కొంతమంది నిద్రలో ఎందుకు చనిపోతారో తెలుసా.. అసలు కారణం ఇదే..!

రాత్రి ప్రశాంతంగా నిద్రిస్తున్నవారిలో అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయే సంఘటనలు చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేస్తుంటాయి. నిద్రలో మరణం అనే మాట వినగానే ఒక్కసారిగా భయానికి లోనవుతాం. కానీ ఇది నిజంగానే జరుగుతుంది. గుండె, ఊపిరితిత్తులు, మెదడు వంటి జీవనావశ్యక అవయవాల్లో ఒక్కసారిగా సమస్యలు తలెత్తినప్పుడు అర్థరాత్రిలోనే శరీరం స్పందించకుండా పోవచ్చు. అనేక సందర్భాల్లో దీని వెనుక గల అసలు కారణం దీర్ఘకాలిక గుండె వైఫల్యం కావచ్చు.

ఈ గుండె సంబంధిత వ్యాధి ప్రస్తుతం వేగంగా పెరుగుతున్న సమస్యగా మారింది. మన గుండె శరీరానికి అవసరమైనంత రక్తాన్ని పంపించలేని స్థితికి వచ్చే సమయంలో దీన్ని గుండె వైఫల్యం అంటారు. ఇది ఒక్కసారిగా రావడం కాదు, ఏటా ఏటా మెల్లగా ఎదుగుతుంది. మొదటి దశల్లో చిన్న లక్షణాలు కనిపించినా, అవి పట్టించుకోకుండా ఉండటం వల్ల వ్యాధి తీవ్రమవుతుంది.

దీర్ఘకాలిక గుండె సమస్యలు ఉన్నవారిలో తరచూ అలసట, శరీర భాగాలలో వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ బిగుదల, రాత్రిపూట మూత్ర విసర్జన ఎక్కువగా ఉండటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన గురక, గుండె వేగం క్రమబద్ధంగా లేకపోవడం వంటి సమస్యలు కూడా ఉంటాయి. ఈ లక్షణాలు ఉంటే ముందే వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.

ఈ సమస్య ఎక్కువగా పురుషులకే వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ వాస్తవానికి అది అర్థసత్యం. 45 ఏళ్ల వయస్సు వరకు పురుషులలో ఎక్కువగా గమనించబడినా, 50 సంవత్సరాల వయస్సుకు చేరుకున్నాక ఆ ప్రమాదం మహిళలు, పురుషులు ఇద్దరిలోనూ సమానంగా ఉంటుంది. అంటే వయస్సు పెరిగేకొద్దీ ఈ సమస్యను ఎవ్వరూ తేలిగ్గా తీసుకోరాదు. గుండె వైఫల్యాన్ని నాలుగు దశలుగా వైద్య నిపుణులు వర్గీకరించారు. ప్రారంభ దశలో మందుల ద్వారా నియంత్రణ సాధ్యపడుతుంది. కానీ మూడో, నాలుగో దశకు చేరుకుంటే శస్త్రచికిత్స లేదా గుండె మార్పిడి మాత్రమే పరిష్కార మార్గంగా మిగుస్తుంది. నాల్గో దశలో గుండె పనితీరు దాదాపు 90 శాతం వరకు తగ్గిపోతుంది.

ఈ వ్యాధిని నివారించాలంటే జీవనశైలిలో మార్పులు తప్పనిసరి. రక్తపోటు నియంత్రణలో ఉంచుకోవాలి. రోజూ ఎక్కువ నీరు తాగడం కంటే పరిమితంగా ఉండటం మంచిది. ఉప్పు తక్కువగా తీసుకోవాలి. మద్యం, ధూమపానం అలవాట్లు పూర్తిగా మానుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు, ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలి. నిద్రలో మరణించకుండా ఉండాలంటే గుండె ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలి. సాధారణంగా కనిపించే అలసట కూడా చిన్న లక్షణంగా కనిపించవచ్చు. అలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా, తగిన సమయంలో వైద్యులను సంప్రదించడం వల్ల మీ జీవితాన్ని గుండె సమస్యల నుండి కాపాడుకోవచ్చు.