తెలంగాణ రాజకీయం గడచిన తొమ్మిదిన్నరేళ్ళుగా చిత్ర విచిత్రంగా నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలూ ఇందుకు భిన్నంగా ఏమీ లేవు. కాకపోతే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది వుంటోంది. తెలంగాణలో మాత్రం, ప్రతిపక్షం కనిపించడంలేదు.
2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తంగా 175 నియోజకవర్గాల్లో 151 చోట్ల గెలిచినా, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా వుంది. తెలంగాణ రాజకీయం వేరు.! ప్రతిపక్షానికి ఆ హోదా నిలబెట్టుకోవడమే కనాకష్టంగా తయారైపోతోంది.
2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్‌గా మారింది) గెలిచింది.. కాంగ్రెస్, టీడీపీ నుంచి, ఇతర పార్టీల నుంచీ నేతల్ని లాగేసింది. తెలంగాణలో ప్రతిపక్షం వుందా.? లేదా.? అన్న అనుమానం, 2019 ఎన్నికలదాకా కొనసాగుతూ వచ్చింది.
2019 ఎన్నికల్లో మళ్ళీ టీఆర్ఎస్ గెలిచింది. టీడీపీ ఆ తర్వాత పూర్తిగా ఖాళీ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు ఖాళీ అయిపోయింది. ఈ నేపథ్యంలో, ఈ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏం జరగబోతోంది.?
ఎవరు గెలిచినా, విపక్షాలైతే నిర్వీర్యమైపోవాల్సిందే. అంతలా, తెలంగాణలో ప్రజా ప్రతినిథులు అమ్ముడుపోతున్న వైనం సుస్పష్టంగా కనిపిస్తోంది. ‘బంగారు తెలంగాణ’ కోసం అని, గులాబీ పార్టీలోకి నేతలు జంప్ చేస్తున్నా, అసలు విషయం ఏంటన్నది అందరికీ తెలుసు.
తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లోనూ ముందు ముందు ఇదే జరగబోతోంది. వైసీపీ గనుక మళ్ళీ గెలిస్తే, తెలుగుదేశం పార్టీ పూర్తిగా కాలగర్భంలో కలిసిపోతుంది. సేమ్, టీడీపీ గెలిచినా.. వైసీపీ అడ్రస్ గల్లంతయ్యేలా ఎమ్మెల్యేల కొనుగోళ్ళుంటాయ్.!