Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు కాంగ్రెస్ నేతల ఎలివేషన్స్

ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగుల హడావిడికి చెక్ పెట్టే పనిలో అడుగులు వేసిన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా మరో ముఖ్యమైన కార్యాన్ని పూర్తిచేశారు. ఏడాది క్రితమే కర్ణాటక ప్రభుత్వాన్ని సంప్రదించి, కుంకీ ఏనుగుల అవసరాన్ని తెలియజేసిన పవన్.. ఇప్పుడు వాటిని రాష్ట్రానికి తీసుకురావడంలో విజయం సాధించారు. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన్ను స్వయంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మర్యాదపూర్వకంగా ఆహ్వానించటం విశేషం.

విధాన సౌధలో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పవన్ కల్యాణ్‌కు కాంగ్రెస్ అధినేతలు ఘన స్వాగతం అందిస్తూ మంత్రి స్థాయిలో ఏర్పాట్లు చేసిన తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమంలో పవన్‌కు కుంకీ ఏనుగుల అప్పగింత పత్రాలను అధికారికంగా అందజేయడం, వాటిని ఓ బ్రీఫ్‌కేసులో పెట్టి మరీ ఇవ్వడం, ఇద్దరు ముఖ్య నేతలు ఆయన్ను మధ్య కూర్చోబెట్టి గౌరవించడంలాంటి దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

కేవలం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాయకుడైనప్పటికీ, ఓ సహజీవన సమస్యపై కర్ణాటకతో సమన్వయం సాధించటం, అధికారులను నడిపించటం ద్వారా పవన్ తన పరిపాలనా శైలిని చూపించారు. ఈ కుంకీ ఏనుగులు రాష్ట్రంలో ఏనుగుల దాడులకు చెక్ పెట్టేలా పనిచేయనున్నాయి. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో వీటి కోసం ప్రత్యేకంగా స్థలాన్ని సిద్ధం చేశారు. త్వరలోనే బెంగళూరులో నుంచి వాటిని అక్కడకు తరలించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా చొరవ తీసుకుని, రాజకీయ హద్దులకుపైగా వ్యవహరించటం ఒక మానవతా కోణాన్ని చూపించిందని అంటున్నారు విశ్లేషకులు.