సోమనాథ్ ఛటర్జీ కి అంత్యక్రియలు లేవు, మరణం తర్వాత కూడా ప్రజల కోసం…

అవును మీరు చదివింది నిజమే. సోమనాథ్ ఛటర్జీ జాతీయ రాజకీయాల్లో పేరొందిన కమ్యూనిస్టు నాయకుడు. ఆయన ప్రతిక్షణం ప్రజల కోసమే పనిచేసిన మనిషి. కమ్యూనిస్టుగా తన జీవితం మొదలైన నాటినుంచి మరణించే వరకు సోమనాథ్ ఛటర్జీ ప్రజల కోసం తపించారు. ప్రజల కోసమే పనిచేశారు. అంతేకాదు ఆయన చనిపోయిన తర్వాత కూడా ప్రజల కోసమే పనిచేయనున్నారు. అదేంటి? చనిపోయిన తర్వాత ఆయన ప్రజలకేం ఉపయోగపడతారని అనుకుంటున్నారా? చాలా ఉపయోగపడతారు. స్టోరీ చదవండి.

లోక్ సభ మాజీ స్పీకర్, సిపిఎం కురు వృద్ధుడు సోమనాథ్ ఛటర్జీ సోమవారం మరణించిన విషయం తెలిసిందే. సాధారణంగా ఎవరైనా చనిపోతే 24 గంటల్లో అంత్యక్రియలు చేస్తారు. ఒకవేళ బంధువులు, ముఖ్యమైన వారు విదేశాల్లో ఉంటే కనుక 48 గంటల్లో అంత్యక్రియలు పూర్తి చేస్తారు. కానీ సోమనాథ్ చటర్జీకి మాత్రం అంత్యక్రియలు లేవు. ఆయన పార్దీవ దేహానికి అంత్యక్రియలు చేయరు. కాల్చి బూడిద చేయడం, పార్దీవ దేహాన్ని తీసుకుపోయి బొండపెట్టడం లాంటివి చేయరు.

దానికి కారణం ఉంది. ఆయన బతికి ఉన్నప్పుడే అవయవ దానం చేసిన గొప్ప మనిషి. బతికి ఉన్నన్ని రోజులు ఎట్లైతే ప్రజలకు సేవ చేశానో.. చనిపోయిన తర్వాత కూడా నా శరీరంలోని ఆర్గాన్స్ ప్రజా సేవకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఆయన అవయవదానం చేశారు. అందుకే ఆయన పార్దీవ దేహాన్ని స్మశాన వాటికకు కాకుండా వైద్య పరిశోధనల కోసం అప్పగించనున్నారు. కోల్ కతా లోని ఎస్.ఎస్.కె.ఎం ఆసుపత్రికి ఆయన పార్దీవ దేహాన్ని అప్పగించనున్నారు. దేశంలో చాలా మంది కమ్యూనిస్టు నేతల బతికి ఉన్న రోజుల్లోనే అవయవదానం చేసిన దాఖలాలున్నాయి.

జ్యోతి బసు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి

మెడికల్ రీసెర్చ్ కోసం సోమనాథ్ లాంటి కమ్యూనిస్టు నేతలు అవయవదానం చేశారని, ఇప్పుడు కూడా చాలా మంది చేస్తున్నరని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి వెల్లడించారు.  సోమనాథ్ ఛటర్జీ పార్దీవ దేహాన్ని ఆసుపత్రి వారికి అప్పగించే ముందు ప్రజల సందర్శనారర్థం కోసం పార్టీ ఆఫీసులో ఉంచుతామని చెప్పారు. పార్టీ నేతలు, ప్రజలంతా అక్కడే నివాళులు అర్పిస్తామన్నారు. తర్వాత సోమనాథ్ ఛటర్జీ పార్దీవ దేహాన్ని బెంగాల్ అసెంబ్లీకి తరలిస్తారని అన్నారు. సోమనాథ్ కుటుంబసభ్యులతో చర్చించిన తర్వాతే తుది కార్యక్రమాలను వెల్లడిస్తామని ఏచూరి మీడియాకు చెప్పారు.

బతికి ఉన్నన్ని రోజులు భూకబ్జాలు చేస్తూ, మోసాలకు పాల్పడుతూ, మర్డర్లు, మానభంగాలు చేస్తూ జనాలను పీక్కుతింటున్న రాజకీయ నాయకులు ఎంతో మంది ఉన్న ఈ రోజుల్లో చనిపోయిన తర్వాత కూడా జనాలకు సేవ చేయాలన్న తపన ఉన్న సోమనాథ్ ఛటర్జీ లాంటి కమ్యూనిస్టు నేతలు ఉండడం నిజంగా గొప్ప విషయమే అంటున్నారు.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రెండున్నర దశాబ్దాల పాటు ఏక ధాటిగా ముఖ్యమంత్రిగా పనిచేసిన జ్యోతిబసు కూడా అవయవదానం చేసిన నాయకుడే. ఆయన మరణించిన సమయంలో కూడా ఆయన పార్దీవ దేహానికి అంత్యక్రియలు చేయలేదు. మెడికల్ రీసెర్చ్ కోసం ఆయన మృతదేహాన్ని ఆసుపత్రికి అప్పగించారు. ఇలా అవయవ దానం చేసిన కమ్యూనిస్టు నేతలు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మందే కనిపిస్తారు. 

తెలుగు రాష్ట్రాల్లో చూస్తే బిఎస్ఎన్ ఎల్ ట్రేడ్ యూనియన్ నాయకుడు నాగమణ్యం కూడా అవయవదానం చేశారు. మరణించిన తర్వాత అంత్యక్రియలు లేవు. సీనియర్ జర్నలిస్టు హన్మంతరావు లాంటి వాళ్లు కూడా ఉన్నారు.