జనసేనను పక్కకు తోసేస్తున్న టీడీపీ.! ఏం జరుగుతోందబ్బా.?

‘పొత్తుల విషయమై అవగాహన లేకుండా మాట్లాడొద్దు..’ అంటూ జనసేనాని ఇటీవల ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.. అదీ పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఏమీ లేవు గనుక, పొత్తుల రచ్చ అనవసరం. కానీ, ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అని పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దాదాపు ఏడాది క్రితం జనసేన చేసిన వ్యాఖ్యలతో మొదలైన కలకలం ఇప్పటికీ ఆగడంలేదు.

జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి ఆవశ్యకతను చెప్పకనే చెప్పాయన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. మొన్నటి ఢిల్లీ పర్యటనలో కూడా జనసేనాని, ‘వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్’ అని నినదించారు.

అయితే, అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీకి దగ్గరవడం ప్రారంభించింది. బీజేపీ – టీడీపీ మధ్య పొత్తుల విషయమై ప్రాథమిక చర్చలు కూడా రహస్యంగా జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఎక్కడా జనసేన ప్రస్తావన ఈ చర్చల వ్యవహారంలో కనిపించడంలేదట.

ఈ విషయమై జనసేనాని ఒకింత కలత చెందుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఓ వైపు, టీడీపీ – బీజేపీ ఇంకో వైపు.. జనసేన మరో వైపు అయితే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారతాయి.

‘మొత్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేసే సత్తా మాకుంది..’ అని జనసేన పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా, కింది స్థాయిలో ఆ పరిస్థితే లేదు. ఒకవేళ టీడీపీ గనుక తమను పక్కకు తోసి, బీజేపీతో కలిసిపోతే ఏం చేయాలన్నదానిపై జనసేన దగ్గర ‘ప్లాన్-బి’ లేకపోవడం ఆశ్చర్యకరమే.