గ్రేటర్ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకీ ఆ పార్టీ మిత్రపక్షమైన జనసేనకీ మధ్య ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాజకీయాల్లో పొత్తులు సహజం. బీజేపీ – జనసేన మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పొత్తు నడుస్తోంది. ఆ పొత్తు, తెలంగాణలోనూ కొనసాగుతున్నప్పటికీ, దాన్ని కొందరు తెలంగాణ బీజేపీ నాయకులు అంగీకరించడంలేదు. అధిష్టానం స్థాయిలో పొత్తుల చర్చలు జరుగుతోంటే, కింది స్థాయి నాయకులు ఆ పొత్తుని చెడగొడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జనసేనాని, బీజేపీ అధిష్టానంతో అమీ తుమీ తేల్చుకోవాల్సి వుంటుంది. కానీ, అలా వెళ్ళిన జనసేనానికి ఢిల్లీ పెద్దల నుంచి తగిన గౌరవం లభించలేదన్నది నిర్వివాదాంశం. అయితే, కిషన్‌రెడ్డి సహా కొందరు బీజేపీ సీనియర్లు మాత్రం, పవన్ వల్ల వచ్చే రాజకీయ లాభం గురించి ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేనతో స్నేహాన్ని కోరుకుంటున్నారు. అయితే, బీజేపీలో బండి సంజయ్, అరవింద్ వర్గం మాత్రం జనసేనని పట్టించుకోవడంలేదు. ఈ ఇద్దరిలో బండి సంజయ్ వ్యవహారం ఇంకాస్త ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. ఎందుకంటే, జనసేన అధినేత పవన్‌తో బండి సంజయ్‌కి నిన్న మొన్నటిదాకా సన్నిహిత సంబంధాలున్నా, ఆయనెందుకో ఇప్పుడు ఆ స్నేహాన్ని కొనసాగించేందుకు సుముఖంగా కనిపించడంలేదు.
సేనాని తీరు పట్ల సైనికుల్లో ఆవేదన
అధినేత రాజకీయ వ్యూహాల్ని పార్టీలో కింది స్థాయి నేతలు, కార్యకర్తలు కూడా అర్థం చేసుకోగలగాలి. నిజానికి, అధినేత ఏం చేసినా, జనసైనికులు అర్థం చేసుకునే పరిస్థితి వుంది. కానీ, ఎందుకో బీజేపీ విషయంలో అధినేత పవన్‌కి వున్న స్పష్టత జనసైనికుల్లో కొరవడుతోంది. దానిక్కారణం జనసేన కాదు, బీజేపీనే. బీజేపీ గందరగోళ ప్రకటనలతో జనసేన క్యాడర్ ఆందోళన చెందుతోంది. జనసైనికులు, బీజేపీ నేతల వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అయోమయంలో పడుతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేసి వుంటే, గెలుస్తుందా.? లేదా.? అన్నది వేరే చర్చ. పోటీ అంటూ చేస్తే, క్యాడర్‌లో కొంత ఉత్సాహం కనిపిస్తుంది. జనానికి చేరువయ్యేందుకు ఇలాంటి ఎన్నికలు సదవకాశం ఏ రాజకీయ పార్టీకి అయినా. అదే బీజేపీ నేతల వెంట ప్రచారానికి వెళితే, జనసేనకు ఏంటి లాభం.?
తప్పని ప్రచారం, లోలోపల ఆవేదనాభరితం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల్ని జనసైనికులెవరూ ధిక్కరించే పరిస్థితి వుండదు. అలాగని, జనసేనకు జరుగుతున్న అవమానాల్ని జనసైనికులు తట్టుకోగలరా.? అందుకే, మొహమాటం కొద్దీ మాత్రమే బీజేపీ శ్రేణులతో కలిసి నడుస్తున్నారు గ్రేటర్ పరిధిలో జనసైనికులు. ఈ పరిస్థితి అధినేత పవన్ కళ్యాణ్‌కి అర్థం కాదని ఎలా అనుకోగలం.? కానీ, కొన్ని ఈక్వేషన్స్‌కి లోబడి తమ అధినేత వ్యూహాత్మక రాజకీయాలు చేస్తున్నారన్నది జనసేన నేతల వాదన. అయితే, ఈ వ్యూహాత్మక రాజకీయం జనసేనను రాజకీయంగా దెబ్బతీసే ప్రమాదం లేకపోలేదు. అదే జనసైనికుల ఆవేదన. ప్రత్యర్థులకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏ పార్టీకి వచ్చినా, ఆ తర్వాత ఆ పార్టీ మనుగడ సాధించడం కష్టమే. ఆ కష్టాల్లోకి జనసేన ఇప్పటికే కూరుకుపోయింది.