తెలుగుదేశం పార్టీలో కొందరికి పదవులు రాలేదని అసంతృప్తితో రగలిపోతున్నారట. అధినేతపై గుస్సా అవుతున్నారట. దశాబ్దాలుగా పార్టీకి సేవలందించినవారిని కాదని, పేరు – పలుకుబడి లేని వ్యక్తులకు పదవులు ఇస్తున్నారంటూ పార్టీ అధినేతపై కారాలూ మిరియాలూ నూరేస్తున్నారట తెలుగు తమ్ముళ్ళు. ఇంతకీ, అవి ప్రభుత్వ పదవులు కావు.. పార్టీ పదవులు. ఆ పదవులతో నేతలు ఏం చేసుకుంటారట.? ఆ మాత్రం ఇంగితం కూడా లేకుండా తెలుగు తమ్ముళ్ళు రోడ్డెక్కుతోంటే అధినేత చంద్రబాబు తలకి బొప్పి కడుతోంది.
నిండా మునిగినోడికి చలేంటి.?
తెలుగుదేశం పార్టీ నిండా మునిగిపోయింది 2019 ఎన్నికల్లో. పార్టీ గురించి ఆలోచించకుండా, ప్రభుత్వం తమదన్న గర్వంతో విర్రవీగిన చంద్రబాబు, తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఇప్పుడేమో పార్టీలో సంస్కరణలంటూ పిల్లిమొగ్గలేస్తున్నారు. కమిటీలు వేశారు.. బీసీలు, దళితులు, మైనార్టీలంటూ లెక్కలు చెబుతున్నారు. ఇవన్నీ పార్టీని ఉద్ధరించేస్తాయా.? అంటే, చంద్రబాబు అలా నమ్ముతున్నారుగానీ, తెలుగు తమ్ముళ్ళలో ఆ నమ్మకమే కనిపించడంలేదు. చంద్రబాబులో మార్పు రాలేదు, అధికారంలో వున్నప్పుడు ఒకలా, అధికారం పోయాక ఇంకోలా వ్యవహరించడం చంద్రబాబుకి అలవాటే.
టీడీపీ మీద రాళ్ళేస్తే.. ఎవరికి నష్టం.!
అసలు టీడీపీ అనేదొకటి వుందా.? అనే చర్చ కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతోంది. అంతలా ఆ పార్టీ ఆయా నియోజకవర్గాల్లో దిగజారిపోయింది. అక్కడ, అలాంటి చోట్ల కింది స్థాయి నేతలు తమకు పదవులు దక్కలేదంటూ పార్టీ మీద రాళ్ళేస్తే ఎవరికి ప్రయోజనం.? గొడవ చేస్తే పబ్లిసిటీ వస్తుందన్న కక్కుర్తి కొందరితైతే, ఇతర పార్టీల నుంచి ప్రేరేపితమై హంగామా సృష్టించే రకం ఇంకొందరు. వెరసి, టీడీపీ బాగానే టీడీపీ వ్యతిరేక మీడియాలో హైలైట్ అవుతోంది.
ఇంకోసారి టీడీపీకి అధికారం.. ఎంత నిజం.?
రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎలాగైనా మారిపోవచ్చు. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోతుందని ఎవరైనా ఊహించారా.? అది చంద్రబాబుకి అప్పట్లో కలిసొచ్చి, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి ఆయన ముఖ్యమంత్రి అయిపోలేదూ.! ఏమో గుర్రం ఎగరావచ్చు.. అన్న ఆలోచనతో చంద్రబాబు వున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర కమిటీలంటూ ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. పాపం, ఆయనగార్ని కరోనా కనికరించట్లేదాయె. కరోనా దెబ్బకి ఆయన ఇంట్లోంచి బయటకు రాలేకపోతున్నారాయె.