తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి టీడీపీ పారిపోయింది.! ఇది అందరికీ తెలిసిన విషయమే. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్‌లో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుకి సంబంధించి అరెస్టయిన దరిమిలా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయమై టీడీపీ లైట్ తీసుకోవాల్సి వచ్చింది.
అప్పటిదాకా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా వున్న కాసాని జ్ఞానేశ్వర్, టీడీపీకి గుడ్ బై చెప్పేసి, భారత్ రాష్ట్ర సమితిలో చేరిపోయారు. ఏపీలో టీడీపీ – జనసేన మధ్య పొత్తు వున్నా, తెలంగాణలో జనసేనకి టీడీపీ సహకరించకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
సహకరించడం సంగతి దేవుడెరుగు, టీడీపీ ఎన్నికల బరిలో లేకపోయినా, జనసేనని రాజకీయ ప్రత్యర్థిగా తెలుగు తమ్ముళ్ళు చూస్తుండడం గమనార్హం. టీడీపీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి.
గతంలో టీడీపీ నేతగా వున్న రేవంత్ రెడ్డి, ప్రస్తుతం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు. అయినాగానీ, రేవంత్ రెడ్డిని చంద్రబాబు మనిషిగా చెబుతుంటారు. అందుకే, రేవంత్ రెడ్డి పట్ల మమకారంతో, తెలుగు తమ్ముళ్ళ కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తుండడం గమనార్హం.
బీజేపీ – జనసేన కలిసి పని చేస్తున్నాయి తెలంగాణలో ప్రస్తుతం. జనసేన పోటీ చేస్తున్న స్థానాల్లో బీజేపీ నుంచి జనసేనకు దక్కుతున్న సహకారం చాలా చాలా తక్కువ. టీడీపీ నుంచి ఆయా నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది జనసేన.
వాస్తవానికి తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి చాలా బలంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం వుందన్న ప్రచారం సంగతి సరే సరి. తర్వాతి స్థానంలో వున్నది బీజేపీ. మజ్లిస్ పార్టీ కొన్ని నియోజకవర్గాల్ని ఖచ్చితంగా తమ ఖాతాలో వేసుకుంటుంది. మిగతా చోట్ల గులాబీ పార్టీకి సహకరిస్తుంది. జనసేన పాత్ర చాలా తక్కువ. కానీ, టీడీపీ నుంచి దారుణమైన నెగెటివిటీని తెలంగాణలో జనసేన ఎదుర్కొంటోంది.