మణిపూర్ ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్… వార్నింగ్ లాంటి వ్యాఖ్యలు!

మణిపూర్ రాజధాని ఇంఫాల్‌ కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్‌ పోక్పి జిల్లాలో ఒక దారుణ ఘటన జరిగింది. ఓ గ్రామంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించారని తెలుస్తుంది. అనంతరం వారిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు గిరిజన సంఘం ఆరోపించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మే 4న జరిగిందని తెలుస్తుంది.

ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరమ్ (ఐ.టీ.ఎల్‌.ఎఫ్‌.) చెబుతున్న వివరాల ప్రకారం… ఈ ఘటనకు ముందు లోయ ప్రాంతంలోని మెజార్టీ వర్గమైన మైతీ, కొండ ప్రాంతాల్లో నివసించే కుకీ వర్గం మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ సమయంలో కొంతమంది దుండగులు ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించారు. అనంతరం వారిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు!

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటనకు సంబంధించినఈ వీడియో వైరల్ అవుతుందని తెలుస్తుంది. దీంతో… ఈ వ్యవహారంపై సుప్రీకోర్టు సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇలాంటి వీడియోలు మనసుని కలచివేస్తాయని పేర్కొంది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది.

అవును… మహిళలను హింసకు సాధనాలుగా ఉపయోగించడం అంగీకరించలేని విషయం అని పేర్కొన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్.. వెంటనే కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంలో కేంద్రం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తే… తాము ఎంటరవుతామని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది!

దీంతో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. అయినా కూడా బీజేపీ ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుందని ఫైరవుతున్నారు. మే నెల 4 వ తేదీన జరిగిన ఈ ఘటనపై ఇప్పటివరకూ ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొకపోవడం క్షమించరాని నేరం అనే కామెంట్లు తెరపైకి వస్తున్నాయి.

మీడియాలో వార్తలొస్తే, సోషల్ మీడియాలో వైరల్ అయితే, కోర్టులు కల్పించుకుని మొట్టికాయలు వేస్తుంటే, ప్రతిపక్షాలు – ప్రజలు విరుచుకుపడుతుంటే… అప్పుడు కానీ ప్రభుత్వ పెద్దలకు సృహ రాదా అని పలువురు ఈ సందర్భంగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ బీజేపీ ప్రభుత్వం చేసింది క్షమించరాని నేరమనేది బలంగా వినిపిస్తున్న మాట.

ఇదే సమయంలో ఇలాంటి వీడియోలు వైరల్ అవ్వకుండా, సామాజిక మాధ్యమాల్లో కనిపించకుండా కూడా ప్రభుత్వం చర్యలు తీసికోలేకపోవడంపై కూడా సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారం చేస్తేనే అల్లాడిపోయిన బీజేపీ నేతలు… ఆ వీడియోలు ఎక్కడా కనపడకుండా చేశారు! మరి ఇద్దరు యువతులను నగ్నంగా ఊరేగిస్తే.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా షేర్ అవుతుంటే కేంద్రం ఏమి చేస్తున్నట్లు?

కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ సర్కార్, మణిపూర్ లో అధికారంలో ఉన్నది కూడా బీజేపీ ప్రభుత్వమే. అంటే మోడీ మాటల ప్రకారం… డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నమాట. మరి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఇలాంటి అసభ్యతకు, అనాగరికత విషయాలను ఎందుకు అరికట్టలేకపోతుంది. మసిపూసి మారెడు కాయ చేయాలని ప్రయత్నించిందా.. లేక, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలానే ఉంటుందని చెప్పబోతోందా?