అతడి వయస్సు 22 సంవత్సరాలు.. ఐపీఎల్ లో ఆడిన అనుభవం కూడా ఉంది.. కాకపోతే అత్యాచార నేరం మీద విచారణను ఎదుర్కొంటూ జైలులో ఉన్నాడు. ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చి ప్రపంచ రికార్డ్ సృష్టించాడు!
అవును… అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే తన ఉనికిని చాటుకొంటున్న నేపాల్ జట్టు సభ్యుడు, 22 సంవత్సరాల సందీప్ లామీచానే… వన్డే క్రికెట్లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అఫ్ఘనిస్థాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ నెలకొల్పిన ప్రపంచ రికార్డును.. ఈ నేపాలీ కుర్రోడు అధిగమించాడు. ఏసీసీ పురుషుల ప్రీమియర్ కప్ టోర్నీలో భాగంగా ఒమన్ తో జరిగిన పోరులో సందీప్ ఈ రికార్డు నమోదు చేశాడు. కేవలం 42 వన్డే మ్యాచ్ ల్లోనే 100 వికెట్లు పడగొట్టడంతో… అత్యంత వేగంగా 100 వన్డే వికెట్లు సాధించిన తొలి బౌలర్ గా సందీప్ నిలిచాడు.
ఇక్కడ మరో విశేషం ఏమిటంటే… ఐపీఎల్ లో 2018 నుంచి 2020 సీజన్ వరకూ ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడాడు సందీప్. 15 సంవత్సరాల వయసులోనే ఐపీఎల్ సీజన్ కు 10 లక్షల రూపాయల కాంట్రాక్టుపై ఎంపికైన సందీప్… ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఆడాడు.
ఈ క్రమంలో… ఢిల్లీ తరపున 9 మ్యాచులు ఆడిన సందీప్… 2018 సీజన్లో ఆరు వికెట్లు, 2019లో 13 వికెట్లు పడగొట్టాడు. 2020 సీజన్లో మాత్రం ఢిల్లీ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
దీంతో… నేపాల్ జట్టులోని స్టార్ క్రికెటర్లలో ఒకడైన సందీప్.. అత్యాచారం కేసులో నిర్దోషిగా బయటపడగలిగితేనే భవిష్యత్ లో మరింతగా రాణించే అవకాశం ఉంటుందని అంటున్నారు క్రికెట్ అభిమానులు!
కాగా… క్రికెటర్ గా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకొన్న సందీప్.. 21 సంవత్సరాల వయసులోనే జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఓ యువతిపై అత్యాచారం చేశాడన్న కారణంగా పోలీసులు గతేడాది అరెస్టు చేసి జైలులో ఉంచారు. ఫలితంగా… నేపాల్ క్రికెట్ సంఘం సందీప్ పై నిషేధం విధించింది. దీంతో… అతని క్రికెట్ జీవితం ముగిసిపోయిందనే అంతా అనుకొన్నారు. అయితే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో సందీప్ పై నిషేధాన్ని ఎత్తి వేసినా.. విచారణ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో బెయిల్ రావడంతో.. జైల్ నుంచి బయటకు వచ్చిన సందీప్… నేపాల్ బౌలింగ్ కు వెన్నెముకగా మారడంతో పాటు.. తాజాగా ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు!