కర్ణాటక ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం సినిమా రంగంలో పెద్ద చర్చకు దారితీసింది. రాష్ట్ర బడ్జెట్‌లో భాగంగా, సినిమా టికెట్ ధరలను గరిష్టంగా రూ.200కి పరిమితం చేస్తూ ప్రతిపాదనను ఆమోదించింది. ఈ కొత్త నిబంధన సింగిల్ స్క్రీన్ థియేటర్లకే కాకుండా మల్టీప్లెక్సులకు కూడా వర్తించనుండటంతో, సినిమా రంగంలో కలకలం రేపుతోంది. పాన్ ఇండియా సినిమాల ప్రదర్శన సమయంలో బెంగళూరులో కొన్ని మల్టీప్లెక్సులు టికెట్ ధరలను రూ.600 వరకు పెంచిన ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల పెద్ద సినిమాలకు కలెక్షన్ల పరంగా కొత్త సమస్యలు తలెత్తే అవకాశముంది.
ఈ నిర్ణయం వెనుక మరొక రాజకీయ కోణం కూడా ఉందని భావిస్తున్నారు. ఇటీవల బెంగళూరులో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కి కన్నడ సినిమా ప్రముఖులు పెద్దగా హాజరుకాకపోవడం ప్రభుత్వం అసంతృప్తిని కలిగించింది. దీంతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ వ్యవహారంపై అసహనం వ్యక్తం చేస్తూ, మార్పు రాకపోతే తగిన చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ కొత్త టికెట్ నిబంధన మూడు రోజుల్లోనే అమల్లోకి రావడం కేవలం సరైన సమయస్ఫూర్తా మాత్రమేనా? లేక సినీ ఇండస్ట్రీపై ఒత్తిడి తేవడానికా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కన్నడ ఇండస్ట్రీలో ఇప్పటికే చిన్న సినిమాలకు ఇది అంత ప్రభావం చూపకపోయినా, భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రం భారీ నష్టం జరుగుతుందనే వాదన వినిపిస్తోంది. కేజీఎఫ్, కాంతారా లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాయి. కానీ ఇప్పుడు రూ.200 పరిమితితో, థియేటర్ వసూళ్లు పడిపోవచ్చని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల థియేటర్ యాజమాన్యాలు తీవ్రంగా ప్రభావితమవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఏడాది కన్నడలోనే 100కు పైగా థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పుడు మరికొన్ని థియేటర్లు మూసివేసి షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్స్‌గా మారిపోయే అవకాశం ఉందని ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


