మనిషి జీవితానికి నిద్ర అనేది తప్పనిసరి అవసరం. శరీరానికి విశ్రాంతి ఇవ్వడానికి, మానసిక ప్రశాంతత కలిగించడానికి ఇది సహజమైన ప్రక్రియ. కానీ వేదాలు, పురాణాలు ఒక గట్టి హెచ్చరిక ఇస్తున్నాయి.. నిద్రలో సమయం తప్పితే దాని ఫలితాలు దారుణంగా ఉంటాయని. ముఖ్యంగా సంధ్యాసమయాలలో నిద్రపోవడం వల్ల లక్ష్మీ కటాక్షం దూరమవుతుందని శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి.
వేదవాక్యాలలో నిద్రించేవాని కోరికలను దేవతలు తీర్చరు.. అని ఒక ముఖ్యమైన సూక్తి ఉంది. అంటే అధిక నిద్ర ఆత్మవిశ్వాసాన్ని తగ్గించి, చురుకుతనాన్ని కోల్పోయేలా చేస్తుంది. దాంతోపాటు దరిద్రానికి దారితీస్తుందని వేదాలు, మహాభారతం, పురాణాలు చెబుతున్నాయి. మహాభారతంలో లక్ష్మీదేవి స్వయంగా ఇలా అన్నట్లు వర్ణించబడింది “ఉభయసంధ్యలలో నిద్రించే వారిని నేను విడిచిపెడతాను.” అంటే ఉదయం, సాయంత్రం సూర్యోదయ.. సూర్యాస్తమయాల సమయంలో నిద్రపోతే సంపదల దేవత అయిన లక్ష్మీదేవి దయ దూరమవుతుందని అర్థం.
సూర్యోదయానికి ముందే మేల్కొని ధ్యానం, జపం, ఉపాసన వంటివి చేయడం వలన ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుందని. అలాగే సాయంత్రం సంధ్యాసమయంలో చేసే ప్రార్థన భక్తికి, పుణ్యానికి ద్వారం అని పురాణాలు వివరిస్తున్నాయి. ఆ సమయంలో నిద్రలో మునిగితే గత జన్మలో కూడబెట్టుకున్న పుణ్యఫలాలు కూడా నశిస్తాయని స్పష్టంగా చెబుతున్నాయి.
నిద్ర నియంత్రణకు యోగం, ప్రాణాయామం, మితాహారం, శారీరక వ్యాయామాలు ముఖ్యమని వేదాలు సూచిస్తున్నాయి. రాత్రి తగినంత నిద్రపోవడం శరీరానికి శక్తినిస్తే, పగటి నిద్ర మనసును బద్ధకానికి గురి చేస్తుంది. పగటి నిద్ర అలవాటు పడినవారి జీవితం వెనుకబడిపోతుందని వేదపండితులు తరచూ హెచ్చరిస్తుంటారు.
ఇదే కారణంగా పూర్వం నుంచీ సంధ్యాసమయాల్లో దీపారాధన, జపం, ధ్యానం వంటి ఆచారాలను తప్పనిసరి చేశారు. ఇది కేవలం ఆధ్యాత్మిక లాభాలకే కాకుండా మానసిక ప్రశాంతత, ఆరోగ్యకరమైన జీవనానికి మార్గం చూపుతుంది.
అందువల్ల నిద్ర అనేది అవసరం, కానీ సమయాన్ని, పరిమితిని పాటించకపోతే అది శ్రేయస్సు కాకుండా శాపంగా మారుతుంది. సంధ్యాసమయాల్లో నిద్రలో మునిగితే అది మన భవిష్యత్తు పుణ్యఫలాలను తినేసే శక్తిగా మారుతుందని శాస్త్రాలు గట్టిగా హెచ్చరిస్తున్నాయి. (గమనిక: ఈ కథనం పండితుల అభిప్రాయం ప్రకారం రాసినది. దీనిని తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు.)
