ఏ విషయంలో అయినా కీలక వ్యాఖ్యలు చేయడం, లాజికల్ గా మాట్లాడటం.. విమర్శించాల్సి వస్తే తమ పర తారతమ్యాలు చూడకపోవడం వంటివి మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి స్పెషాలిటీ అని అంటుంటారు పరిశీలకులు. ఇందులో భాగంగా… చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును… చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మండిపడ్డారు. దేశంలోని ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ప్రముఖమైనదైన తిరుమల తిరుపతి దేవాలయం (టీటీడీ)పై బాబు, పవన్ కల్యాణ్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అక్రమాలు జరుగుతున్నాయని బాబు, పవన్ ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా.. తిరుమలలో అన్యమత ప్రచారం జరగడం లేదని చెప్పిన సుబ్రహ్మణ్యస్వామి… చంద్రబాబు ఎప్పుడూ హిందువులకు ఏమీ చేయలేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇదే సమయంలో సొంత మామకు గౌరవం ఇవ్వని వాడు హిందువులకు ఎలా గౌరవం ఇస్తాడని సుబ్రహ్మణ్యస్వామి తనదైన శైలిలో ప్రశ్నించారు.
ఇదే సమయంలో… చంద్రబాబు హిందూ దేవాలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా రాజకీయాలు చేసుకోవాలని హితవు పలికిన సుబ్రహ్మణ్య స్వామి… హిందూ దేవాలయాలను కించపరిస్తే సహించేది లేదని అన్నారు. అదేవిధంగా… ప్రజా క్షేత్రంలో పోరాడలేకే చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్న ఆయన… వాస్తవానికి కాగ్ ద్వారా ఆడిట్ కు టీటీడీ స్వచ్ఛందంగా ముందుకొచ్చిందని గుర్తుచేశారు!