తెలంగాణలో చానా చెప్తాండావ్, ఆంధ్రలో అవన్నీ ఎందుకు చేయలేదో?

(వి. శంకరయ్య)

 

తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రసంగాలు మున్ముందు ఎపిలో తీవ్ర ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. ప్రకంపనలు తేవచ్చు. కాంగ్రెస్ పార్టీ తో కలసి ప్రజా కూటమి పేరుతో ఉమ్మడి ఎన్నికల ప్రణాళికతో పాటు ఉమ్మడి గా ప్రచారం చేస్తున్నారు. ప్రజా కూటమి అధికారంలోకి వచ్చినా అది చేసిన వాగ్దానాలు హామీలు అమలు జరపడం సాధ్యం కాని పని. అధికారం కోసం అలివి కాని హామీలు ఇస్తున్నారు. మున్ముందు తెలంగాణలో ఏం జరుగుతుందో పక్కన బెడితే ఎపిలో అధికారంలో వున్న టిడిపి గతంలో తాను చేసిన వాగ్దానాలు అమలు చేయలేక అపసోపాలు పడుతోంది. పైగా పులి మీద పుట్ర లాగా అంతకు మించి తెలంగాణ ప్రజా కూటమిలో భాగస్వామిగా వుంటూ టిడిపి ఏడా పెడా  వాగ్దానాలు చేస్తున్నది. తెలంగాణ లో అధికారంలోనికి వస్తే అమలు జేయగల పథకాలుఎపి లో మాత్రం ఇంత వరకు ఎందుకు అమలు కాలేదనే ప్రశ్న కు టీడీపీ నేతలు జవాబు చెప్ప వలసి వుంది

మచ్చుకు రైతు రుణ మాఫీ. రెండు లక్షలు ఏక మొత్తంగా మాఫీ. ఎపిలో లక్షా50 వేలు రుణ మాఫీ అమలు చేసినా నాలుగేళ్లుగడచినా ఇంకా రెండు కంతులు రైతులకు ఇవ్వాలి. 9 వేల కోట్లు వుంటే బయట పడతారు. మార్చి వరకు ప్రభుత్వ సాదర ఖర్చులు ఉద్యోగుల జీతాలకే ఆదాయం సరిపోవడం లేదు. అప్పు చేయాలంటే కేంద్రంఅనుమతి ఇవ్వడం లేదని చెప్పి తప్పించు కుంటునారు. రేపు ఎన్నికలు సమీపించే సరికి ఎదురు దాడితో ప్రతి పక్షాల నోరు మూయించినా ప్రజలు పక్క రాష్ట్రంలో దంచిన ఊక దంపుడు ఉపన్యాసాలను గుర్తు చేసి నిలదీయ కుంటారా?తెలంగాణలో అమలు చేయాలని కోరిన పథకాలు ఎపిలో ఎందుకు అమలు చేయలేదని ప్రజలు అడిగితే ఏమని సమాధానం చెబుతారు?

మరీ నిరుద్యోగ భృతి ముఖ్యమంత్రికి తల నొప్పులు తెప్పించనుంది. 2014 ఎన్నికల్లో నిరుద్యోగ భృతి రెండు వేలు ఇస్తామని చెప్పి నాలుగేళ్లు మోసం చేసి ఎన్నికలు ఆరు నెలలు వుండగా వేయి చొప్పున ఇచ్చారు. అది కూడా 10 లక్షల మంది దరఖాస్తు చేస్తే వడబోసి మూడు లక్షల మంది కి మంజూరు చేశారు. కాని తెలంగాణలో ఏకంగా మూడు వేలు నిరుద్యోగ భృతి ప్రకటించారు. అందులో టిడిపి కి బాధ్యత వుంది. ఇది ఏలా వుందంటే తన రాష్ట్రంలో మాత్రం అమలు చేయ లేదు. పక్క రాష్ట్రంలోని తమ పార్టీ మాత్రం బడాయి కబుర్లు చెప్పడం కాదా? రేపు ఎపిలో ఎన్నికల ముందు గాని ఎన్నికల సందర్భంగా గాని ముఖ్యమంత్రి చెప్పే మాటలను ఎపి ప్రజలు విశ్వసించుతారా? తల్లి కి దాహం పోలేని వ్యక్తి పిన తల్లికి పట్టు చీర కొని ఇస్తానని చేసిన వాగ్దానం లాగా లేదా?

