నూతన సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతించాల్సిన వేళ స్విట్జర్లాండ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆల్పైన్ పర్వతాల మధ్య వెలుగుల నగరంగా పేరొందిన క్రాన్స్ మాంటానా స్కీ రిసార్ట్‌లోని ప్రముఖ బార్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించి 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెన్నో కుటుంబాలను కలవరపెట్టేలా వంద మందికి పైగా గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
స్విస్ పోలీసుల ప్రకారం, గురువారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో క్రాన్స్ మాంటానాలోని ‘లే కాన్‌స్టెల్లేషన్’ బార్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నూతన సంవత్సరం వేడుకలతో బార్ జనంతో కిక్కిరిసి ఉండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో లోపల ఉన్నవారిలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రమాద సమయంలో బార్‌లో 100 మందికి పైగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అగ్నిప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో పలువురు బయటకు రావడానికి వీలు లేకుండా చిక్కుకుపోయారని సమాచారం. మృతులు, గాయపడినవారిలో అధిక సంఖ్యలో విదేశీ పర్యాటకులు ఉండవచ్చని వాలిస్ కాంటన్ పోలీసు ప్రతినిధి గేటాన్ లాథియాన్ తెలిపారు. “ఇది అంతర్జాతీయంగా పేరొందిన స్కీ రిసార్ట్. ఇక్కడ ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉంది” అని ఆయన పేర్కొన్నారు.
ప్రమాదం సమాచారం అందగానే భారీగా అగ్నిమాపక బృందాలు, పోలీసు సిబ్బంది, వైద్య సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారిని హెలికాప్టర్ల ద్వారా సమీప ఆసుపత్రులకు తరలించారు. ఘటన తీవ్రత దృష్ట్యా ఆ ప్రాంతాన్ని పూర్తిగా మూసివేసి, క్రాన్స్ మాంటానాపై నో-ఫ్లై జోన్ అమలు చేశారు. బాధితుల కుటుంబసభ్యుల కోసం ప్రత్యేక హాట్‌లైన్‌ను కూడా అధికారులు ఏర్పాటు చేశారు.
సోషల్ మీడియాలో ఈ అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. బార్ నుంచి ఎగసిపడుతున్న మంటలు, పొగ దట్టంగా కమ్ముకున్న దృశ్యాలు చూసి నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, వేడుకల సమయంలో ఉపయోగించిన పైరోటెక్నిక్స్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక నిర్ధారణ జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ దుర్ఘటనతో స్విట్జర్లాండ్ అంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆనందోత్సవంగా మారాల్సిన నూతన సంవత్సర వేడుకలు క్షణాల్లోనే విషాదంగా మారడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలపై సమగ్ర విచారణ చేపడతామని స్విస్ అధికారులు తెలిపారు.
