“నేనే రాజు అయితే” వైయస్ జగన్ ఎన్డీయే లో చేరాలా?

Cm jagan to meet pm modi at 10.30 am on October 6th

“నేనే రాజు అయితే” ప్రధాన ఉద్దేశం జరుగుతున్న రాజకీయ పరిణామాలు మీద ఆయా రాజకీయా పార్టీలు వాటి అధినేతల స్థానంలో “తెలుగురాజ్యం” వుంటే ఏవిధంగా స్పందించేది అని చెప్పడానికి మాత్రమే. ప్రస్తుతం వైయస్ జగన్ ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య ఎన్డీయే లో చేరాలా వద్ద అనేది. దీని మీద మా అభిప్రాయం.

Cm jagan to meet pm modi at 10.30 am on October 6th
Cm jagan to meet pm modi at 10.30 am on October 6th

వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ లో ప్రధానమంత్రిని కలవడానికి సిద్ధమవుతున్నారు. అటు మీడియాలో ఇటు రాజకీయవర్గాల్లోనూ ఈ భేటీపై చాలా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. వైయస్ జగన్ ను మోడీ ఎన్డీఏ ప్రభుత్వంలో చేరడానికి ఆహ్వానించారు, అదే విషయమై ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రధాన మంత్రిని కలుస్తున్నారు అనేది విస్తృతంగా జరుగుతున్న ప్రచారం.

పది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లినప్పుడు అమిత్ షా తో రెండు సార్లు భేటీ అయ్యారు. ఇది కొంత ఆసాధారణమే. ఒకసారి కలిసి సమస్యలు చెప్పుకోవడం, రావడం వరకు సహజంగా జరిగేదే. మొదటి రోజు కలిసి సుమారుగా గంట వరకు చర్చించిన తర్వాత తిరిగి రెండో రోజు కూడా కలిశారు అంటే కొంచెం అసాధారణమైన విషయమే. రాష్ట్రంలో ఉన్న మీడియా మాత్రం అమిత్ షా జగన్ భేటీ మీద రకరకాల కథనాలు వండివార్చింది. జగన్ అనుకూల మీడియా రాష్ట్ర సమస్యలు విపులంగా చర్చించడానికే రెండోసారి కూడా ముఖ్యమంత్రి కేంద్ర హోం మంత్రిని కలిశారు అని చెప్పుకొస్తే, అదే వ్యతిరేక మీడియా జగన్మోహన్ రెడ్డి ని అమిత్ షా అనేక విషయాల మీద మందలించారని, తన శైలి మార్చుకోవాలని హెచ్చరించారని రాసుకొచ్చాడు.

అయితే ఒక తటస్థ వైఖరి తీసుకొని ఈ విషయాన్ని గమనిస్తే ఎవరికైనా అర్థమయ్యేది ఏంటంటే మొదటిరోజు చర్చించిన విషయమేదో ఒక కొలిక్కిరాలేదు కనుక తిరిగి మరుసటి రోజు కలిసుంటారు అనిపిస్తుంది. మొదటి రోజు కొంచెం తిట్టిన తర్వాత రెండో రోజు కూడా మందలించడానికి పిలిచారనే వాదనలో తర్కం కనిపించడంలేదు. అమిత్ షా చేసిన ప్రతిపాదన మీద తాను ఆలోచించుకొని మరుసటి రోజు తన నిర్ణయం చెప్పడానికి కలిసుంటారు అనేదే కొంచెం నమ్మదగ్గదిగా వుంది. అయితే ఆ ప్రతిపాదన ఏంటనేది వైసీపీ లో ఒక ఇద్దరి ముగ్గురికి బీజేపీ లో చాల తక్కువ మందికి తెలిసే అవకాశం వుంది.

ఒకవేళ క్యాబినెట్లో చేరమనే ప్రతిపాదనే అమిత్ షా జగన్ ముందర పెట్టివుంటే, ఈ పది రోజుల్లో దాని మీద కొంచెం తర్జన భర్జన జరిగి ఏ మంత్రిపదవులు కావాలి, ఈ పొత్తు ఎలా ఉండాలి, ప్రజల్లోకి ఎటువంటి సందేశం పంపించాలనే విషయాల మీద ఒక నిర్ణయానికి వచ్చివుంటుంది వైస్ జగన్ అండ్ టీం. ఈ రోజు ప్రధాని మంత్రి కలుస్తున్నారు అంటే చేరిక మీద తమ సమ్మతం చెప్పడానికే ఉంటుంది కానీ మేము చేరాము అని చెప్పడానికి ప్రధానిని కలవరు కదా. అదేదో అమిత్ షా కే చెప్పేసివుంటారు.

కేంద్ర ప్రభుత్వం లో చేరమని బీజేపీ ఆహ్వానించడం వైసీపీకి తప్ప ఏ ఇతర పార్టీకైనా ఒక శుభవార్తే అవుతుంది. అయితే వైసిపి ఆ అవకాశాన్ని తీసుకోవడానికి తర్జనభర్జన పడడంలోనూ ఒక అర్థం ఉంది. వైసీపీకి బీజేపీతో జతకట్టడానికి రెండు ప్రధాన అడ్డంకులున్నాయి. మొదటిది , వైసీపీకి ప్రధానమైన ఓటు బ్యాంకు ఎస్సీ ఎస్టీ మరియు మైనారిటీ వర్గాలు. బీజేపీకి దగ్గరైతే ఈ వర్గాలు దూరమైపోతాయనే ఒక భయం. రెండవ అంశం 2024 నాటికి మోడీ ప్రభుత్వం ఏర్పడి పదేళ్లు అవుతుంటుంది. ఆ ఎన్నికల్లో, అప్పటివరకు భాగస్వామిగా వున్నందుకు కలిసి పోటీచేయవలసి వస్తే కేంద్రం మీదున్న వ్యతేరేకత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం భరించాలి. అలాగే పొత్తు వల్ల కొన్ని సీట్లు నష్టపోతారు ఆ మేరకు వైసీపీ క్యాడర్ కూడా నష్టపోతుంది.