 

అదే విధంగా డబుల్ బెడ్ రూమ్ లు అవి లేని వారికి 50 వేలు ఇంటి అద్దె వీటన్నింటినీ మించి మహిళా సంఘాలకు లక్ష రూపాయల గ్రాంట్ మున్ముందు ఎపిలో టిడిపి కి పీకల మీదకు తీసుకు రావడం తథ్యం.

 

ఎపిలో డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని చేసిన వాగ్దానం గాలికి పోయింది. తుదకు వడ్డీ మాఫీ కూడా సక్రమంగా అమలు జరగ లేదు. కేంద్ర సహకరించ లేదు. కాబట్టి ఈ అయిదు ఏళ్లు చేయలేకపోయామని ఇక ముందు తెలంగాణ ప్రజా కూటమి చేసినలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎంత మొత్తుకునా టిడిపి నేతలమాటలను ప్రజలు నమ్మే పరిస్థితి చేయి దాటి పోయింది.

 

ఇవన్నీ అటుంచి పార్టీ ఫిరాయింపులు అంశం ఎపిలో మున్ముందు పెను తుఫాను సృష్టించనుంది. 2014 ఎన్నికల తర్వాత ముందుగా కెసిఆర్ పార్టీ ఫిరాయింపులకు తెర దీశారు. టిడిపి తెలంగాణ లోనే వుండ కూడదని ఎక్కువ మందిని ఫిరాయింపు చేయించారు.పైగా ఓటుకు నోటు కేసు తదితర చిక్కులతో చంద్రబాబు హైదరాబాద్ వదలి పెట్టడం ఈ లోపు జంట నగరాల కార్పొరేషన్ ఎన్నికలు రావడంతో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పార్టీ ఫిరాయింపులను రాజకీయ వ్యభిచారంగా అభివర్ణించారు. అంతవరకు బాగానే ఉంది కానీ కొద్ది నెలలు గడవక మునుపే ఎపిలో కెసిఆర్ ను మించి చంద్రబాబు ఫిరాయింపులకు తెర దీశారు. పలువురికి మంత్రి పదవులు ఇచ్చారు. కానీ మరో విశేష మేమంటే ముఖ్యమంత్రి చంద్రబాబు అంతవరకు మిన్న కుండా తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంగా పార్టీ ఫిరాయించిన వారిని తరిమి కొట్టాలని చిత్తు చిత్తు గా ఓడించాలని పదే పదే ప్రసంగాలు చేయడం ఎపిలో హాట్ టాపిక్ గా మారింది. ఎపిలో పార్టీ ఫిరాయించిన వారిని పక్కన పెడితే టిడిపి శ్రేణులు నేడు అయోమయంలో పడ్డాయి.

ముఖ్యమంత్రి ప్రసంగాలలో వ్యక్త మౌతున స్వ వచన విఘాతాలపై ప్రజలకు జవాబు చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది . రేపు ఎపిలో ఎన్నికల సమయంలోనే కాకుండా ఈ లోపు ప్రజలకు ఏమని సమాధానం చెప్పాలని మధనం మొదలైంది.ఎవరైనా ద్వితీయ శ్రేణి నేత మాట్లాడివుంటే ముఖ్యమంత్రి మందలించే వారు. ఇప్పుడు కంచెె చేను ను మేసింది ముఖ్యమంత్రికి చెప్పే వారు ఎవరు? ిముఖ్యమంత్రి కి మతి మరుపు వచ్చిందా? లేక ఈ పాటికే ప్రచారంలో వున్నట్లు చంద్రబాబు వంద నాలుకలు అనే ప్రచారం ప్రకారం ఏ అంశంపైన అయినా ఎన్నో రకాలుగా మాట్లాడటంలో భాగంగా ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతాయని టిడిపి శ్రేణులలో మధనం సాగు తోంది. ఇదిలా వుండగా పార్టీ ఫిరాయించిన వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తు తున్నాయి నిజంగాఎపిలో కూడా ముఖ్యమంత్రి ఇలాంటి ప్రసంగాలు పొర పాటుగా నైనా చేస్తారేమోనని కొందరు భయ పడే అవకాశముంది. ఏతావాతా తుది గా తెలంగాణ ఎన్నికలలో చంద్రబాబు ప్రసంగాలు ఎపిలో టిడిపి కి యమ పాశాలుగా చుట్టు కొంటాయేమో.

 

(వి. శంకరయ్య,  రాజకీయ వ్యాఖ్యాత  ఫోన్ నెం. 9848394013)