స్మార్ట్ రింగ్: చంద్రబాబు హైటెక్ పొలిటీషియన్ అయ్యింది అందుకే.!

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి చేతి వేలికి ఓ ప్లాటినం రింగ్ వుంది చూశారా.? ఈ మధ్యనే ఆయన దాన్ని ధరించడం మొదలు పెట్టారు. ఎవరైనా జ్యోతిష్యుడు సూచించడంతో చంద్రబాబు అలా చేశారా.? లేదంటే, ఇంకేదైనా బలమైన కారణం వుందా.? అటూ రాజకీయాల్లో చర్చ జరుగుతున్న వేళ, చంద్రబాబే ఆ రింగ్ గురించి చెప్పేశారు.

నిజానికి, అది మామూలు రింగ్ కాదు. అది హైటెక్ రింగ్. సరిగ్గా చెప్పాలంటే, స్మార్ట్ రింగ్. స్మార్ట్ ఫోన్ తరహాలో అన్నమాట. కానీ, ఇది చేసే పని వేరే వుంటుంది. ఈ స్మార్ట్ రింగ్‌లో ఓ మైక్రో చిప్ వుంటుంది. ఆ చిప్, చంద్రబాబు ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆయన వ్యక్తిగత వైద్య సిబ్బందికి అందిస్తుందట.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కార్యకర్తల్ని, ప్రజల్ని ఉద్దేశించి సూచించిన చంద్రబాబు, వైద్యుల సూచన మేరకు తాను ఆ రింగ్ ధరించినట్లు చెప్పారు. వృద్ధాప్యం చంద్రబాబులో కొట్టొచ్చినట్లు కనపడుతున్నా, ‘నా మనసు ఇంకా ఇరవయ్యేళ్ళ వయసులో వున్న స్పీడుతోనే పరిగెడుతుంది..’ అని చంద్రబాబు చెబుతుంటారు.

చెప్పే మాటల సంగతెలా వున్నా, చంద్రబాబుని వృద్ధాప్య సమస్యలు వెంటాడుతున్న మాట వాస్తవం. ఇదివరకటి ఎనర్జీ ఆయనలో కనిపించడంలేదు. కానీ, తపన పడుతున్నారంతే. ఇంకొక్కసారి ముఖ్యమంత్రి అనిపించేసుకోవాలన్న ‘యావ’ ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది.

కానీ, అది సాధ్యమయ్యే పనేనా.? అన్నట్టు, చంద్రబాబు స్మార్ట్ రింగ్ గురించి సోషల్ మీడియాలో బోల్డన్ని సెటైర్లు పడుతున్నాయ్.!