ఆ భయాలు 2024 ఎన్నికలకు సంబంధించినవి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న పరిస్థితులు కూడా వైసీపీ ఆలోచించుకోవలసిన పరిస్థితి వుంది. అధికార పార్టీకి ఏ ఒక్క పార్టీ కూడా మద్దతు తెలపడం లేదు. బిజెపి తాను ప్రధాన ప్రతిపక్షం గా ఎదగాలని సోము వీర్రాజు అధ్యక్షుడైన తర్వాత కొంచెం దూకుడుగా వ్యవహరిస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తుంది. అలాగే తెలుగుదేశం ఒక ప్రధాన ప్రతిపక్షంగా దొరికిన ప్రతి అవకాశాన్ని వదలకుండా ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తోంది. పవన్ కళ్యాణ్ బీజేపీ తో కలిశారు ఒకవేళ కలవకపోయినా పవన్కళ్యాణ్ వైఖరి ఎప్పుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కి వ్యతిరేకంగానే ఉంటుంది. తర్వాత కమ్యూనిస్టు పార్టీలు తో సహా చిన్నాచితకా పార్టీలన్నీ ప్రభుత్వ వ్యతిరేఖ పక్షంలో వున్నాయి. దీనికితోడు ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఒక తీవ్ర ప్రయత్నమే జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారు కొంచెం సంయమనంతో వ్యవహరించడం వల్లన ఆ సంఘటనలు సద్దుమణిగాయి.

వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ నిజంగానే ఎన్డీయే పక్షాల నుండి ఆహ్వానం వుంటె ఆయన తప్పకుండా ప్రభుత్వంలో చేరాలి. అయితే ఈ చేరికకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వచ్చే రెండు సంవత్సరాలలో పోలవరం పూర్తి, ఈ రెండింటిని తన ప్రధాన షరతులుగా విధించి ఎన్డీఏ ప్రభుత్వంలో చేరడం వల్ల రాష్ట్రానికి ఎంతో మంచి జరుగుతుంది. అలాగే రాజకీయంగా కూడా ఈ పొత్తును విమర్శించే వాళ్ళకి జగన్ మోహన్ రెడ్డికి సమాధానం చెప్పుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. తన వెంట ఉన్న ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓటర్లకు, వారి మనోభావాలకు ఈ పొత్తు విరుద్ధం అయినప్పటికీ, తన ఓటుబ్యాంకు కు గండి పడుతుంది అని తెలిసినప్పటికీ తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఒక సందేశం బలంగా ప్రజల్లోకి పంపించగలరు. తాను నష్ట పోయే ఓట్లు సీట్లు మేరకు, నిర్విరామంగా జరిగే సంక్షేమం, పోలవరం పూర్తయితే వచ్చే ఫలాలు, ప్రత్యేక హోదా వల్ల జరిగే పారిశ్రామికీకరణ, కేంద్రం నుండి వచ్చే నిధుల వలన వైయస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని కొత్త వర్గాలకు దగ్గరయ్యే అవకాశం వుంది. తాను కోల్పోయిన ఓట్లని తప్పకుండా మిగతా వర్గాల నుండి పూరించుకొనే అవకాశం కనిపిస్తుంది.

రాష్ట్రంలో జరిగే ప్రతి చిన్న విషయానికి తన మీద విమర్శలు చేసే ప్రతిపక్షాలను కట్టడి చేసేదానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ఇది ఒక మంచి అవకాశం. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి అయిన తర్వాత ఒకవేళ రాష్ట్ర బిజెపి జగన్ ను విమర్శించినా అవి ఏమంత తీవ్రంగా వుండే అవకాశం లేదు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రాన్ని విమర్శించే ప్రయత్నం చేయకపోవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ అప్పుడో ఇప్పుడో చేసే విమర్శలకి అధికార పార్టీ పట్టించొకావల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే అప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీతో వుంటారో తిరిగి తెలుగు దేశం వైపు వెళతారో అనేది కూడా ఒక ఆసక్తికరమైన అంశమే అవుతుంది. వైయస్ జగన్ కు కొంత కాలం రాష్ట్రంలో అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి.

ఆ పరిస్థితులే ఏర్పడితే తనకు మిగిలివున్న ఈ నలభై నెలల కాల పరిమితిలో పాలనపై ద్రుష్టి పెట్టవచ్చు. ఇదే కాలంలో తనకు దూరమవుతాయి అని భయపడే వర్గాలకు ఒక భరోసా కల్పించడానికి తగినంత సమయం దొరుకుంది. మైనార్టీలకు ఆ భరోసా ఇవ్వగలిగితే ఎన్డీయే లో చేరడం వలన చెడుకంటే మంచే ఎక్కువ జరిగే అవకాశం వుంది. ప్రత్యేక హోదా, పోలవరం మీద స్పష్టత లేకుండా ఎన్డీయే లో చేరితే అది వైస్సార్సీపీ కు ఆత్మహత్యసాదృశ్యమే అవుతుంది.

—- యల్. ఎన్. కె