శరద్ పూర్ణిమ రాత్రి.. చంద్ర కాంతిలో ఇలా పూజ చేస్తే.. దరిద్రం దూరం.. లక్ష్మీ కటాక్షం మీ సొంతం..!

హిందూ సంప్రదాయంలో ప్రతి పూర్ణిమకూ విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. అయితే వాటిలో శరద్ పూర్ణిమకు మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. ఈ సంవత్సరం అక్టోబర్ 6న శరత్ పూర్ణిమ రానుంది. ఈ రోజు భక్తులు లక్ష్మీదేవిని ఘనంగా పూజించి ఐశ్వర్యం, ధనవృద్ధి కోసం ప్రత్యేక వ్రతాలు ఆచరిస్తారు. పురాణాలు చెబుతున్నట్లుగా, శరద్ పూర్ణిమ రాత్రి పదహారు కళలతో పరిపూర్ణుడైన చంద్రుడు భూమిని తన కాంతితో నింపుతాడు. ఆ కాంతిని అమృతసమానమని భావించి పూజలు, వ్రతాలు చేస్తే ఇంటిలో సుఖశాంతులు, ఐశ్వర్యం ప్రవహిస్తాయని నమ్మకం ఉంది.

జ్యోతిష్యులు చెబుతున్న ప్రకారం ఈ ప్రత్యేక రాత్రి లక్ష్మీదేవి స్వయంగా భూమిపై విహరిస్తారని అంటారు. జాగారం చేస్తూ భక్తిశ్రద్ధలతో ప్రార్థనలో గడిపేవారికి ఆమె అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అందుకే ఈ రోజున చాలా మంది రాత్రంతా మంత్రోచ్చారణ, దీపారాధన, పూజలతో నిమగ్నమవుతారు. పండితులు సూచిస్తున్న శుభాచారాల్లో ప్రధానమైనది చంద్రుడికి అఘ్యం ఇవ్వడం. శుభ్రమైన నీటితో కూడిన కంచు లేదా మట్టి పాత్రలో బియ్యం, పువ్వులు, తెల్లని వస్త్రం వేసి చంద్రుని వైపు తిరిగి అర్పించడం ద్వారా మనసుకు ప్రశాంతత కలుగుతుందని, ఇంట్లో సానుకూల శక్తులు నెలకొంటాయని చెబుతున్నారు.

లక్ష్మీదేవికి ఇష్టమైన పానుపత్రాలు సమర్పించడం కూడా విశిష్టం. వీటిపై సుపారి, లవంగం ఉంచి దేవికి అర్పిస్తే ధనలాభం కలుగుతుందని, ఆర్థిక సమస్యలు తగ్గుతాయని విశ్వసిస్తారు. వ్యాపారులు, ఉద్యోగస్తులు ఈ ఆచారాన్ని తప్పనిసరిగా చేయాలని పండితులు సూచిస్తున్నారు.

ఇక శరద్ పూర్ణిమ రాత్రి ఖీర్ సిద్ధం చేసి చంద్రకాంతిలో ఉంచే ఆచారం అత్యంత ప్రసిద్ధి. చంద్రకాంతి ఆ ఖీర్‌ను అమృతసమానంగా చేస్తుందని భావించి మరుసటి రోజు ఉదయం కుటుంబ సభ్యులు కలిసి ఆ ప్రసాదాన్ని తీసుకుంటారు. దీని వలన ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుందని నమ్మకం.

అలాగే లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రాలు సమర్పించడం మంగళకరంగా భావిస్తారు. ఎరుపు రంగు లక్ష్మీదేవి కృపకు ప్రతీకగా పరిగణించబడుతుంది. ఈ వస్త్రాలను ఇంటిలో భద్రపరచి శుభ సందర్భాల్లో ఉపయోగిస్తే శ్రేయస్సు లభిస్తుందని చెబుతారు.

తులసి పూజ కూడా శరద్ పూర్ణిమలో కీలకంగా ఉంటుంది. తులసిని లక్ష్మీదేవి రూపంగా భావించి, శ్రీకృష్ణునికి తులసి ఆకులు సమర్పించి దీపం వెలిగించడం అత్యంత శుభప్రదమని పెద్దలు చెబుతారు. ఇది ఇంటికి సానుకూల శక్తిని ఆహ్వానిస్తుందని, జీవనంలో శాంతి నెలకొంటుందని విశ్వాసం.

జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం ఈ రోజున పేదలకు దానం చేయడం, ఆవులకు ఆహారం పెట్టడం, పక్షులకు ధాన్యం వేయడం కూడా అత్యంత పుణ్యఫలితాలను ఇస్తాయి. లక్ష్మీదేవి కృపతో పాటు, ధనలాభం, ఆరోగ్యవృద్ధి, కుటుంబ సౌఖ్యం దక్కుతుంది పండితులు చెబుతున్నారు. ఇక మొత్తంగా చెప్పాలంటే, శరద్ పూర్ణిమ రాత్రి చంద్రకాంతిలో ఆచరించే ఈ పూజలు, వ్రతాలు జీవనంలో ఐశ్వర్యం, ఆనందం, శాంతిని నింపుతాయని విశ్వాసం. అందుకే భక్తులు ఈ రాత్రిని అత్యంత పవిత్రంగా భావించి, శ్రద్ధాభక్తులతో పూజలు చేస్తారు. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సాధారణ సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు.)