సెటిలర్స్… కేసీఆర్ పై కాన్సంట్రేషన్ ప్లీజ్!

రాష్ట్ర విభజన సమయంలో నెలకొన్న సమస్యలు, హైదరాబాద్ లోని ఆస్తుల పంపకాలు, ఢిల్లీ లోని ఏపీ భవన వాటాల విషయంలో క్లారిటీ రావాలంటే… కేసీఆర్ ఉన్నంత కాలం రాదని. ఆయన తదనంతరం మరో ప్రభుత్వం వస్తే తప్ప అది సాధ్యం కాదని, దీనివల్ల అటు తెలంగాణకూ ప్రశాంతత లేకపోగా, ఇటు ఏపీకి అన్యాయం జరుగుతుందని అంటున్నారు విశ్లేషకులు. పైగా ఏపీపై ప్రేమ ఉన్నట్లు కహానీలు చెబుతున్న కేసీఆర్ ని… తెలంగాణలోని సెటిలర్లు, ఏపీలోని బీఆరెస్స్ నేతలు ప్రశ్నించాలని చెబుతున్నారు!

అవును… కేసీఆర్ అన్ని విషయాల్లోనూ అడ్డం తిరుగుతుండటంతో విభజన సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకం తగ్గిపోతోందనే చెప్పాలి. కారణ… మిగులు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రం, అత్యంత ధనిక రాష్ట్రం, ఏపీ ప్రజలు కూడా తన బిడ్డలే అనేస్థాయి మాటలు చెప్పే తెలంగాణ ప్రభుత్వ పెద్దలు… విభజన సమస్యల పరిష్కారానికి మాత్రం సహకరించటం లేదు. ఫలితంగా… మైకుల ముందు తాము మాట్లాడే మాటలకు, తెరవెనుక చేసే పనులకూ పొంతన ఉండదని చెప్పకనే చెబుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే… 2014లో రాష్ట్ర విభజన సమయంలో… రెండు తెలుగు రాష్ట్రాలు ఆస్తులు, అప్పులను పంచుకునే విషయంలో స్పష్టమైన సూత్రాన్ని నిర్దేశించింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. అయితే ఆ విషయంలో నాడు ఎన్నికల ముందు అన్నింటికీ అంగీకరించిన కేసీఆర్… అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డం తిరిగారు. తెలంగాణాలో, ప్రత్యేకించి హైదరాబాద్ లో ఉన్న ఆస్తులు, కేంద్ర ప్రభుత్వ సంస్ధలన్నీ తమవే అని మాట్లాడారు. దీంతో… అధికారంలోకి వచ్చిన తర్వాత… తెలంగాణ ప్రజలనే మోసం చేసిన వ్యక్తి.. ఏపీ ప్రజలను వంచించడం పెద్ద విషయం కాదనే మాటలు తెరపైకి వచ్చాయి.

ఆ సంగతులు అలా ఉంటే… తాజాగా ఢిల్లీలోని ఏపీ భవన్ విషయంలో కేంద్రహోంశాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కూడా ఇలాగే అడ్డుగోలు వాదనలు వినిపించింది తెలంగాణ ప్రభుత్వం. ఢిల్లీలోని ఏపీ భవన్ మొత్తం తమకే దక్కాలని అడ్డగోలు వాదన వినిపించింది. నిజానికి దీన్ని కూడా 58 : 42 నిష్పత్తిలో పంచుకోవాలి. అయితే తమకు దక్కాల్సింది 42 శాతం కాదని 100 శాతమంటు తెలంగాణా ప్రభుత్వం గోలచేస్తోంది. దీనికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదన… ఏపీ భవన్ ను నిర్మించింది నిజాం ప్రభుత్వం కాబట్టి… నిజాం ప్రభుత్వ ఆస్తులన్నీ తెలంగాణా కే దక్కాలని!

సో… తాజా వాదనలు విన్న తర్వాత… విభజన హామీల అమలుకు, విభజన సమస్యల పరిష్కారానికి తెలంగాణా ప్రభుత్వం సుముఖంగా లేదని అర్ధమవుతోందని.. కేసీఆర్ అధికారంలో ఉన్నంత కాలం విభజన సమస్యలు పరిష్కారం కావని.. ఫలితంగా అటు తెలంగాణ ప్రజలకూ ఒరిగేదేముండదు, ఏపీ ప్రజలకు కలిగేదేముండదని క్లారిటీ ఇస్తున్నారు విశ్లేషకులు! ఈ విషయాలను తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజలు, సెటిలర్లు అర్ధం చేసుకోవాలని చెబుతున్నారు. ఇక ఏపీలో బీఆరెస్స్ నేతలు దీనిపై ఏమంటారో చెప్పాలని నిలదీస్తున్నారు!