ఉదయం నిశ్శబ్దంగా, ప్రకృతిలోని ప్రతి శ్వాస పవిత్రతతో నిండిన సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. ఇది సాధారణ సమయం కాదు.. దేవతలు భూలోకంలో సంచరించే పవిత్ర క్షణమని శాస్త్రాలు చెబుతున్నాయి. తెల్లవారు జామున 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే ఈ సమయాన్ని సర్వోత్తమ ముహూర్తంగా పరిగణిస్తారు. ఈ రెండు గంటల సమయం మన శరీరానికి, మనసుకు, ఆధ్యాత్మికతకు అత్యుత్తమ ప్రభావం చూపుతుందనే విశ్వాసం యుగాలుగా కొనసాగుతోంది.
వైద్యశాస్త్రం కూడా దీనికి మద్దతు ఇస్తుంది. ఈ సమయంలో గాలిలో ఓజోన్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఓజోన్ శరీరంలోని కణజాలానికి నూతన ఉత్సాహాన్ని అందిస్తుంది. అందువల్ల బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసే వారు శరీరంగా, మానసికంగా ఉత్తేజితులవుతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హిందూ సంప్రదాయంలో దీన్ని దైవసన్నిధికి చేరువయ్యే సమయంగా చూస్తారు.
ఆ సమయంలో దేవతలు భూలోకంలో విహరిస్తారని, ఆ వేళ స్నానం, జపం, ధ్యానం చేస్తే భగవంతుడు ప్రసన్నుడవుతాడని పురాణ వచనాలు చెబుతున్నాయి. అందుకే అనేక దేవాలయాల్లో సుప్రభాతం, మేలుకొలుపు సేవలు ఈ సమయానికే నిర్వహిస్తారు. యోగులు, దీక్షలు తీసుకున్న భక్తులు ఈ బ్రహ్మముహూర్తాన నిద్రలేచి శిరస్స్నానం చేసి, ఆధ్యాత్మిక సేవల్లో నిమగ్నమవుతుంటారు. ఇక దీపారాధన ఎందుకు ముఖ్యమంటే.. అది దైవసంప్రాప్తి యొక్క ప్రతీక. ప్రతి దీపం ఒక శుభప్రతీకం. శాస్త్రం ప్రకారం ఒక వత్తితో దీపం వెలిగిస్తే సాధారణ శుభం కలుగుతుంది. రెండు వత్తులు కుటుంబ సౌఖ్యాన్ని, మూడు వత్తులు పుత్రసౌఖ్యాన్ని, ఐదు వత్తులు ధనం, ఆయుర్ధాయం, ఆరోగ్యం, అభివృద్ధిని ప్రసాదిస్తాయని విశ్వాసం ఉంది.
దీపారాధనలో వాడే నూనెలకూ ప్రత్యేకత ఉంది. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే సర్వ సౌభాగ్యం లభిస్తుంది. నువ్వుల నూనెతో చేసిన దీపారాధన దోషాలు, పాపాలు, పీడలను తొలగిస్తుంది. ఆముద నూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో శుభం, బంధుత్వ స్నేహం వృద్ధి చెందుతుంది. వేరుశెనగ నూనెతో దీపం వేస్తే మాత్రం అశుభ ఫలితాలు ఎదుర్కోవలసి వస్తుందని శాస్త్రం హెచ్చరిస్తుంది. అంతేకాదు, నెయ్యి, ఆముదం, వేపనూనె, యిలపనూనె, కొబ్బరి నూనె కలిపి 48 రోజుల పాటు దీపారాధన చేస్తే దేవీ అనుగ్రహం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. వేపనూనె, యిలపనూనె, నెయ్యి ఈ మూడింటిని కలిపి దీపారాధన చేస్తే ఐశ్వర్యం, సంపద ప్రవహిస్తుందని కూడా విశ్వాసం.
సూర్యోదయానికి ముందే లేచి, ఆ పవిత్ర సమయాన మనసు, శరీరం, చుట్టూ వాతావరణం పవిత్రతతో నింపుకోవడం జీవనాన్నే మార్చే ఆధ్యాత్మిక పద్ధతి. ఆధునిక జీవనశైలిలో మనం కోల్పోతున్న ఈ ‘బ్రహ్మముహూర్తం’ శక్తిని మళ్లీ అనుభవించాలంటే ఒక్కసారి తెల్లవారుజామున లేచి ఆ నిశ్శబ్ద గాలి, ఆ చల్లని పవనం, ఆ అంతరంగ శాంతిని ఆస్వాదించండి. మీ రోజు కాదు… మీ జీవితం మారుతుంది.
