బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య ఏదో కెమిస్ట్రీ నడుస్తోంది. గ్రేటర్ ఎన్నికల తర్వాత ఈ కెమిస్ట్రీ మరింత బలపడింది. ఏదో సరదాకి, గ్రేటర్ ఎన్నికల వేళ ఓ పార్టీపై ఇంకో పార్టీ గుస్సా అయ్యిందిగానీ.. నిజానికి, తెరవెనుక వ్యవహారం వేరే వుంది. ఆ ‘దోస్తీ’ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఓ వైపు మజ్లిస్ పార్టీ, ఇంకో పక్క భారతీయ జనతా పార్టీ.. ఈ రెండిటితో టీఆర్‌ఎస్ చిత్ర విచిత్రమైన రాజకీయ ప్రయాణం చేస్తోంది. జాతీయ స్థాయిలో చక్రం తిప్పేస్తానంటూ గ్రేటర్ ఎన్నికల వేళ నినదించిన కేసీఆర్, ఎన్నికల ఫలితాలొచ్చాక, ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి వెళ్ళి, ప్రధాని మోడీ సహా కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసొచ్చారు. ఆ తర్వాత అనూహ్యంగా టీఆర్‌ఎస్ నేతలు, బీజేపీపై విమర్శలు చేయడం మానేశారు.
అక్కడ దోస్తీ, ఇక్కడ పొలిటికల్ కుస్తీ
బీజేపీ – టీఆర్‌ఎస్ మధ్య ‘కుస్తీ’ కేవలం తెలంగాణకే పరిమితం. ఢిల్లీ స్థాయిలో మేటర్ వేరేలా వుంటోంది. అక్కడంతా స్నేహమే.. బీజేపీతో టీఆర్‌ఎస్‌కి ఢిల్లీ స్థాయిలో వైరమే కనిపించడంలేదు. ఇంకో చిత్రమైన విషయమేంటంటే, టీఆర్‌ఎస్‌కి దూరం నుంచి మద్దతిస్తోన్న మిత్రపక్షం మజ్లిస్ పార్టీకి మామూలుగా అయితే, బీజేపీ అంటే అస్సలు గిట్టదు. కానీ, ఆ బీజేపీతో మజ్లిస్ కూడా తెరవెనుక దోస్తీ చేస్తున్నట్లే కనిపిస్తోంది.
బెంగాల్ మమత ‘లీక్’ చేసిన మేటర్ అదే.!
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీకీ, హైద్రాబాద్‌కీ వున్న లింకుని బయటపెట్టేశారు. ‘హైద్రాబాదీ పార్టీ వస్తోంది.. ముస్లిం ఓట్లను చీల్చడానికి.. బీజేపీకి ఆ హైద్రాబాదీ పార్టీ లాభం చేకూర్చబోతోంది..’ అంటూ మమత చేసిన సంచలన వ్యాఖ్యలతో టీఆర్‌ఎస్ కూడా ఉలిక్కిపడింది. మమత దృష్టిలో హైద్రాబాదీ పార్టీ అంటే మజ్లిస్ అనే. ఒకప్పుడు మమతా బెనర్జీతో కేసీఆర్‌కి రాజకీయంగా సన్నిహిత సంబంధాలున్నాయి. మమతా బెనర్జీతో కలిసి, బీజేపీ వ్యతిరేక కూటమి తయారు చేయాలనుకున్నారు కేసీఆర్. కానీ, బీజేపీ అవసరాల కోసం తమ మిత్రపక్షమైన మజ్లిస్‌ని, పశ్చిమబెంగాల్‌కి కేసీఆర్ స్వయంగా పంపుతున్నారన్న విమర్శలున్నాయి.
రాజకీయాల్లో ఇవన్నీ మామూలే.!
రాజకీయాలన్నాక ఎత్తులు, పై యెత్తులు మామూలే. పశ్చిమబెంగాల్ ఎన్నికల్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మమతను ఓడించడమే బీజేపీ లక్ష్యం. ఈ క్రమంలో ఎవరి సహాయం అయినా తీసుకోవడానికి బీజేపీ వెనుకంజ వేయదు. అయితే, పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీని ఢీ కొట్టడం బీజేపీకి అంత వీజీ కాదు.