Sakshi Paper: సాక్షి పత్రిక, వైసీపీ నాయకత్వానికి సిగ్గు… సిగ్గు..

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చేసిన దుష్ప్రచారాన్ని సాక్షి పత్రిక తిప్పి కొట్టలేకపోయిందా?, బూతు పురాణంతో ప్రత్యర్థి పార్టీల నాయకులపై విరుచుకుపడే వైసీపీ నాయకులు టిడిపి అనుకూల మీడియా విషప్రచారాన్ని అడ్డుకోలేకపోయారా?, ఎంతసేపూ తాము ఇస్తున్న సంక్షేమ పథకాలపై ప్రచారం చేసుకోవడం తప్ప ప్రజల్లో ప్రభుత్వంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని వైసీపీ ప్రభుత్వం ఎదుర్కొనలేక పోయిందా ?, సొంతంగా పత్రిక ఉండి , చేతిలో అధికారం ఉండి విపక్షం దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టలేకపోవడం అటు సాక్షికి, ఇటు వైసిపి నాయకత్వానికి సిగ్గుచేటు కాదా?, అంటే ముమ్మాటికి సిగ్గుచేటు అన్న సమాధానం వినిపిస్తోంది. నిజం చెప్పులు తొడుక్కునే లోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుంది అన్నది నానుడి. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి అన్వయించి చూస్తే అతికినట్టు సరిపోతుంది!

తెలుగుదేశం, దాని మిత్రపక్షాలైన జనసేన, బిజెపి, టిడిపి అనుకూల మీడియా ఒక పథకం ప్రకారం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై చేసిన దుష్ప్రచారాన్ని అటు పార్టీ గాని ఆ పార్టీ సొంత పత్రిక సాక్షిగానే బలంగా ఎదుర్కొనలేకపోయాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని, జగన్14 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని, రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయిందని పెద్ద ఎత్తున కూటమి నాయకులు ప్రచారం చేశారు.

జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ను మరో శ్రీలంకగా మార్చేశారని అటు కూటమి నాయకులు, ఇటు టిడిపి అనుకూల మీడియా చేసిన ప్రచారాన్ని జనం పూర్తిగా నమ్మారు. జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాలన్నీ కేవలం అప్పుల చేసిన డబ్బుతో చేస్తున్నవేనని జనం నమ్మారు. అడ్డు అదుపు లేకుండా చేస్తున్న అప్పులతో నిజంగా రాష్ట్రాన్ని జగన్ అంధకారంలో ఉంచేశారని జనం గట్టిగా నమ్మారు. ఈ అప్పు చేసి పప్పు కూడు మాకొద్దు బాబోయ్ అంటూ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు.

అయితే అప్పుల పై టిడిపి చేసిందంతా దుష్ప్రచారమని ఇటీవల అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చేసిన ప్రసంగం ద్వారా వెల్ల డైంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అంటే 2019 నుంచి 2024 వరకు చేసిన అప్పులు కేవలం 3, 39,580 కోట్లు మాత్రమే. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం బడ్జెట్ ద్వారా 2,34,225 కోట్లు, కార్పొరేషన్ ద్వారా10,05,355 కోట్లు అప్పులుగా తెచ్చింది. ఈ మొత్తాలను కలిపేసి 12 లక్షల కోట్ల రూపాయల అప్పు అని ఒకసారి, 14లక్షల కోట్ల రూపాయల అప్పు అని మరోసారి టిడిపి ప్రచారం చేసింది. పైగా మొత్తం 14 లక్షల కోట్ల రూపాయల అప్పంతా జగన్మోహన్ రెడ్డి చేసిందేనని టిడిపి జనాన్ని నమ్మించింది.

అంటే 2014 నుంచి 2019 వరకు టిడిపి చేసిన అప్పులను ఇందులో కలపలేదు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల మీడియా ఒక పచ్చి అబద్దాన్ని జనంలో విపరీతంగా ప్రచారం చేసి, వారిని నమ్మించి ఎన్నికలవేళ తప్పుదోవ పట్టించారు. ఇంత విష ప్రచారం జరుగుతున్నా వైసిపి నాయకత్వం దానిని సమర్థంగా తిప్పుకొట్టలేక పోయింది. బడ్జెట్ అప్పు వేరు, కార్పొరేషన్ ద్వారా చేసే అప్పు వేరు.. మా ప్రభుత్వం చేసిన అప్పు 3,39,580 కోట్లు మాత్రమే అని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చెప్పుకోలేకపోయింది. 2014- 19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పులను వివరించడంలో గాని, తీడీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ కు ఖాళీ ఖజానాను అప్పగించిన విషయం గాని జనానికి వివరించడంలో వైసిపి నాయకత్వం పూర్తిగా విఫలమైంది.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతసేపు డిబిటి ద్వారా ఇన్ని లక్షల కోట్లు, నాన్ డిబీటీ ద్వారా ఇన్ని లక్షల కోట్లు జనానికి పంచిపెట్టాం అని ప్రచారం చేసుకోవడానికి పరిమితమైంది. వైఎస్ఆర్సిపి మంత్రులు కూడా ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రచారం చేయడంలో, టిడిపి చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పి కొట్టడంలో ఒకరకంగా విఫలమయ్యారు. మంత్రులు గానే కాక పైర్ బ్రాండ్లుగా పేరు తెచ్చుకున్న కొడాలి నాని, రోజా, పేర్నీ నాని, అంబటి రాంబాబు వంటి వారు విపక్ష నాయకులపై బూతులతో విరుచుకుపడడమే తప్ప అప్పులపై టిడిపి ప్రచారాన్ని సమర్ధంగా తిప్పికొట్టలేకపోయారు. ఫలితంగా పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ప్రచారం విషయంలో ఇంత పూ ర్ గా వైఎస్ఆర్సిపి నాయకత్వం ఉంటే కేవలం పార్టీ ప్రచారం కోసం పెట్టుకున్న సొంత పత్రిక సాక్షి కూడా ఈ విషయంలో విఫలమైంది.

ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తోంది అన్న ప్రచారానికి సాక్షి పత్రిక కూడా పరిమితమైంది. టిడిపి అనుకూల మీడియా పథకం ప్రకారం వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని జనాల్లో పలచన చేస్తుంటే ఈ అప్పుల వెనుక ఉన్న మర్మాన్ని సాక్షి పత్రిక సరిగా వివరించలేకపోయింది. 14 లక్షల కోట్ల అప్పు ఒక ప్రభుత్వం తేవడం అసాధ్యమని, అందుకు రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు అనుమతించవని, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వదని జనానికి వివరించి చెప్పడంలో అటు పార్టీ, ఇటు సాక్షి విఫలమయ్యాయి.

పబ్లిసిటీ చేసుకోవడంలో వైఎస్ఆర్సిపి ఇంతగా వెనకబడి ఉంటే టిడిపి మాత్రం కేవలం పబ్లిసిటీని నమ్ముకునే పార్టీ నడుపుతోంది. ఇప్పటికీ హైదరాబాదును నిర్మించింది చంద్రబాబు అని, అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమని అటు టిడిపి, ఇటు వారి అనుకూల మీడియా జనాన్ని బలంగా నమ్మించ గలిగాయి . 1996లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారం చేపట్టినది మొదలు విజన్ 20-20 అంటూ ప్రచారం చేసుకున్నారు. 2024లో అధికారం చేపట్టింది మొదలు విజన్ 2047 అని సరికొత్త ప్రచారం మొదలుపెట్టారు.

2047లో రాష్ట్ర జిడిపి ఎలా మెరుగుపరుస్తాం, తలసరి ఆదాయం ఏ మేరకు పెంచుతాం అన్నదాన్ని ఇప్పట్నించే ప్రచారం చేసేస్తున్నారు. ఆయన గతంలో చెప్పిన విజన్ 2020 ఆవిష్కరించిందీ లేదు. భవిష్యత్తులో 2047 విజన్ సాధ్యమయ్యేది కాదు. అయినా ఆ పార్టీ గాని, వారి మీడియా గానీ ఒక పథకం ప్రకారం చంద్రబాబును ఒక విజనరీగా, మేధావిగా ప్రచారం చేసుకుంటూ పోతాయి. ఏమీ లేనిదానికి వారు ప్రచారం చేసుకుంటుంటే… చేసిన మంచిని చెప్పుకోవడం గాని, చేయని తప్పులను వివరించి చెప్పడంలో గాని వైఎస్ఆర్సిపి విఫలం అవుతోంది.

వైయస్సార్సీపి హయాంలో ఏపీ ప్రభుత్వం చేసిన భూ సంస్కరణల కారణంగా తాజాగా కేంద్ర ప్రభుత్వం 400 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం ఖాతాలో జమ చేసింది. దీనిపై కూటమి ప్రభుత్వం కనీసం ప్రకటన కూడా చేయలేదు. సీఎంగా జగన్మోహన్ రెడ్డి పేదల కొనుగోలు శక్తి పెంచడానికి జనం ఖాతాలో డబ్బు జమ చేశారు. నిజానికి ఆ మేరకు జనం కొనుగోలు శక్తి పెరిగింది కూడా. డబ్బు పంపిణీ వల్ల మార్కెట్ కు ఒక జోష్ వచ్చింది. జిడిపి కూడా పెరిగింది.

ఇవి కాగ్, ఆర్బిఐ వంటి కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సంస్థలు చెప్పిన వాస్తవాలు. ఈ క్రెడిట్ ను కూడా జగన్ ఖాతాలో వేయడంలో అటు సాక్షి పత్రిక, ఇటు వైఎస్ఆర్సిపి విఫలమయ్యాయి. తమకు ఎలా పబ్లిసిటీ చేసుకోవాలో తెలియకపోయినా ఎదుటి పార్టీని, అపోజిషన్ కి అనుకూలంగా ఉన్న మీడియాను చూసి అయినా ఇటు వైఎస్ఆర్సిపి, సాక్షి పత్రిక తమ పార్టీకి ఏ విధంగా పబ్లిసిటీ ఇవ్వాలో తెలుసుకుంటే భవిష్యత్తులోనైనా జగన్మోహన్ రెడ్డికి మేలు జరుగుతుం తుందని ఆ పార్టీ అభిమానులు అంటున్నారు.