Eye : కళ్లకు కాటుక పెట్టుకోవడం.. వెనుక అసలు కారణం ఇదే..!

మన దేశం ఎంత అభివృద్ధి చెందినా.. ఎన్ని కొత్త స్టైల్స్ అందుబాటులోకి వచ్చినా.. కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు ఎప్పటికీ మారవు. అందులో ఒకటి కళ్ళకు కాటుక పెట్టుకోవడం. ఇది సౌందర్యానికి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో ముఖ్యమని పెద్దలు చెబుతారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు కళ్ళకు కాటుక పెడతారు. ఆ చిన్ని కన్నుల్లో కాటుక మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది. అయితే ఎందుకు కళ్లకు కాటుక పెట్టుకోవాలి.. ఎందుకు చిన్న పిల్లలు, పెద్దవారు దీనిని తప్పని సరిగా పెట్టుకుంటారు.. అనేది చాలా మందికి తెలియదు దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ సంప్రదాయం ప్రకారం కళ్ళకు కాటుక పెట్టడానికి కారణం.. కళ్లకు రక్షణ కోసం మాత్రమే. ఎవరో చూశాక మనసులో కలిగే అసూయ, ప్రతికూల శక్తులు నేరుగా మనల్ని వదిలిపెట్టవు అని పెద్దలు నమ్ముతారు. చిన్నారులలో అందం ఎక్కువగా ఉంటుందని, వారిని ఎవరో చూసి ఇష్టపడితే ‘దృష్టి’ పడుతుందని నమ్మకాలు ఉన్నాయి. అందుకే పాపకి లేదా చిన్నారికి కళ్ళకు గాఢంగా కాటుక దిద్దుతారు. ఇది ప్రతికూల శక్తులు దగ్గరికి రాకుండా కాపాడుతుందని చెప్పుకుంటారు.

మరోవైపు కాటుకను అదృష్టానికి, శుభానికి సంకేతంగా కూడా భావిస్తారు. ప్రత్యేకంగా వివాహాలు, శుభ సందర్భాల్లో స్త్రీలు కళ్ళకు కాటుక దిద్దుకోవడం అందుకే. ఇది మంచి శ్రేయస్సును, సంపదను తీసుకువస్తుందనే విశ్వాసం ఉంది. అందుకే వివాహ సమయంలో వధువు కళ్ళు మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి కాటుక తప్పనిసరి. కాటుక పెట్టుకోవడం వెనక మరో ప్రయోజనం ఏంటంటే.. కాజల్ కళ్ళకు చల్లదనం ఇస్తుంది. కళ్ళను దుమ్ము, వేడి నుంచి కొంతవరకు రక్షిస్తుంది.

ఆయుర్వేదం ప్రకారం నెయ్యి దీపం నుంచి వచ్చే మసితో కాటుకను ఇంట్లోనే తయారు చేసుకుని వాడేవారు. ఇది కళ్ళను మిగతా హానికరమైన పదార్థాల నుంచి కాపాడుతుందని నమ్మకం. కళ్ళకు వచ్చే ఒత్తిడి, జలదోషం లాంటి సమస్యలను కూడా తగ్గిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. ఇంకా సౌందర్యం పక్కన పెట్టినా, కాజల్ వలన కళ్ళు పెద్దగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వ్యక్తిత్వానికి ప్రత్యేకత తీసుకొస్తుంది. కాబట్టే ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. పూర్వకాలంలో మొదలైన ఈ ఆచారం ఎందరో తరం మారినా మిగిలిపోయింది. నేటికీ ప్రతి ఇంట్లో చిన్నారుల నుంచి పెద్దవారి వరకు కళ్లకు కాటుక పెట్టుకుంటున్నారు. అందుకే కాటుక అంటే కేవలం అందం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యానికి, ఆధ్యాత్మిక రక్షణకు కూడా అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు.