జైలు నుంచి విడుదలైన నాగర్ కర్నూల్ స్వాతిరెడ్డి (వీడియో)

సంచలన కేసులో అరెస్టయిన స్వాతి రెడ్డి ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఆమె బయటి ప్రపంచంలోకి అడుగు పెట్టారు. ఆమెను తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు, బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో పోలీసు బందోబస్తు నడుమ మహబూబ్ నగర్ జిలా కేంద్రంలోని స్టేట్ హోంకు పోలీసులు తరలించారు. నాగర్ కర్నూల్ కు చెందిన స్వాతిని.. ప్రియుడు రాజేష్ తో కలిసి భర్త సుధాకర్ రెడ్డిని హత్య చేసిన కేసులో డిసెంబర్ 11  2017 న మహబూబ్ నగర్ జైలుకు తరలించారు. లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో బెయిల్ కు అప్లై చేయగా ఈ నెల 16న స్వాతికి బెయిల్ వచ్చింది. కానీ జమనాతు ఇచ్చి తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆమె విడుదల ఆలస్యం అయింది. మొత్తానికి నాగర్ కర్నూల్ కు చెందిన ఇద్దరు జమనాతు ఇచ్చేందుకు ముందుకు రావడంతో శుక్రవారం 5.15నిమిషాలకు స్వాతి జైలు నుంచి విడుదలయ్యారు. జైలులో ఇన్నాళ్లు చేసిన పనికి రూ.2700 లను అధికారులు స్వాతికి అందజేశారు. జైలు నుంచి విడుదలయ్యేటప్పుడు ఇన్నాళ్లు తనకు రక్షణ కల్పించిన జైలు బ్యారెక్ కు స్వాతి దండం పెట్టి బయటకు వచ్చింది. 

స్వాతి జైలు నుంచి విడుదలయ్యే ముందు న్యాయవాది, అధికారులు స్వాతికి కౌన్సిలింగ్ నిర్వహించారు. స్వాతికి కౌన్సిలింగ్ నిర్వహించే సమయంలో విపరీతంగా ఏడ్చిందని న్యాయవాది తెలిపారు. తన పిల్లలను తనకు అప్పగించాలని తనకు ఉపాధి చూపిస్తే తానేంటో నిరూపించుకుంటానని స్వాతి అధికారుల ముందు బోరుమని విలపించిందట. తనకు ఆశ్రయం, ఉపాధి చూపించాలని స్వాతి జైలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. దానిని లీగల్ సెల్ అథారిటికి పంపించనున్నట్టు జైలు అధికారుల ద్వారా తెలుస్తోంది.

[videopress HAXrsIWP]

స్వాతి విడుదల సందర్బంగా మీడియా పెద్దఎత్తున అక్కడకు చేరుకోగా ఆమె మాట్లాడేందుకు నిరాకరించారు. ముఖానికి స్కార్ప్ కట్టుకొని జైలు ఎస్కార్ట్ వాహనం ఎక్కి కూర్చున్నారు. స్వాతిని మాట్లాడాల్సిందిగా జర్నలిస్టులు కోరగా దండంపెట్టి తలదించుకొని ఏడ్చుకుంటూ కూర్చుంది. స్వాతిరెడ్డిని తీసుకెళ్లేందుకు ఎవరూ రాకపోవడంతో స్టేట్ హోంకు తరలించారు. మరి కొద్ది రోజుల్లో హైదరాబాద్ లోని స్వచ్చంధ సంస్థకు తరలించాలని అధికారులు భావిస్తున్నారు. ఇదే కేసులో అరెస్టయి జైలులో ఉన్న స్వాతి ప్రియుడు రాజేష్ కు ఇంకా బెయిల్ రాలేదు.

[videopress 7useQqoK]