బ‌యోపిక్‌ల‌ను ఎన్నికల కోణంలో చూడొచ్చా? – పార్ట్ 3

`ఎన్టీఆర్` తరువాత ఆ స్థాయిలో జనాన్ని ఆకట్టుకునే మరో బయోపిక్ `యాత్ర`. ఫస్ట్ లుక్ నుంచే ఈ మూవీ ఆసక్తి కలిగించింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం పాదయాత్ర. దీన్ని ప్రధాన కథాంశంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా మొత్తం ఈ ఘట్టం చుట్టే తిరుగుతుంది. పాదయాత్ర మొదలుకుని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో సినిమా ముగుస్తుందనేది టాక్.

ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిది ఓ ప్రత్యేక పర్వం. సంప్రదాయ రాజకీయాలను ఆయన పక్కన పెట్టారు. జనంలోకి చొచ్చుకెళ్లగలిగారు. ప్రతి వ్యక్తీ.. వైఎస్‌న్ తమ సొంత ఇంటి మనిషిగా భావించేలా తనను తాను మార్చుకోగలిగారు. అదే తరహాలో పాలించారు. ఆయన జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం. ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకూ 1475 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు..ఇలా దాదాపు అన్ని వర్గాల ప్రజలనూ ప్రత్యక్షంగా కలుసుకోగలిగారు.

రాష్ట్ర కాంగ్రెస్‌లో వైఎస్‌కు ఫైర్‌బ్రాండ్ అనే ముద్ర ఉండేది. పాదయాత్ర తరువాత ఆయన ఆ అపవాదును పోగొట్టుకున్నారు. కోపం అనే నరం తెగిపోయిందని వైఎస్ పలుమార్లు నిండు అసెంబ్లీలోనూ ప్రకటించారు. గ్రామస్థాయిలో సామాన్య జనం పడుతోన్న బాధలను తెలుసుకోవడానికి, వాటిని శాశ్వతంగా పరిష్కరించడానికి పాదయాత్ర ఉపయోగపడిందని అనేవారు.

అప్పటిదాకా పాదయాత్రలంటే ఏ ఒక్క నియోజకవర్గానికే పరిమితం. అలాంటిది ఓ రాజకీయ నాయకుడు ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం చారిత్రాత్మకం. సామాన్య ప్రజలను నివ్వెర పరిచేలా చేసింది. 80వ దశకం ఆరంభంలో బస్సు యాత్ర ద్వారా ఎన్టీఆర్‌ను చూసిన సామాన్య జనం.. ఆయన తరువాత పాదయాత్ర ద్వారా వైఎస్‌ను చూశారు. సినీ పరిభాషలో చెప్పాలంటే పాదయాత్ర ట్రెండ్ సృష్టించింది. వైఎస్‌కు ముందు తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి అధికారాన్ని చేపట్టడానికి పాదయాత్ర చేయాల్సి వచ్చిందంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

పాదయాత్రను ఆరంభించే నాటికి ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అప్పుడూ అదే స్థానంలో ఉన్నారు. రాష్ట్రం కరవు కోరల్లో చిక్కుకుని ఉన్న రోజులవి. పంట చేతికి అందక రైతులు కునారిల్లుతున్న దశ అది. ప్రతి రోజూ రైతుల ఆత్మహత్య ఘటనలు చోటు చేసుకునేవి. తిన్నది అరక్క రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని అప్పటి ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యానాలు చేశారు. విద్యుత్ బకాయిలను చెల్లించకపోవడం వల్ల అధికారులు రైతుల రెక్కలు పట్టుకుని, ఈడ్చుకెళ్లి లాకప్పుల్లో వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.

ఏటేటా విద్యుత్ ఛార్జీలను పెంచుతూ వెళ్లింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపు దీనికి అదనం. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ప్రజల తరఫున అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్, వామపక్షాలు డిమాండ్ చేస్తే.. ఈ ఏడాది పెంచకపోతే- తగ్గించినట్టే అంటూ ఎద్దేవా చేశారు నాటి ముఖ్యమంత్రి. అలాంటి దారుణ పరిస్థితుల్లో వైఎస్ `ప్రజా ప్రస్థానం` పేరుతో పాదయాత్ర చేపట్టారు. మండు వేసవిలో కొనసాగిందా యాత్ర. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నుంచి ఉత్తరాంధ్ర దాకా ప్రజల కష్ట, నష్టాలను కళ్లారా చూస్తూ పాదయాత్ర సాగించారు వైఎస్. అమలు చేయదగ్గ హామీలను ఇచ్చారు. ఆ మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చారు.

పాదయాత్ర చేయకుండా వైఎస్ ముఖ్యమంత్రి అయివుంటే.. సక్సెస్ అయ్యే వారు కాదని, వరుసగా రెండోసారి అధికారంలో వచ్చి ఉండేవారు కాదని అనిపించేంతగా ఆయనలో మార్పును తీసుకొచ్చింది. ఆ మార్పు ఫలితం ఎలా ఉందనేది మనకు తెలిసిన విషయమే. ఎన్నికల మేనిఫెస్టోలోనూ పొందుపరచని అనేక హామీలను అమలు చేయగలిగారు వైఎస్. ఆయన పరిపాలనలో ప్రతి కుటుంబమూ ఏదో ఒక లబ్దిని పొందిందని అంటారు.

ఫీజు రీఎంబ‌ర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ, 108, 104, ఉచిత విద్యుత్, పారిశ్రామికవేత్తలకు కూడా విద్యుత్ టారిఫ్‌లో నాలుగు శాతం రాయితీ.. ఇలా ఓ బెంచ్‌మార్క్‌ను సృష్టించారు. ఫీజు రీఎంబర్స్మెంట్ అందుకుంటున్న ఓ విద్యార్థి కుటుంబం తెలుగుదేశానికి మద్దతు ఇస్తోందనో, లేక ఉచిత విద్యుత్ లబ్దిని పొందుతున్న ఓ రైతు టీడీపి మద్దతు దారుడనో చూడలేదు. ఆరోగ్యశ్రీని వినియోగించుకుంటున్న ఓ రోగి తన రాజకీయ ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తి అనో చూడలేదు. అందర్నీ సమదృష్టితో చూశాయి వైఎస్ రూపొందించిన సంక్షేమ పథకాలు.

తన తదనంతరం వచ్చిన ఏ ముఖ్యమంత్రి అయినా ఆయా పథకాలను అమలు చేసి తీరాల్సిందే అనేలా చేశారు. ఇప్పుడు దేశంలోని 29 రాష్ట్రాల్లో 108 సర్వీసులు అందుబాటులోకి ఉన్నాయంటే అది వైఎస్ దూరదృష్టే. అటు తెలంగాణలోనూ, ఇటు విభజిత ఏపీలోనూ వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలకు తెలుగుదేశం ప్రభుత్వం పేర్లను మార్చిందే తప్ప వాటిని యధాతథంగా అమలు చేస్తోంది. ఆ అమలు తీరుతెన్నుల్లో తేడాలు ఉన్నాయి. చాలామటుకు పేరుకు మాత్రమే అమల్లో ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాంటి పథకాలకు బీజం వేసింది పాదయాత్రే.

రాష్ట్రం దశ-దిశను మార్చి వేసేలా చేసిన వైఎస్ పాదయాత్రను కథాంశంగా చేసుకుని తెరకెక్కించిన ఈ మూవీలో మలయాళ సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి నటించారు. స్వాతికిరణం వంటి కొన్ని స్ట్రెయిట్ సినిమాలతో పాటు డబ్బింగ్ చిత్రాలతో మమ్మూట్టి తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితుడే. బయోపిక్‌ల‌ల్లో నటించడం ఆయనకు కొత్తేమీ కాదు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బయోపిక్‌లో టైటిల్ పాత్రను పోషించారు. దీనికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నారు. వైఎస్‌లోని హుందాతనం, రాజ‌సం ఉట్టిపడేలా మమ్మూట్టి నటించారని అంటున్నారు అభిమానులు.

ఎన్నికల సమయంలో విడుదల కాబోతున్న ఈ మూవీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పార్టీ కార్యకర్తలు, అభిమానుల్లో ఓ ఊపు తీసుకొస్తోంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్.. సినిమా స్థాయి ఏమిటో వెల్లడించింది. ఓ రకంగా ఇది వైఎస్ఆర్ సీపీకి రాజకీయంగా మేలు చేసే విషయమే అవుతుంది. దీనికితోడు- వైఎస్ తనయుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా తండ్రి నడిచిన కిలోమీటర్లకు రెట్టింపు నడిచారు. ప్రజా సంకల్ప యాత్రను దిగ్విజయంగా ముగించారు.

ఈ పరిస్థితుల్లో వైఎస్ బయోపిక్ విడుదల కావడం పార్టీకి బలాన్ని ఇచ్చేదే అవుతుంది. తెరిచిన పుస్తకం వంటి పాదయాత్ర ఘట్టంలో దాచడానికేమీ లేదు. అందుకే- ఎలాంటి భయాలకు పోకుండా యధాతథంగా తీశారు. మార్పులు చేయలేదు. ఈ మూవీ వచ్చేనెల 8న విడుదల కాబోతోంది. ఎన్టీఆర్ బయోపిక్, వైఎస్ఆర్ బయోపిక్‌కు ఉన్న తేడా అదే. ఎన్టీఆర్ బయోపిక్‌ను ఉన్నది ఉన్నట్లు తెరకెక్కిస్తే.. ప్రభుత్వాలే కూలుతాయి.