికి ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి లభిస్తుందని విశ్వాసం. ఒక చిన్న నిర్లక్ష్యం ఇంటి వాతావరణాన్నే ప్రభావితం చేయగలదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. (గమనిక: ఈ కథనం పండితులు అందించిన సాధారణ సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు.)
