బండిని అరెస్ట్ చేసి కవితను బలిచేస్తున్నారా?

పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో బండి సంజయ్ పాత్ర ఉందని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచడంతో.. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో సంజయ్ ను కరీంనగర్ జైలుకు తరలించారు పోలీసులు. అయితే ఈ విషయంలో బీజేపీ అధిష్టానం చాలా సీరియస్ గా ఉందని తెలుస్తుంది. ఈ సమయంలో సంజయ్ ని అరెస్ట్ చేయడం అంటే.. మోడీని గిల్లినట్లేనని అంటున్నారట బీజేపీ శ్రేణులు.

పార్టీ “ఫౌండేషన్ డే” ను ఘనంగా నిర్వహించుకుంటున్న సందర్భంగా.. సరిగ్గా ఆరోజుకు ఒక రోజు ముందు స్టేట్ చీఫ్‌ ను అరెస్టు చేయడంపై జాతీయ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారట. ఇదే క్రమంలో… మోడీ హైదరాబాద్ రాకకు మూడు రోజుల ముందు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం అంటే… పరోక్షంగా మోడీకి వార్నింగ్ ఇచ్చినట్లేనని అనుకుంటున్నారట. ఫలితంగా సంజయ్ అరెస్ట్ పై రియాక్షన్ ఇవ్వడం అనేది బీజేపీకి ఇజ్జత్ కా సవాల్ అని ఫిక్సయ్యారంట ఢిల్లీ పెద్దలు.

దీంతో సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. మోడీకి, బీజేపీ నేతలకు, బీజేపీ శ్రేణులకు షాక్ ఇవ్వడంకోసం.. సంజయ్ ని బీఆరెస్స్ ప్రభుత్వం కావాలనే అరెస్ట్ చేసిందని.. పదోతరగతి ప్రశ్నాపత్రాలు లీక్ చేయించి – వాటిని సంజయ్ ఫోన్ కి పంపించి అరెస్టు చేయించారని.. ఇది సూపర్ స్కెచ్ అని అంటున్నారు బీజేపీ శ్రేణులు.

దీంతోపాటు… ఇక్కడ బండిని అరెస్టు చేసి, మోడీ హైదరాబాద్ వస్తున్న సమయంలో తన బలం ఏమిటో కేసీఆర్ చూపించారని అభ్హిప్రాయపడుతున్నారు స్థానిక బీజేపీ కార్యకరలు. ఫలితంగా… బీజేపీ నేతలు కూడా ఢిల్లీ స్థాయిలో రివేంజ్ తీర్చుకోవాలని ఆన్ లైన్ వేదికగా హస్తిన నేతలను కోరుతున్నారు. దీంతో… కవిత లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించిన కంటెంట్ పోస్ట్ చేస్తూ… మోడీ & కోలకు హింట్ ఇస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు పెంచాలని.. వీలైనంత తొందర్లో దోషులను కటకటాల్లోకి పంపాలని.. ఇదే కేసీఆర్ కు బీజేపీ ఇచ్చే రిటన్ గిఫ్ట్ అవుతుందని అంటున్నారు. దీంతో… ఉరిము ఉరిమి మంగళం మీదపడ్డట్లు… సంజయ్ అరెస్టు అటు తిరిగి ఇటు తిరిగి కవిత మెడకు చుట్టుకుందని, ఇప్పుడు కేసీఆర్ పై మోడీ రివెంజ్ తీసుకోవడానికి అత్యంత అనువైన అవకాశం.. ఢిల్లీ లిక్కర్ స్కాం అని అంటున్నారు బీజేపీ కార్యకర్తలు.

దీంతో వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి కవిత కు చుట్టుకుంటుందని.. బీజేపీ నేతలు బీఆరెస్స్ పై రివేంజ్ తీసుకోవాలంటే… వారికి అందుబాటులో ఉన్న అస్త్రం ఢిల్లీ లిక్కర్ స్కాం అని అంటున్నారు. మరి… బీజేపీకి ఇజ్జత్ కా సవాల్ అయిన బండి సంజయ్ అరెస్టు విషయంలో… కార్యకర్తల కోరికలకు మోడీ & కో లు ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి!