స్వర్గీయ ఎన్టీయార్ మహానుభావుడే.! ఆయన స్థాయి తగ్గిస్తారెందుకు.?

Sr NTR

స్వర్గీయ నందమూరి తారకరామారావు అంటే, మహానుభావుడే.. చాలామంది చెబుతున్నట్లు మహనీయుడే. కానీ, ఆయనేమీ దేవుడు కాదు, రాముడు అసలే కాదు.! సినీ రంగంలో తిరుగులేని పేరు ప్రఖ్యాతులు సంపాదించారాయన. రాజకీయ రంగంలోనూ తిరుగులేని రికార్డులు ఆయన పేరుతో వున్నాయి. తెలుగు నాట పార్టీ పెట్టి అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.

అదే సమయంలో, స్వర్గీయ ఎన్టీయార్ ఏకంగా రెండు సార్లు వెన్నుపోటుకు గురయ్యారు. ఆయన రెండు సార్లు పెళ్ళి చేసుకున్నారు.. లేటు వయసులో లక్ష్మీపార్వతిని పెళ్ళాడటం ఓ వివాదం. ఆయన మరణం ఇప్పటికీ ఓ మిస్టరీనే. జీవిత చరమాంకంలో ఆయన నరకాన్ని చవిచూశారు శారీరకంగా, మానసికంగా. చెప్పుకుంటూ పోతే కథ చాలా పెద్దదే.

అప్పట్లో ఆయన అలా మానసికంగా కృంగి కృశించిపోవడానికి కారణమైనవారే, ఇప్పుడాయన విగ్రహాలకు పూల దండలు వేసి, నివాళులర్పించేస్తున్నారు. అప్పట్లో ‘నో ఎన్టీయార్’ అన్నవాళ్ళే, ఇప్పుడు ‘జై ఎన్టీయార్’ అంటున్నారు. తెలుగు నేలపై స్వర్గీయ ఎన్టీయార్ ఓ విశిష్టమైన వ్యక్తి అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు.

కానీ, తెలుగు జాతి ఆత్మగౌరవం ఎన్టీయార్.. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీయార్.. అంటూ అతిశయోక్తుల వదలడమే చాలా చాలా అతిగా వుంది.

మీడియా సైతం ఈ బాకా ఊదుతుండడం ఇంకా బాధాకరం.
జయంతికో, వర్ధంతికో.. జై ఎన్టీయార్.. అనేసి, ఎన్టీయార్‌కి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ చేసే బ్యాచ్‌కి నిజంగా ఎన్టీయార్ మీద మమకారం వుందా.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే.