యంగ్ టైగర్ ఎన్టీయార్ ప్రస్తుతం సినిమాల గురించి తప్ప రాజకీయాల గురించిన ఆలోచన చేయడంలేదు. కానీ, కొన్నాళ్ళ క్రితం ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. అప్పట్లోనే టీడీపీని, యంగ్ టైగర్ ఎన్టీయార్‌కి అప్పగించాలనే డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ఆ కారణంతోనే పార్టీ దరిదాపుల్లో ఎన్టీయార్ కనిపించకుండా చంద్రబాబు జాగ్రత్త పడ్డారు. తన కుమారుడు లోకేష్‌ని ప్రమోట్ చేసుకున్నారు. అలా టీడీపీకి చంద్రబాబే మరణ శాసనం రాసేశారన్నది టీడీపీని వీడుతోన్న చాలామంది నేతల ఆరోపణ. స్వర్గీయ ఎన్టీయార్ తనయుడు నందమూరి బాలకృష్ణని చూపిస్తూ, నందమూరి అభిమానుల్ని పార్టీతోనే వుండేలా చూసుకుంటున్నారు చంద్రబాబు. కానీ, బాలకృష్ణ వల్ల పార్టీకి అదనపు లాభం ఏమీ కలగడంలేదని ఇప్పుడు అదే నందమూరి అభిమానులు వాపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలాగైనా యంగ్ టైగర్ ఎన్టీయార్‌ని ఒప్పించి, రాజకీయంగా కీలక బాధ్యతల్ని పార్టీలో ఆయనకు అప్పగిస్తే, టీడీపీ బాగుపడుతుందని నందమూరి అభిమానులు టీడీపీ అధినేతపై ఒత్తిడి తీసుకొస్తున్నారట.
పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాభవానికి గురైన దరిమిలా, ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా, పార్టీని బతికించడం కష్టమే భావన తెలుగు తమ్ముళ్ళలో వ్యక్తమవుతోంది. పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణుల్ని నారా లోకేష్ సమాయత్తం చేయలేకపోయారు. బాలకృష్ణ సంగతి సరే సరి. అప్పుడప్పుడూ మాత్రమే బాలయ్య రాజకీయ తెరపై కన్పిస్తుంటారు.. ఆ తర్వాత చాలాకాలం రాజకీయాల్లో కనిపించరు. ఇదే టీడీపీకి ఇబ్బందికరంగా మారుతోంది. చంద్రబాబుని చూసి జనం ఓట్లేసే పరిస్థితి లేదని సాక్షాత్తూ తెలుగు తమ్ముళ్ళే ఆఫ్ ది రికార్డ్‌గా వాపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ అనుకూల మీడియా కూడా దాదాపు ఇదే అభిప్రాయానికి వచ్చేసింది. కానీ, చంద్రబాబు మాత్రం యంగ్ టైగర్ ఎన్టీయార్ విషయంలో ముందడుగు వేయలేకపోతున్నారు. లోకేష్ మీద ప్రేమ సరే.. టీడీపీ పట్ల బాధ్యత లేకపోతే ఎలా.? అని చంద్రబాబుని నందమూరి అభిమానులు ప్రశ్నిస్తున్న దరిమిలా, చంద్రబాబు ఇకనైనా కీలక నిర్ణయం తీసుకుంటారా.? అసలు ఎన్టీయార్, టీడీపీ పట్ల ఎలాంటి అభిప్రాయంతో వున్నారు.? వేచి చూడాల్సిందే.