టీడీపీ నేత అచ్చెన్నాయుడి అరెస్ట్: తెరవెనుక ఏం జరిగింది.?

TDP leader Achennaidu arrested

తెలుగుదేశం పార్టీ ఆంధ్రపదేశ్ శాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిని పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ మద్దతుదారుడైన కింజరాపు అప్పన్నని బెదిరించారన్నది అచ్చెన్నాయుడిపై మోపబడిన అభియోగం. అప్పన్న ఎవరో కాదు, అచ్చెన్నాయుడికి బంధువే. పంచాయితీ ఎన్నికల చిత్రమిది. నిమ్మాడ, అచ్చెన్నాయుడు స్వగ్రామం. ఆ స్వగ్రామంపై తన పట్టు నిలబెట్టుకునే క్రమంలో తన బంధువు అయిన అప్పన్న, వైసీపీ మద్దతుదారుడిగా బరిలోకి దిగకుండా వుండేందుకోసం అచ్చెన్నాయుడు, అప్పన్నతో ఫోన్ ద్వారా రాజీయత్నం చేశారు. అచ్చెన్న బుజ్జగింపులకు తలొగ్గని అప్పన్న, వైసీపీ మద్దతుదారులతో కలిసి నామినేషన్ వేశారు.

TDP leader Achennaidu arrested
TDP leader Achennaidu arrested

ఈ క్రమంలో కొంత గలాటా చోటు చేసుకుంది. స్వల్ప ఉద్రిక్త పరిస్థితులూ తలెత్తాయి. పొరుగు గ్రామాల నుంచి పెద్దయెత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు నిమ్మాడపై దాడికి వచ్చారన్నది టీడీపీ ఆరోపణ. వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ అనుచరులు ఇనుప రాడ్లు, క్రరలు తీసుకుని రావడం, వారిని అలా రావాల్సిందిగా దువ్వాడ ఆదేశించినట్లుగా ప్రచారం జరుగుతుండడం గమనార్హం. ‘ఇది ఆంధ్రపదేశ్ కాదు, బీహార్..’ అంటూ ఓ వీడియో దువ్వాడ అనుచరుల దౌర్జన్యానికి సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారంలో వుంది. మారణాయుధాలతో నిమ్మాడపైకి దండెత్తిన వైసీపీ నేతల్ని అరెస్ట్ చేయకుండా అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడమేంటని టీడీపీ ప్రశ్నిస్తోంది. కాగా, వైసీపీ ముఖ్య నేత.. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ రోజు నిమ్మాడలో పర్యటించనుండగా, ఈ రోజు ఉదయమే అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేయడం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. విజయసాయిరెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారా.? అన్న ప్రశ్న కూడా తెరపైకొస్తోంది.