బీజేపీతో ప్రమాదకరమైన స్టంట్ చేస్తున్న టీడీపీ నేతలు.. ?

TDP leaders ready for risky stunt with BJP
రాజకీయాల్లో నేతలు ఒక పార్టీ నుండి ఇంకొక పార్టీలోకి జంప్ చేయడం మామూలు విషయమే.  ప్రతి పొలిటికల్ పార్టీలోనూ ఈ తరహా హడావుడి ఉంటూనే ఉంటుంది.  వీరిలో కొందరు పార్టీ సిద్దాంతాలు నచ్చక వేరొక పార్టీలోకి వెళితే, ఇంకొందరు గెలిచిన పార్టీలోనే ఉండాలనే ఆశతో జెండాలు మారుస్తుంటారు.  ఎక్కువ శాతం భవిష్యత్తు వెతుక్కుంటూ అధికార పార్టీ పంచన చేరేవారే అధికం.  వీరి మూలంగానే రాజకీయ పార్టీలు సంక్షోభంలో పడుతుంటాయి.  ఈ పద్దతి పాతది.  కానీ భయంతో పార్టీలు మారే కొత్త తరహా రాజకీయం ఇప్పుడు ఆంధ్రాలో నడుస్తోంది.  అధికారంలో ఉన్న వైసీపీ ప్రతిపక్ష పార్టీలోని నేతల అవినీతి చిట్టాలను బయటకు లాగి అరెస్టులు చేస్తోంది.  ఇప్పటికే కొందరిని జైళ్లకు పంపింది. 
 
 
దీంతో ప్రతిపక్ష నేతలు కొందరు స్వీయ రక్షలో పడిపోయారు.  పార్టీ సంగతి పక్కనపడేడి తమను తాము ఎలా కాపాడుకోవాలో అని ఆలోచిస్తున్నారు.  అధికార వైసీపీ టచ్ చేయలేని శక్తుల అండ తమకు ఉంటే గట్టెక్కవచ్చని యోచన చేసి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.  అలాంటి వారందరికీ భారతీయ జనతా పార్టీ మంచి ఆశ్రయంగా కనిపిస్తోంది.  ఇప్పటికే కొందరు రాజ్యసభ సభ్యులు టీడీని వీడి బీజేపీలో చేరిపోగా ఇప్పుడు ఇంకొందరు అదే బాటలో అడుగులు వేస్తున్నారట.  అలాంటి వారిలో విశాఖ నార్త్ ఎమెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.  గంటా టీడీపీని వీడి వైసీపీలో చేరతారనే వార్తలు కొన్ని రోజులుగా దుమారాన్ని రేపుతున్నాయి.  
 
 
సజ్జల రామకృష్ణారెడ్డి మధ్యవర్తిత్వంతో గంటా వైసీపీకి జంప్ అవుతారని ఒక వర్గం మీడియా తెగ ఊదరగొడుతోంది.  విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాసన్ లాంటి నేతలు అపోజ్ చేస్తున్నా గంటా వైసీపీ గూటికి చేరడం ఖాయమని కథనాలు వెలువడుతున్నాయి.  మరోవైపు గంటా పార్టీ మారడం ఖాయమే కానీ అది వైసీపీలోకి కాదని, భారతీయ జనతా పార్టీలోకి అని మరో వాదన వినిపిస్తోంది.  ఈ వాదనను వినిపించే వారు గంటా ఆ నిర్ణయం తీసుకోవదం వెనుకున్న బలమైన కారణాలను కూడా చెబుతున్నారు.  ప్రజెంట్ వేరు వేరుగా ఉన్న టీడీపీ, బీజేపీలు వచ్చే ఎన్నికల్లో కూటమిగా మారే అవకాశం లేకపోలేదు.  ఎందుకంటే ఒంటరిగా బరిలోకి దిగి వైసీని ఢీకొట్టగల సత్తా టీడీపీకి లేదు.  ఈ విషయం గత ఎన్నికల్లో సుస్పష్టంగా తేలిపోయింది.  అలాగే ఏపీలో కుదురుకోవాలనుకుంటున్న భాజపాకు కూడా సంస్థాగతంగా బలంగా ఉన్న మిత్ర పక్షం తోడు తప్పనిసరి. 
 
 
అందుకే ఇద్దరూ 2024 ఎన్నికలకు చేతులు కలుపుతారని రాజకీయ వర్గాల టాక్.  పైగా వైసీపీ పట్ల బీజేపీ ద్వంద వైఖరి చూస్తే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు తమ మాట చెల్లుబాటయ్యే పరిస్థితులు ఉన్న టీడీపీ వైపే కషాయ దళం మొగ్గుతుంది.  ఎటు చూసినా కూటమి అంటూ ఏర్పడితే ఆది బీజేపీ, టీడీపీ కూటమే అవుతుంది.  ఎలాగూ జనసేన ఇప్పటికే బీజేపీకి మిత్ర పక్షంగా మెలుగుతూనే ఉంది.  ఈ క్యాలుక్యులేషన్ వేసుకునే గంటా లాంటి లీడర్లు బీజేపీ వైపుకు వెళ్లే యోచనలో ఉన్నారు.  తక్షణ కర్తవ్యమైన స్వీయ రక్షలో భాగంగా ముందు వైసీపీ నుండి తమను రక్షించగల బీజేపీలోకి వెళ్లిపోవాలని ట్రై చేస్తున్నారు.  ఆ తర్వాత ఎలాగూ టీడీపీ, బీజేపీ కలిసిపోతాయి కాబట్టి తాము ఎన్నికల నాటికి టీడీపీ బరపరిచే అభ్యర్థులుగానే బరిలో ఉంటామని, అప్పుడు ఓటు బ్యాంకు కూడా పదిలమవుతుందనే విశ్లేషణలో ఉన్నారు.  
 
 
ఈ లెక్క అనుకున్నట్టే వర్కవుట్ అయితే పర్వాలేదు.  రిస్క్ చేసి పార్టీ మారినందుకు ఎన్నికల ప్రస్తుతం సేవ్ అవుతారు, ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థులుగా నెగ్గుకొచ్చే అవకాశాలను పొందగలరు.  అలా కాకుండా ఏవైనా తేడాలు జరిగి ఎన్నికల నాటికి టీడీపీ, బీజేపీలు కలవకపోతే పార్టీ మారే వారంతా బీజేపీ కార్డ్ మీదే పోటీ చేయాల్సి ఉంటుంది.  కానీ బీజేపీ జెండాతో గెలిచే అవకాశాలు తక్కువ.  పైన మోడీ ఎంత బలంగా ఉన్నా మన ప్రజలు ప్రాంతీయ పార్టీలపై చూపే ఆదరణ బీజేపీ మీద చూపరు.  అప్పుడు ఓటమే శరణ్యమవుతుంది.  అలాకాకుండా మళ్లీ టీడీపీలోకి జంప్ చేద్దామని అనుకుంటే టీడీపీ స్వాగతించినా జనం తిప్పికొట్టే అవకాశం ఉంది.  అసలు జనం కంటే ముందు అవసరానికి ఆదుకుంటే పబ్బం గడపుకుని హ్యాండ్ ఇస్తారా అని బీజేపీ ప్రతీకారం తీర్చుకునే ప్రమాదం కూడా ఉంటుంది.