తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైసీపీకి ఏంటి సంబంధం.? 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో వైసీపీకి, తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ (ఇప్పుడు పేరు మారి, బీఆర్ఎస్ అయ్యింది) పూర్తి సహాయ సహకారాలు అందించిన మాట వాస్తవం.
చంద్రబాబు, గులాబీ పార్టీని కెలికారు.. ఒళ్ళు మండి, వైసీపీకి మద్దతిచ్చింది గులాబీ పార్టీ.! ఆ దెబ్బకి టీడీపీ కేవలం 23 సీట్లకు పరమితమైన సంగతి తెలిసిందే. తమకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ అప్పట్లో సహకరించిన గులాబీ పార్టీకి, ప్రస్తుతం వైసీపీ తెలంగాణలో సహకరిస్తోంది.
బీఆర్ఎస్ పార్టీకి వైసీపీ సానుభూతిపరులు తెలంగాణలో సహకరించడాన్ని తప్పు పట్టలేం. తెలంగాణలో వైసీపీ లేదు గనుక, వైసీపీ అభిమానులు తెలంగాణలో ఏ పార్టీకి అయినా సహకరించొచ్చుగాక.! ఇది ప్రజాస్వామ్యం.. ఎవరిష్టం వాళ్ళది.
అయితే, బీఆర్ఎస్ మీద ఈగ వాలినా వైసీపీ మద్దతుదారులు తట్టుకోలేకపోతున్నారు. బీజేపీ మీద మండిపడుతున్నారు, టీడీపీని తూలనాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ మీద విమర్శల సంగతి సరే సరి. జనసేన విషయంలో వైసీపీ మద్దతుదారులు చేస్తున్న యాగీ అంతా ఇంతా కాదు.
అవసరమా ఇదంతా.? అని కొందరు వైసీపీ సానుభూతిపరులే వ్యాఖ్యానిస్తున్నారంటే, ఏ స్థాయిలో వైసీపీ మద్దతుదారులు కొందరు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్ని సీరియస్‌గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. గులాబీ పార్టీకే వైసీపీ శ్రేణులు మద్దతిస్తున్నాయి. వైసీపీ జెండాల్లేవుగానీ, బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ క్యాడర్ స్పష్టంగా కనిపిస్తోంది.
ఆసక్తికరమైన విషయమేంటంటే, షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టాక ఆమె వెంట నడిచిన వైసీపీ క్యాడర్, ఆమె తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడంలేదనగానే, వైటీపీ జెండా వదిలేసి, గులాబీ జెండా పట్టుకోవడం.!