తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీని ప్రకటించింది. మొన్ననే కదా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడ్ని ప్రకటించింది.! మళ్ళీ కొత్తగా ఈ కమిటీ నియామకాల గోలేంటి.? అనే డౌట్ చాలామందికి వచ్చింది. అలా డౌట్ వచ్చినవారిలో తెలుగు తమ్ముళ్ళూ వున్నారు. ఇది చాలు, తెలుగుదేశం పార్టీ పట్ల తెలుగు తమ్ముళ్ళు ఎంతటి అంకిత భావంతో పనిచేస్తున్నారో చెప్పడానికి. కనుమరుగైపోయిన పార్టీకి ఖతర్నాక్ అధ్యక్షుడు చంద్రబాబు.. అనే విమర్శలు రాజకీయ ప్రత్యర్థుల నుంచి వినిపిస్తున్న వేళ, చంద్రబాబు అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ ఏపీ రాష్ట్ర కమిటీ ప్రకటన జరిగిందన్నమాట.
ఓహో.. టీడీపీలో ఇంతమంది నేతలున్నారా.?
చూస్తోంటే, తెలుగుదేశం పార్టీ బలం ఏమాత్రం తగ్గలేదు.. పార్టీకి నాయకత్వ లోటు ఏమీ లేదు.. పార్టీ కోసం పనిచేసే నిఖార్సయిన నేతలు చాలామందే వున్నారని చెప్పుకోడానికే ఈ కమిటీ ఏర్పాటు చేశారేమో అనిపిస్తోంది. చాలామంది సీనియర్ నేతల పేర్లు ఈ కమిటీలో కన్పించాయి. కొందరు పేరూ ఊరూ లేని నేతలకూ కమిటీలో చోటు దక్కడం గమనార్హం. యువకులకు ఎక్కువ అవకాశాలిచ్చాం.. సీనియర్లను గౌరవించాం.. అని చెప్పుకుంటోంది తెలుగుదేశం పార్టీ. కానీ, ఏం లాభం.? పార్టీ కోసం గట్టిగా నిలబడే నేతలు ఎవరన్నా వున్నారా.? అని ఆరా తీస్తే.. ‘అనుమానం’ తప్ప, ఖచ్చితత్వం ఏమీ కనిపించడంలేదు.
లోకేష్ వుండగా.. వాళ్ళంతా ఎందుకు దండగ.!
పార్టీ తరఫున ఏ కీలక నిర్ణయమైనా చంద్రబాబే తీసుకుంటారు. చంద్రబాబు నిర్ణయం తీసుకున్నా తీసుకోకపోయినా, లోకేష్ ఏం చెబితే అదే జరుగుతుంది పార్టీలో. ప్రాంతీయ పార్టీల్లో ఈ సమస్య మామూలే అయినా, టీడీపీలో పరిస్థితి మరీ దారుణం. నారా లోకేష్ కారణంగానే చాలామంది సీనియర్ నేతలు టీడీపీకి దూరమయ్యారన్నది నిర్వివాదాంశం. ఆ మాటకొస్తే, అచ్చెన్నాయుడికి టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి ఇవ్వడం లోకేష్‌కి ఏమాత్రం ఇష్టం లేదనే ప్రచారం గతంలో జరిగింది. ఆ కారణంగానే చాలా జాప్యం జరిగిందట కూడా అచ్చెన్నాయుడికి ఆ పదవి ఇచ్చే విషయమై.
పదవులు దక్కినవారిలో ఎంతమంది పార్టీతో వుంటారో.!
కమిటీ అదిరింది.. కానీ, అందులో ఎంతమంది ఆయా బాధ్యతల్లో ఇమిడిపోగలరు.? కొన్నాళ్ళ క్రితం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడితోపాటు పొలిట్‌బ్యూరో వంటి విభాగాలకు సంబంధించి నియామకాలు జరిగాయి. అందులో ఎంతమంది రాజకీయాల్లో యాక్టివ్‌గా వున్నారు.? సో, కొత్త కమిటీతోనూ పెద్దగా ఉపయోగం లేదన్నమాట. ఉపయోగం లేదని చంద్రబాబుకీ తెలుసు. తెలిసీ ఈ తాపత్రయం ఎందుకంటారా.? ఏదో ఒకటి చేస్తున్నట్లు కనిపించాలి కదా.! అద్గదీ అసలు సంగతి.