ప్రకాశం జిల్లా ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా సంచలన ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని స్పష్టం చేశారు. తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేస్తారని ఆయన వెల్లడించారు.
“చంద్రబాబు ఆదేశాల మేరకు గత ఎన్నికల్లో నేను పోటీ చేశాను. నా కుటుంబానికి ప్రజలు ఎల్లప్పుడూ ఆదరణ చూపాలి,” అని ఎంపీ మాగుంట కోరారు. రాబోయే ఎన్నికల్లో తన కుమారుడి రాజకీయ రంగ ప్రవేశంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. వాస్తవానికి, 2024 ఎన్నికల్లో కూడా తమ కుమారుడితో పోటీ చేయించాలని భావించామని, అయితే అధినేత చంద్రబాబు నిర్ణయం మేరకు తాను పోటీ చేశానని తెలిపారు.

రాజకీయ వర్గాల్లో ఆసక్తి: పలు పార్టీలు మారిన మాగుంట శ్రీనివాసులురెడ్డి తాజా ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. 1998, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన మాగుంట, 2019లో వైఎస్సార్‌సీపీ నుంచి, 2024లో టీడీపీ నుంచి ఒంగోలు ఎంపీగా విజయం సాధించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన కొద్ది నెలలకే ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. మాగుంట ప్రస్తుతం గృహ, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా కూడా ఉన్నారు.
మాగుంట చేసిన ఈ ప్రకటనతో ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గంలో తదుపరి రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై చర్చ మొదలైంది.

