తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చనీయాంశమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ మాజీ కార్యకర్త ఆశాప్రియ తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన చావుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కారణమని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ చేశారు.
తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టుగా ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. “నా చావుకు కారణం కేటీఆర్, పీజేఎంఆర్, హెచ్‌ఎస్. బీఆర్‌ఎస్ సోషల్ మీడియా తనను వేధింపులకు గురి చేస్తోందని” ఆమె పేర్కొన్నారు.
“కొన్ని గంటల్లో తన నుంచి ఎలాంటి పోస్ట్ రాకుంటే చనిపోయాననే అర్థం” అని చెబుతూ, వేధింపులకు సంబంధించిన ఆధారాలు అన్నీ తన వాట్సాప్ సెల్ఫ్ చాట్‌లో ఉన్నాయని, తనపై వేధింపులకు ఎవరు కారణం అనేది అక్కడ ఉంటుందని తెలిపారు. “ఇదే తన మరణ వాంగ్మూలం” అని పేర్కొంటూ, కేసు పెడితే బీఆర్‌ఎస్ పార్టీ హైకోర్టుకు వెళ్లి బెయిల్ తీసుకువస్తుందని, అందుకే తాను చనిపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
కేటీఆర్‌ను ప్రశ్నించిన ఆశాప్రియ:
ఆశాప్రియ తన పోస్ట్‌లో నేరుగా కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “కేటీఆర్ నువ్వు ఏం మనిషివి? నీ మనుషులు ఏం మాట్లాడుతున్నారు నా గురించి?” అని ప్రశ్నించారు. పార్టీలో ఉండే మహిళలతో కేటీఆర్‌కు సంబంధం ఉందని తన ఫోన్‌లో చెప్పారని ఆరోపించారు. మాట్లాడిన సాక్ష్యాలు బయటపెట్టాలా అని నిలదీశారు. తనపై వేధింపులకు పాల్పడుతున్న ‘పిల్ల జమిందార్’ను తెలిసి కూడా పక్కన పెట్టుకుని ఫోటోలు దిగుతున్నారంటే, కేటీఆరే ఎంకరేజ్ చేస్తున్నారని అర్థమంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

గతంలోనూ ఆత్మహత్యాయత్నం:
ఆశాప్రియ గతంలో బీఆర్‌ఎస్ కార్యకర్తగా పార్టీలో చురుకుగా ఉంటూ సోషల్ మీడియాలో మద్దతుగా పోస్టులు చేసేవారు. అయితే, ఒక నేత వేధింపుల కారణంగా పార్టీకి గుడ్‌బై చెప్పినట్టు తెలుస్తోంది. అంతకు ముందు కూడా ఆమె ఒక నేతను ఉద్దేశించి ‘పార్టీలో ఒక వెదవ ఉన్నాడు.. వాడికి తప్ప ఎవరికి సపోర్ట్ చేసినా అడ్డమైన లింకులు పెట్టి నరకం చూపిస్తాడు’ అంటూ ట్వీట్ చేశారు. కొద్ది రోజుల క్రితం కూడా ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ సమయంలో కూడా “కేటీఆర్ అన్న ఈ చెల్లెలు పిలుపు ఇదే చివరిసారి అవుతుంది.. ఒక్కసారి పలుకు అన్నా” అంటూ ఎక్స్ లో చివరి పోస్ట్ పెట్టారు.
తాజాగా ఆమె చేసిన ఈ సంచలన పోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై బీఆర్‌ఎస్ వర్గాలు గానీ, కేటీఆర్ తరపు నుంచి గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

