‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావడంలో కీలకంగా పనిచేసిన నాగాస్త్ర డ్రోన్ల ప్రభావం స్టాక్ మార్కెట్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ లోయిటరింగ్ మ్యూనిషన్లను తయారుచేసే సోలార్ ఇండస్ట్రీస్ కంపెనీ షేరు, మార్కెట్ అస్థిరత మధ్య కూడా కొత్త గరిష్ఠాలను తాకింది. బీఎస్ఈలో ఈ షేరు 1.5 శాతం పెరిగి రూ.13,934.90 వద్ద ముగియడం విశేషం. ఇది ఇప్పటివరకు ఈ కంపెనీ నమోదు చేసిన అత్యధిక స్థాయి కావడం విశేషం.
నాగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న సోలార్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ ‘ఎకనామిక్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్’ (ఈఈఎల్), బెంగళూరుకు చెందిన జెడ్‌మోషన్ సంస్థతో కలిసి నాగాస్త్ర డ్రోన్లను అభివృద్ధి చేసింది. 2023లో స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన మొదటి బ్యాచ్‌ను భారత సైన్యానికి అందజేసిన కంపెనీ, అప్పటినుంచి రక్షణ రంగంలో వేగంగా ఎదుగుతోంది.
నాగాస్త్ర డ్రోన్ల ప్రత్యేకత ఏమిటంటే, ఇవి గాల్లో తేలుతూ లక్ష్యాన్ని గుర్తించి దానిపై దాడి చేయగలవు. అనుకోని పరిస్థితుల్లో లక్ష్యం మారినా వెంటనే స్పందించగల శక్తి దీనికి ఉంది. హై-ఎక్స్‌ప్లోజివ్ ఫ్రాగ్మెంటేషన్ వార్‌హెడ్, కమ్యూనికేషన్ మాడ్యూల్స్, నిఘా కెమెరాలతో కూడిన గ్రౌండ్ కంట్రోల్ వ్యవస్థ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
30 కిలోల బరువుతో మోసుకెళ్లగల ఈ డ్రోన్, రాత్రింబవళ్ళు పని చేసే సామర్థ్యంతో తయారైంది. ముఖ్యంగా మిషన్ ఫెయిల్ అయినా, లక్ష్యం కనబడకపోయినా ఇది పారాచూట్ ద్వారా బేస్‌కు తిరిగి చేరేలా రూపొందించారు. ఈ సౌలభ్యం తిరిగి వాటిని ఉపయోగించే అవకాశం కల్పిస్తుంది.
సైనిక రంగంలో ఈ కంపెనీ ప్రదర్శన, షేరు ధరకు బలమైన మద్దతు అందిస్తోంది. గత రెండేళ్లలో ఈ స్టాక్ 267% వృద్ధి, ఐదేళ్లలో 1450% రాబడితో మల్టీబ్యాగర్ జాక్ పాట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ షేరు అన్ని కీలక మోవింగ్ యావరేజ్‌ల కంటే పై స్థాయిలో ట్రేడ్ అవుతుండటం, కంపెనీ భవిష్యత్తుపై మార్కెట్‌లో నమ్మకాన్ని చూపుతోంది.