ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే 100 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించినప్పటికీ… ఆపరేషన్ ఆకర్షన్ ను ఆపడం లేదు. అటు బీఆరెస్స్, ఇటు బీజేపీ అనే తారతమ్యాలేమీ లేకుండా.. ఆ రెండు పార్టీలలోని కీలక నేతలకు చెయ్యి ఊపుతుంది.. ఫలితంగా కండువా కప్పేస్తుంది. ఈ క్రమంలో తాజాగా బీజేపీ నేత ఎంపీ వివేక్ తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.
తెలంగాణలో అధికార బీఆరెస్స్ కు తామే ప్రత్యామ్నాయం అని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతుంది. ఇప్పటికే 100 మంది అభ్యర్థులను రెండు విడతలుగా ప్రకటించిన కాంగ్రెస్… అప్పటికే ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. ఈ క్రమంలో ఇప్పటికే రాహుల్ గాంధీతో ప్రచారాలు హోరెత్తిస్తున్న వేళ.. కర్ణాటక డిప్యుటీ సీఎం డీకే శివకుమార్ ని కూడా ఎంటర్ చేసింది. ఆయన కూడా అధికార బీఆరెస్స్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతూ… కర్ణాటక మోడల్ తెలంగాణలో కూడా తెస్తామని చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏ ఒక్క అవకాశం వదులుకొనేందుకు సిద్ధంగా లేనట్లు కనిపిస్తున్న కాంగ్రెస్… .ఇతర పార్టీల నుంచే వచ్చే కీలక నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. గతంలో కాంగ్రెస్ లో పని చేసి పార్టీ వీడిన నేతలను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. ఈ నేపథ్యంలో… కాంగ్రెస్ నుంచి ఎంపీగా వ్యవహరించి.. తదనంతర పరిణామాల్లో బీజేపీలో చేరిన వివేక్ వెంకట స్వామితో టీపీసీసీ చీఫ్ రేవంత్ సమావేశం అయ్యారు.
ఈ భేటీలో… కాంగ్రెస్ లోకి తిరిగి రావాలని, పార్టీలో ఖశ్చితంగా ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్దుల జాబితా దాదాపుగా పూర్తి అయిన నేపథ్యంలో.. కాంగ్రెస్ నుంచి కోరుకున్న చోట ఎంపీగా వివేక్ పోటీ చేయాలని రేవంత్ కోరినట్లు తెలుస్తుంది.
కాగా… కొద్ది రోజుల క్రితం బీజేపీ నుంచి తెలంగాణ కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు పలువురు బీఆరెస్స్ నేతలు సైతం కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఈ సమయంలో ఆయనకు మునుగోడు సీటు ఖాయం చేసారు. ఇలా మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వివేక్ కూడా కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. మరి ఈ ముహూర్తం ఎప్పుడు ఫిక్సవుతుందనేది వేచి చూడాలి!